ముఖ్యమంత్రుల భేటీలో అంశాలు రహస్యమెందుకు?

మీడియా సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సూటి ప్ర‌శ్న‌

విభజన సమస్యలపై ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ చర్చించారా? 

ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన అంశాలను బహిర్గతం చేయాలి

మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్.

పోలవరం 7 ముంపు మండలాలతో పాటు, టీటీడీలో, పోర్టుల్లో తెలంగాణ వాటా అడిగిందని వార్తలొచ్చాయి

వీటిపై చంద్రబాబు, మంత్రుల మౌనం దేనికి సంకేతం?

గతంలో ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని ఆస్తులు వదిలేసి పారిపోయి వచ్చిన బాబు

ఇప్పుడు మరోసారి ఏపీకి ద్రోహం చేసేలా బాబు తీరు

9, 10వ షెడ్యూల్ లోని ఆస్తులు, విద్యుత్ బకాయిలు, ప్రాజెక్టుల సమస్యలు చర్చించారా?

డ్రగ్స్ గురించి మాట్లాడటానికి అంతదూరం వెళ్లడం దేనికి?

వైయ‌స్ జగన్ గారి చొరవతో పోలవరంపై ఛత్తీస్ గఢ్, ఒడిశాతో సమస్యలు కొలిక్కి వచ్చాయి.

పోలవరానికి ద్రోహం చేసింది ముమ్మాటికీ చంద్రబాబే

నాగార్జున సాగర్ లో మన భాగాన్ని స్వాధీనం చేసుకున్నది వైయస్ఆర్ సీపీ హయాంలోనే

బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సామాన్యుడి గొంతుకై జగన్ గారు విజృంభిస్తారు: అంబటి రాంబాబు. 

తాడేపల్లి:  ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన చర్చల వివరాలను బహిర్గతం చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సీఎంల భేటీ అంత రహస్యమెందుకని ప్రశ్నించారు. 7 మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న ప్రతిపాదనతో పాటు, తిరుమల ఆదాయంలో, పోర్టుల్లో, కృష్ణా జలాల్లో వాటా కావాలంటూ… తెలంగాణ ప్రభుత్వం అడిగిందని మీడియాలో వార్తలు వస్తే వాటిపై చంద్రబాబు స్పందించకపోవడం పై అందరికీ అనుమానాలు కలుగుతున్నాయన్నారు. చంద్రబాబు మరోసారి ఏపీకి తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారని అంబటి ధ్వజమెత్తారు.  తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి సోమవారం మీడియాతో మాట్లాడారు.

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఇంకా ఏమన్నారంటే…

పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలి ఎందుకు పారిపోయి వచ్చారు?
రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయ్యిందని, విభజన అనంతరం ఏపీలో అనేక సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని అంబటి రాంబాబు అన్నారు. దాని వల్ల మనకు తీవ్రంగా నష్టం జరుగుతోందని అనేకసార్లు చంద్రబాబు కూడా వ్యాఖ్యానించారన్నారు. విభజన అనంతరం ఏపీకి చంద్రబాబు సీఎం అయి, 5 సంవత్సరాలు పాలించారన్నారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే వెసులుబాటును విభజన చట్టంలో పొందుపరిచినా… ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా.. చంద్రబాబు  ఎందుకు ఏపీకి పారిపోయి వచ్చారో చెప్పాలని డిమాండ్ చేసారు. 
బస్సులో ఉండి పరిపాలన చేయాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందో కూడా సమాధానం చెప్పాలన్నారు. ఓటుకు కోట్లు కేసులో తప్పుచేయడంతో బాబును మెడపట్టి గెంటేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ నుంచి  భయపడి పారిపోయి వచ్చి,  ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం చేశారని చంద్రబాబుపై అంబటి ధ్వజమెత్తారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ను వదిలి, 9, 10వ షెడ్యూల్ లో ఉన్న, విభజన చట్టంలో ఉన్న ఆస్తులు పంపకం చేసుకోకుండా, బేరసారాలు ఆడకుండా, చర్చలు జరపకుండా పారిపోయి వచ్చి నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు ప్రథమ ద్రోహం చేసిన వ్యక్తి అవునా? కాదా? ఆలోచన చేయాలన్నారు. ఐదేళ్లు పరిపాలన చేసి ఏం చంద్రబాబు ఏం సాధించారన్నారు. 
హైదరాబాద్లో అన్ని ఆఫీసులు ఖాళీ చేసి,  జీ హుజూర్ అని సలాం పెట్టి వచ్చేసి ఇక్కడ తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కట్టారని, పదేళ్లు సమయం ఉంటే ఎందుకు తాత్కాలికంగా కట్టాలని అంబటి ప్రశ్నించారు. వెళ్లకపోతే ఊరుకోం, మిమ్మల్ని కేసులో పెట్టేస్తాం అని వాళ్లు అంటే తప్పు చేసి, భయపడి ఏపీకి అన్యాయం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు అని తేల్చి చెప్పారు.
ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి మరొక అన్యాయం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆంబటి మండిపడ్డారు.  

విభజన సమస్యలపై నోరెత్తారా? 
రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలున్నాయని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారా, లేదా న్యాయ స్థానాల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. 9, 10వ షెడ్యూళ్లలో ఉన్న బిల్డింగులు, ఆస్తులు మనకు రావాల్సినవి ఉన్నాయని, రూ.7 వేల కోట్ల విద్యుత్ బకాయిలు మనకు రావాల్సి ఉందన్నారు. వాళ్లు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించామని, కేంద్రం ఆదేశించినా తెలంగాణ ఇవ్వలేదన్నారు. ఈ అంశం న్యాయస్థానాల్లో ఉందన్నారు. దాని గురించి చంద్రబాబు ఇప్పుడు మాట్లాడటం లేదన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు సరిహద్దులో ఉన్నాయని, వీటిలో అనేక సమస్యలున్నాయన్నారు. వాటి గురించి చంద్రబాబు మాట్లాడారా? అని ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు నీళ్లు వెళ్లాలంటే 881 అడుగుల స్థాయిలో ఉంటే తప్ప వెళ్లవని, అక్కడిదాకా తెలంగాణ వాళ్లు నీళ్లను రానిస్తున్నారా? అని ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తి కోసం అక్కడి దాకా రాకుండా చేస్తున్నారన్నారు. దీని వల్ల రాయలసీమ నష్టపోతోందని, ఈ సమస్య గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ లో కుడి కాల్వకు నీళ్లు ఇవ్వాలంటే తెలంగాణ అనుమతి కావాలన్నారు. తాళాలు వాళ్ల దగ్గర ఉన్నాయన్నారు. మన ప్రాంతం కూడా వాళ్ల స్వాధీనంలోకి వెళ్లిందన్నారు. చంద్రబాబు అసమర్థత వల్లే ఇలా వెళ్లిందన్నారు. మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ యాక్షన్ ద్వారా మనం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమయంలో కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకుని తొందరపడవద్దు, మేం పరిష్కరిస్తాం అని హామీ ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు హ్యాండోవర్ చేశామని గుర్తు చేశారు. దీని గురించి ఏమైనా చంద్రబాబు మాట్లాడారా? అని ప్రశ్నించారు. పోలవరం 51.72 స్థాయికి పెరిగితే భద్రాచలం మునిగిపోతందని ఇంతకు ముందు తెలంగాణ మంత్రులు మాట్లాడారని, ఇది కరెక్టు కాదన్నారు. దాని గురించి ఏమైనా చర్చించారా? అని ప్రశ్నించారు. డ్రగ్స్ గురించి మాట్లాడటానికి ఇంత మంది వెళ్లాలా? అని ప్రశ్నించారు. ఏదీ దొరక్క ఆ టాపిక్ ను తెరపైకి తెచ్చారన్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన ప్రత్యేక హోదా కోసం నల్ల దుస్తులు వేసుకుని అసెంబ్లీలో హడావుడి చేశారని, ఇప్పుడు మీ మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం వచ్చినా హోదా అడిగేందుకు ఎందుకు భయపడుతున్నారని అంబటి ప్రశ్నించారు.

ఏపీ ఆస్తుల్లో తెలంగాణ వాటా అడగడంపై మౌనం ఎందుకు?
ఏపీకి సుమారు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, ఇందులో తమకు వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిందని అన్ని పత్రికల్లో, మీడియాలో వస్తోందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో 48 శాతం వాటా, అన్ని పోర్టుల్లోనూ వాటా, కృష్ణా జలాల్లోనూ వాటా కావాలని తెలంగాణ అడిగిందని వార్తలు వచ్చాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విభజన చట్టం ప్రకారం 7 మండలాలను ఏపీలో కలిపారని, వాటిని వెనక్కు ఇచ్చేయాలని అడిగారని వార్తలు వచ్చాయన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎం, మంత్రులు ఎవరూ దీనిపై స్పందించలేదన్నారు. సమాధానం చెప్పకుండా వెళ్లారంటే ఇవన్నీ నిజమేనని అనుకోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేశారని, ఇది మరింత అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారనుకున్నామని, వాళ్లు మాట్లాడలేదన్నారు. మంత్రివర్గ సభ్యులు వచ్చి మాట్లాడినా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయారన్నారు. 

తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు ఏపీకి బాబు ద్రోహం
తెలంగాణ, ఏపీ రెండూ తనకు రెండు కళ్లు లాంటివని చంద్రబాబు అన్నారని, అంటే దాని అర్థం సమానంగా చేసుకుంటాననే కదా అని అంబటి ప్రశ్నించారు. తెలంగాణలో మీ పార్టీని బతికించుకోవడం కోసం తెలంగాణ కోరే అసంబద్ధ కోర్కెలకు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. పార్టీ పరంగా రెండు రాష్ట్రాలూ ముఖ్యం అని చంద్రబాబు చెప్పుకుంటే తప్పు లేదని, కానీ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ కూడా నాకు సమానం అంటే ఏదో ద్రోహాన్ని ఏపీకి తలపెట్టే ప్రమాదం ఉందన్నారు. 

పోలవరానికి చంద్రబాబు ద్రోహం
పోలవరం విషయంలో చట్టంలో ఏపీకి, ఛత్తీస్ గఢ్ కు, తెలంగాణకు కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. ఛత్తీస్ గఢ్ కు, ఒడిశాకు ఉన్న వివాదాలు జగన్ మోహన్ రెడ్డి గారి చొరవ వల్ల దాదాపు పరిష్కార దశకు వచ్చేశాయన్నారు. పోలవరం వల్ల ఒడిశాకు, ఛత్తీస్ గఢ్ కు ముప్పు రాదు అని సీడబ్ల్యూసీ కోర్టులో అఫిడవిట్ కూడా ఇచ్చిందన్నారు. ఇవాళ తెలంగాణలో కొత్త సమస్య తీసుకొచ్చారన్నారు. 7 మండలాలను ఏపీలోకి విలీనం చేయడం చట్టంలో ఉందన్నారు. కానీ తెలంగాణ అడిగిందని ఇవాళ మళ్లీ ఇచ్చేసేలా పరిస్థితులు వచ్చాయని, ఇది చాలా ద్రోహమన్నారు. పోలవరానికి ద్రోహం చేసే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. గోబెల్ ప్రచారం చంద్రబాబుకు ఎక్కువగా ఉంటుందన్నారు. ఒకే వార్త భయంకరంగా వండేస్తారన్నారు. పోలవరం సంక్షోభంలోకి రావడానికి కారణం జగన్ మోహన్ రెడ్డి గారి రివర్స్ టెండరింగ్ వల్లేనని మాపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్ ను మార్చడం వల్లనో, రివర్స్ టెండరింగ్ వల్లనో పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరగలేదని స్పష్టం చేశారు. నష్టం జరిగిందల్లా చంద్రబాబు తెలివితక్కువతనం వల్లేనన్నారు. నది డైవర్షన్ చేయకుండా డయాఫ్రం వాల్ వేసి కాఫర్ డ్యామ్ ను నిర్మాణం ప్రారంభించడం వల్ల మాత్రమే ఇది జరిగిందని చెప్పారు. ఆ తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం రివర్స్ టెండరింగ్, కాంట్రాక్టర్ ను మార్చారు అని పదే పదే మాట్లాడుతున్నారన్నారు. పోలవరంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, పోలవరంపై వచ్చే డబ్బులపైనే ఆయనకు ధ్యాస ఉందని, ఈ మాట సాక్షాత్తూ ప్రధాని మోదీనే అన్నారని గుర్తు చేశారు. విభజన సమస్యలపై జగన్ మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడటం, సీఎస్ లతో, బేడీతో కమిటీలు వేయడం జరిగిందన్నారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ కమిటీలు వేయడం వల్ల ఎవరికి ఉపయోగమన్నారు. 

వైయ‌స్‌ జగన్  సామాన్యుడి గొంతుకై విజృంభిస్తారు
చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే సామాన్యుడి గొంతుకై వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు విజృంభిస్తారని స్పష్టం చేశారు. మీరు చేసిన ప్రతి వాగ్దానాన్నీ నిలబెట్టుకున్న రోజునే మీరు మీ పార్టీ మనుగడ సాగిస్తుందని తెలిపారు. వైయస్ జయంతిని ఎవరైనా చేసుకోవచ్చని, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. 

Back to Top