గుంటూరు: అక్రమ కేసులతో వైయస్ఆర్‌సీపీని అణిచివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటే మరింత బలోపేతం అవుతామని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు హెచ్చరించారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ వంటి తప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవడం చంద్రబాబు అవివేకమని అన్నారు. వైయస్ జగన్ లక్ష్యంగానే ఈ లిక్కర్ స్కామ్‌ను సృష్టించారని, ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను దీనిలో ఇరికించి అరెస్ట్‌లు చేయడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అని మండిపడ్డారు. చంద్రబాబు ఏడాది పాలనలో కక్షసాధింపు మాత్రమే మిగిలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... కూటమి ప్రభుత్వ ఏడాది కాలంలో చంద్రబాబు ఇచ్చిన ఏ వాగ్ధానాన్ని అమలు చేయలేదు. పైగా వైయస్ఆర్‌సీపీ పై కక్షసాధింపులతో కుట్రలు పన్నారు. చాలా సందర్భాల్లో కూటమి పార్టీల నేతలు వైయస్ఆర్‌సీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయంటూ విమర్శించారు. కానీ పదకొండు సీట్లు వచ్చిన వైయస్ఆర్‌సీపీని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు పార్టీని అణిచివేయాలని తహతహలాడుతున్నారు? ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఇందుకోసం ఏం చేసిందో అందరికీ తెలుసు. అనేక మందిపై తప్పుడు కేసులు పెట్టారు. తాజాగా మరో దుర్మార్గమైన కార్యక్రమానికి తెర తీశారు. లిక్కర్ స్కామ్ అంటూ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మరో అధికారి కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. చంద్రబాబు హయాంలో కూడా ధనుంజయరెడ్డి కీలక స్థానాల్లో పనిచేశారు. జగన్ గారి ప్రభుత్వంలో సీఎంఓలో పనిచేశారనే కారణంతోనే ఆయనను, ఓఎస్‌డీగా పనిచేశారని కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. అంతకు ముందు వికాట్ సంస్థకు చెందిన డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది కాలంగా చంద్రబాబు, లోకేష్‌లు చేస్తున్నది ఈ అరెస్ట్‌లే. కుట్రలు పన్నడంలో చంద్రబాబు ఆరితేరారు గతంలో వైయస్ఆర్ మరణం తరువాత వైయస్ జగన్‌ను, ఆయన స్థాపించిన వైయస్ఆర్‌సీపీని నామరూపాలు లేకుండా చేయాలని చంద్రబాబు ఆనాడు కాంగ్రెస్‌పార్టీ నాయకురాలు సోనియా గాంధీతో కలిసి కుట్రలు చేశారు. అనేక మంది ఐఎఎస్ అధికారులను జైలుకు పంపారు. చివరికి వైయస్ జగన్‌ను కూడా పదహారు మాసాలు జైలుపాలు చేశారు. ఎందరు ఎన్ని కుట్రలు చేసినా వైయస్ఆర్‌సీపీ ప్రజాబలంతో పుంజుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబుతో కలిసిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో నామరూపాలు లేకుండా పోయింది. నేడు కూడా చంద్రబాబు అదే పంథాలో నడుస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులను ప్రయోగించి, అరెస్ట్‌లతో భయపెట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. దీనికి ప్రతీకారంగా వైయస్ఆర్‌సీపీకి చెందిన ముఖ్యులంతా కూడా జైలులో ఉండాలనే దురుద్దేశంతోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. స్కిల్ స్కామ్‌ను కేంద్రప్రభుత్వం, దాని ఆధీనంలో పనిచేసే ఈడీ వెలుగులోకి తీసుకువచ్చింది. స్కామ్‌లు చేయడంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరు. అలాంటి చంద్రబాబు మాపైన కక్షతో లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించారు. ఈ రాష్ట్రంలో మద్యంను నియంత్రించాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ ప్రభుత్వం ద్వారానే విక్రయాలు చేయించారు. దానికి కూడా పరిమిత వేళలనే నిర్ణయించారు. ఈ రోజు చంద్రబాబు లిక్కర్‌ను ఆదాయ మార్గంగా చేసుకుని బెల్ట్‌షాప్‌లు, పర్మిట్ రూంలు, పదిరూపాయలు అదనంగా విక్రయించడం, అర్థరాత్రులు విక్రయించడం, మద్యం డోర్‌డెలివరీ కూడా చేయిస్తున్నారు. జగన్ సన్నిహితులను అరెస్ట్ చేసి, జైలుకు పంపితే ఆయన భయపడిపోతారని చంద్రబాబు, లోకేష్‌లు కలలు కంటున్నారు. నిత్యం పత్రికల్లో అరెస్ట్‌ల వార్తలు మాత్రమే చూడాలి తప్ప, కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీల గురించి ఎక్కడా ప్రశ్నించే వార్తలు రాకూడదనేదే వారి అసలు ఉద్దేశం. అందుకే ప్రతి పదిహేను రోజులుకు ఒకసారి కేసులు, అరెస్ట్‌లంటూ హంగామా చేస్తుంటారు. భారతదేశంను పరిపాలించిన బ్రిటీష్ వారు కూడా ఆనాటి భారతీయులపైన ఇన్ని కేసులు పెట్టలేదు. ఒక కేసులో బెయిల్ రాగానే, మరో కొత్త కేసును తెర మీదికి తీసుకువస్తున్నారు. పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఒక దుర్మార్గమైన పాలనను సాగిస్తున్నారు. లిక్కర్ స్కామ్ రాజకీయ దురుద్దేశంతో సృష్టించిందే రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల ముందస్తు పిటీషన్ సందర్భంగా సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ స్కామ్ పేరుతో నమోదు చేసినది రాజకీయ ప్రమేయంతో కూడినదైనట్లుగా కనిపిస్తోంది, అయినా ఈ సమయంలో దీనిపై జోక్యం చేసుకోం అని పేర్కొంది. అయినా ఈ కేసులో ముద్దాయిలను సరైన విధంగా ట్రీట్ చేయకపోతే కోర్ట్‌లు జోక్యం చేసుకుంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కృష్ణమోహన్‌రెడ్డి, థనుంజయరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్ట్‌కు హాజరుపరిచేందుకు సిద్దమయ్యారు. సెకీ సీఎండీ బదిలీపైనా 'ఈనాడు' సిగ్గులేని రాతలు చంద్రబాబుపై అతి ప్రేమతో ఈనాడు పత్రిక సిగ్గుమాలిన తప్పుడు వార్తలు రాస్తోంది. సెకీతో వైయస్ జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మకం, అందుకు నాకు శాలువా కప్పి సన్మానించాల్సింది పోయి, విమర్శలు చేస్తారా అని గతంలో వైయస్ జగన్ ప్రశ్నించారు. దీనిని ప్రస్తావిస్తూ తాజాగా సెకీ సీఎండీనీ తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందని, జగన్ ప్రభుత్వంపై గతంలో వచ్చిన ఆరోపణలే దీనికి పరోక్ష కారణం అంటూ సిగ్గు లేకుండా ఈనాడు తప్పుడు వార్తలు రాసింది. చెరుకూరి కిరణ్‌కు ఇలాంటి వార్తలు ప్రచురించేందుకు కాస్తైనా బుద్దీ,జ్క్షానం ఉండాలి. సెకీతో 2021లో వైయస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సమయంలో ప్రస్తుతం బదిలీ అయిన సెకీ సీఎండీ ఆర్పీ గుప్తా లేరు. 2023లో సెకీ సీఎండీగా ఆర్పీ గుప్తా వచ్చారు. ఆయనను ఎందుకు తొలగించారో నాలుగు రోజుల కిందట అన్ని జాతీయ పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి. అనీల్ అంబానీకి చెందిన సంస్థ తప్పుడు పత్రాలతో సెకీ కాంట్రాక్ట్‌లకు టెండర్లు వేసిన ఘటనలో ఆయనపై ఈ బదిలీ వేటు వేశారని జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దానిని విస్మరించి వైయస్ జగన్ వల్లే సెకీ సీఎండీనీ బదిలీ చేశారంటూ ఈనాడు నిస్సిగ్గుగా తప్పుడు వార్తలను, వక్రీకరణ కథనాన్ని ప్రచురించింది. వైయస్ జగన్‌ను అరెస్ట్ చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ . మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ...ఏపీలో శాంతిభద్రతలు లేవు. మొత్తం పోలీస్ వ్యవస్థ చంద్రబాబు కబంధ హస్తాల్లో చిక్కిశల్యమైంది. ఇప్పుడు మద్యం కుంభకోణం పేరుతో వైయస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకోని ఆయనను అరెస్ట్ చేయాలని, భౌతికంగా ఆయనకు హాని చేయాలనే లక్ష్యంతోనే కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు పిడికిల్లో పోలీస్ వ్యవస్థ బంధీ అయ్యింది. పోలీసులు తమకు తామే బేడీలు వేసుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. దీనిలో భాగంగానే ఒక డీజీపీ స్థాయి అధికారిని జైలుకు పంపారు. ప్రభుత్వ మారగానే విధి నిర్వహణలో పనిచేసిన పోలీస్ అధికారిపై కక్షసాధింపుతో తప్పుడు కేసులు నమోదు చేయడం ఈ ప్రభుత్వ దుష్ట సంప్రదాయానికి నిదర్శనం. మతతత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మొత్తం దేశమంతా పాకిస్తాన్‌పై యుద్దం ప్రకటిస్తే, ఏపీలో మాత్రం ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీపై చంద్రబాబు రాజకీయ కక్షలతో యుద్దం ప్రకటించారు. రాష్ట్రంలో అక్రమ అరెస్ట్‌లు, తప్పుడు కేసులతో ప్రతిపక్షాన్ని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోంది. ఇవ్వన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయస్ జగన్ అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు ఎవరైతే గీతదాటి వ్యవహరించారో వారు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇటీవలే రాప్తాడు నియోజకవర్గంలో లింగమయ్య అనే వైయస్ఆర్‌సీపీ బీసీ నాయకుడిని హత్య చేశారు. దీనిని మరిచిపోక ముందే అనంతపురంజిల్లా రాప్తాడు నియోకవర్గంలో పార్టీకి చెందిన నారాయణరెడ్డి, ముత్యాలమ్మ అనే దంపతులను దారుణంగా టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రోద్భల్యంతో హత్య చేసినట్లుగా స్థానిక ప్రజలు చెబుతున్నారు. వారి హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తూ పోతే సమాజంలో శాంతి ఉంటుందా?