చంద్రబాబు నిర్ణయాలే పోలవరానికి శాపం

మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

ప్రాజెక్ట్‌ పనుల తీవ్ర జాప్యానికి, ప్రస్తుత పరిస్థితికి..

ముమ్మాటికీ చంద్రబాబునాయుడే బాధ్యుడు

ప్రొటోకాల్‌ పాటించకుండా ప్రాజెక్టు పనులు చేశారు

బాబు తప్పిదం వల్లనే     డయాఫ్రమ్‌ వాల్‌ ధ్వంసమైంది ఇది అంతర్జాతీయ నిపుణుల మాట. వారి నివేదిక

:గుర్తు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు మరో తప్పిదం

ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం చేయడం

కానీ, 45.72 మీటర్లకు ప్రధాని ఒప్పుకున్నారంటున్నారు

ఒకవేళ అదే నిజమైతే, కేంద్ర క్యాబినెట్‌ దాన్ని తీర్మానిస్తే..

ఆ క్యాబినెట్‌ నోట్‌ చూపండి. నిజం నిగ్గు తేల్చండి

నేను వెంటనే మీకు క్షమాపణలు చెబుతాను

మాజీ మంత్రి అంబటి రాంబాబు సవాల్‌ 

పోలవరంపై చంద్రబాబుకు ఏ చిత్తశుద్ధి లేదు

కమిషన్లపై యావ తప్ప, పూర్తి చేసే «ధ్యాస లేదు

ప్రాజెక్టుపై చంద్రబాబుకు కమిట్‌మెంట్‌ ఉంటే..

2004కు ముందు పనులు ఎందుకు చేపట్టలేదు?

ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు సూటి ప్రశ్న

గుంటూరు: పోలవరం ప్రాజెక్టుపై శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, పచ్చి అబద్ధాలు చెప్పారని, గత మా ప్రభుత్వంతో పాటు, నాటి వైయస్సార్‌గారి ప్రభుత్వంపైనా నిందలు వేశారని వైయస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామని, తామే స్వయంగా కడతామని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసినా, కమిషన్ల కోసం కక్కుర్తి పడిన చంద్రబాబు, ప్రాజెక్టును తామే కడతామని తీసుకుని, ఆ ప్రాజెక్టును సర్వనాశనం చేశారని ఆక్షేపించారు. గుంటూరులోని క్యాంప్‌ ఆఫీస్‌లో వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు

ఆనాడే ఎందుకు చేపట్టలేదు?:
    పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన 1941లోనే వచ్చింది. అంజయ్యగారి హయాంలో 1981లో శంకుస్థాపన చేసి వదిలేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి, వెన్నెముక అంటున్న చంద్రబాబు, మరి వైయస్సార్‌గారు వచ్చి పునాది వేసి, పనులు చేసే వరకు ఎందుకు స్పందించలేదు?. 1995లో మీరు సీఎం అయ్యారు. 2004 వరకు మీరు ఆ పదవిలో ఉండి కూడా, జీవనాడి ప్రాజెక్టు ఎందుకు చేపట్టలేదు? పునాది వేసి పనులు ఎందుకు చేపట్టలేదు?.
    ఎందుకంటే, ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పం మీకు లేదు. కనీసం ఆ ఆలోచన కూడా మీకు లేదు. అదే వైయస్సార్‌గారు 2004లో పనులు మొదలు పెట్టి, రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టారు. కుడి, ఎడమ కాల్వలు తవ్వారు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన మరణించారు. ఆ తర్వాత ప్రాజెక్టును ఎవరూ పట్టించుకోలేదు.

కేంద్రమే కడతామన్నా..:
    2014లో రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. పనులు వారే పూర్తి చేస్తామన్నారు.
కానీ, చంద్రబాబు ఏం చేశారు? తామే కడతామని తీసుకున్నారు. అసలు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ చేతుల్లోకి ఎందుకు తీసుకుంది? అది చరిత్రాత్మక తప్పిదం. దాని ఫలితమే ప్రస్తుత పరిస్థితి. 2016లో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
    అప్పుడు చంద్రబాబు చేసిన మరో తప్పిదం.. 2013–14 ధరలతో ప్రాజెక్టు పనులు చేస్తామని ఒప్పుకోవడం. అదెలా సాధ్యం?. అంటే కేవలం కమిషన్ల కోసం, తనవారికి పనులు అప్పగించడం ఆయన లక్ష్యం, ఉద్దేశం.
అయినా అన్నింటికీ మమ్మల్ని బాధ్యులను చేస్తున్నారు.
    ఇంకా తెలంగాణ నుంచి ఏడు మండలాల విలీనం చేయడంలో తనది కీలకపాత్ర అంటున్నారు. కానీ, నిజానికి అది విభజన చట్టంలోనే స్పష్టంగా ఉంది. దానిపైనా చంద్రబాబు అసత్యాలు చెబుతూ, అది తన ఘనత అంటున్నారు.

ప్రాజెక్టు పనులపై ఆనాడేమన్నారు?:
    పోలవరం ప్రాజెక్టు పనుల్లో 72 శాతం 2019 నాటికి చేశామని, ఆ తర్వాత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం కేవలం 3.8 శాతం పనులే చేసిందని చంద్రబాబు విమర్శిస్తున్నారు. మరి, ఆనాడు చంద్రబాబు ఏమన్నారు? 2018లో పోలవరం నుంచి నీళ్లిచ్చిన తర్వాతే, 2019లో ఎన్నికలకు వెళ్తామన్నారు. అదే మాట అసెంబ్లీలో అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు.
    మరి పనులు పూర్తి చేశారా? పనులు చేయకపోయినా, అదే పనిగా ప్రచారం చేసుకున్నారు. భజన చేయించుకున్నారు.

మాకు నాలెడ్జ్‌ లేదన్నారు. మరి మీకు?:
    నాపైనా చంద్రబాబుగారు విమర్శ చేస్తూ.. నాకు టీఎంసీలు, క్యూసెక్స్‌ తెలియవని, డయాఫ్రమ్‌ వాల్‌ అంటే తెలియదని అన్నారు. ఔను నేను ఇంజనీర్‌ను కాదు. కానీ, మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక, అన్నీ తెలుసుకున్నాను.
    మరి నీవు చాలా తెలివైనవాడివి కదా? గతంలో ఒకసారి ఏమన్నావ్‌?. ‘కాఫర్‌ డ్యామ్‌ లేకుండానే డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలని అనుకున్నాం’ అని చెప్పావు. అది ఎలా సాధ్యం అనుకున్నావు.
    ఇంకా చెప్పాలంటే చంద్రబాబు చేసిన అనేక తప్పిదాల వల్ల పోలవరం ప్రాజెక్టు చాలా ఆలస్యం అయింది. ఆ ప్రాజెక్టు సర్వనాశనం అయింది. ఇది వాస్తవం.

ఇదీ చంద్రబాబు తప్పిదం:
    అసలు ఏ ప్రాజెక్టు అయినా, కట్టేటప్పుడు నీరు మళ్లిస్తారు. గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువ. ఒక్కోసారి 50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. కానీ, చంద్రబాబు ఏం చేశారంటే, నీరు డైవర్ట్‌ చేసేలా అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, స్పిల్‌వే.. వాటిలో ఏదీ పూర్తి చేయకుండానే డయాఫ్రమ్‌ వాల్‌ కట్టారు. 
    డయాఫ్రమ్‌ వాల్‌ అంటే..ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ పునాది. అది ప్రాజెక్టు మధ్యలో ఉంటుంది. నదీ ప్రవాహం మళ్లించకుండా దాన్ని కట్టడం వల్ల, వరద ఉధృతికి అది కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్‌వాల్‌ను 2016లో గ్యాప్‌–2 లో ప్రారంభించి చరిత్రాత్మక తప్పిదం చేశారు. 
    పోనీ, కాఫర్‌ డ్యామ్‌ అయినా పూర్తి చేశారా? అంటే అదీ లేదు. సగం పనులు చేశారు. నది డైవర్షన్‌ చేయకుండా, కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేస్తే, నదీ ప్రవాహానికి కొట్టుకుపోతుందని, దాని మధ్యలో గ్యాప్‌లు పెట్టారు. ఫలితంగా మీ హయాంలోనే డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడం మొదలైంది. అది ఒక్కటే కాదు.. కాఫర్‌డ్యామ్‌ వాల్‌కు కింద ఉన్న జెట్‌ డ్రౌటింగ్‌. అది కూడా దెబ్బతినడం మొదలైంది.

నిపుణుల నోట. అదే మాట:
    డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయిన తర్వాత.. ఏం చేయాలన్న దానిపై చర్చించి, దేశంలో ఉన్న నిపుణులతో అధ్యయనం చేయించాలని నిర్ణయించాం. ఆ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే, కేంద్రం నిపుణుల కమిటీ వేసింది. అందులో ఇద్దరు అమెరికా, ఇద్దరు కెనెడాకు చెందిన వారు. వారు ఇక్కడికి వచ్చి, అన్నీ అధ్యయనం చేసి, కేంద్ర జల స«ంఘానికి సమగ్ర నివేదిక ఇచ్చారు.
    వారు చెప్పిందేమిటంటే.. నదిని మళ్లించకుండా, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ కట్టాలనుకోవడం ఒక తప్పిదం. డయాఫ్రమ్‌ వాల్‌ను పూర్తి చేయడానికి కట్టిన కాఫర్‌ డ్యామ్‌లో గ్యాప్‌లు వదలడం మరో తప్పిదం అని వారు స్పష్టంగా చెప్పారు. అంటే, అన్ని అనర్థాలకు కారణం చంద్రబాబు, ఆయన ప్రభుత్వం.
    అయినా, చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అన్నింటినీ జగన్‌గారిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్న ఆలోచన, ఇంట్రెస్ట్‌ లేదు. ఎంతసేపూ, ఆ పనుల్లో కమిషన్లు గుంజుకోవడం తప్ప.

ఇదీ ఈ ఇరిగేషన్‌ మంత్రి నాలెడ్జ్‌:
    ఇప్పుడు ఒక ఇరిగేషన్‌ మంత్రి ఉన్నారు. ఆయనకు చాలా నాలెడ్జ్‌ ఉందంటారు. కానీ, ఆయన ఏమన్నారంటే.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును, కేంద్రం రీయింబర్స్‌ చేస్తే, జగన్‌గారు డైవర్ట్‌ చేశారట. అది రాష్ట్ర ప్రభుత్వ నిధి. అంతకు ముందు ఖర్చు చేస్తే, కేంద్రం తిరిగి ఇచ్చింది. మరి ఆ నిధులు డైవర్ట్‌ చేయడం ఏమిటి? అదీ ఈ ఇరిగేషన్‌ మంత్రి పరిజ్ఞానం!

ఎత్తు తగ్గింపు మరో తప్పిదం:
    చంద్రబాబు మరో ఘోర తప్పిదం చేశారు. దాన్ని భవిష్యత్తులో కూడా సరి చేసుకోలేం. ఆనాడు పోలవరం ప్రాజెక్టులో తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు రూ.12 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. దాని కోసం మేము చాలా ప్రయత్నాలు చేశాం. దాంతో ఇటీవల కేంద్ర క్యాబినెట్‌ దానికి ఆమోదం తెలిపింది. అయితే దానికి ముందు కేంద్ర క్యాబినెట్‌లో ఒక తీర్మానం చేశారు.
    పోలవరం ప్రాజెక్టు పనులను రెండు దశల్లో.. ఒకటి 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల అడుగులో నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. అది ప్రాజెక్టు మాన్యువల్‌లోనూ ఉంది.
    కానీ ఇప్పుడు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేస్తూ, ప్రాజెక్టును కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ, ఆ నిధులు  ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఆ మేరకు క్యాబినెట్‌లో తీర్మానం చేశారు. ఇది వాస్తవం. అంటే ఇది టీడీపీ, బీజేపీ ప్రభుత్వ సంయుక్త నిర్ణయం.

ఇదే నా సవాల్‌:
    కానీ, చంద్రబాబు ఏం అన్నారు? ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రధానిగారు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఒకవేళ అది నిజమైతే, క్యాబినెట్‌ నోట్‌ చూపండి. అది చూపితే, నేను క్షమాపణ చెప్పి, నోరు మూసుకుంటాను. ఇదే నా సవాల్‌.
    మీరు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల రాష్ట్రం చాలా నష్టపోతుంది. కేవలం 115 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకోగలం. 195 టీఎంసీల నీరు వాడుకోలేం. దాని వల్ల చాలా నష్టం. చాలా వాటికి నీరందదు. ఆ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు గోదావరిలో కలిపారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేస్తున్నారు.

మా హయాంలోనే వేగంగా పనులు:
    మా హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి.  స్పిల్‌వే పూరై్తంది. మా టైమ్‌లోనే ప్రాజెక్టు గేట్లు బిగించాం. నది మళ్లింపు చేశాం. అంటే, పైలట్‌ ఛానల్‌ కూడా పూర్తి చేశాం. రెండు కాఫర్‌ డ్యామ్‌లు కూడా మేమే పూర్తి చేశాం.
    కానీ చంద్రబాబు తన హయాంలో 72 శాతం పనులు పూర్తి చేశానని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. దాన్ని తన ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.

మరో విషయం:
    రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులు వచ్చాయంటే, అదంతా వైయస్సార్‌గారి «ఘనతే. వెలుగొండ కానీ, గుండ్లకమ్మ కానీ.. ఏదైనా ఆయన హయాంలోనే కట్టారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి, అది సర్వనాశనం కావడానికి చంద్రబాబే కారకుడు. ప్రపంచంలో ఎవరూ కూడా, నది డైవర్షన్‌ లేకుండా, ప్రాజెక్టు కట్టరు. కానీ చంద్రబాబు ఆ పని చేశారు. దాన్ని సమర్థించుకోవడానికి ఇవాళ తంటాలు పడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

Back to Top