మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టు

పేదలకు ఉచిత వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు 

తమ వారికి అడ్డగోలుగా కట్టబెట్టెందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ

ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ

విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య నివాసంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు

తాసీల్దార్ కార్యాలయాల్లో ఎమ్మార్వోలకు వినతిపత్రం

పలుచోట్ల వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం

అయినా ప్రైవేటీకరణ ఆగేవరకు పోరాటం ఆగదు 

స్పష్టం చేసిన బొత్స సత్యనారాయణ 

విజయనగరం:  ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రజారోగ్యానికి తీరని నష్టమని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్శయ్య నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని, పేదలకు వైద్య విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు నిర్ణయంపై మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసే  ప్రైవేటీకరణ  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపట్టాం.  అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, స్వచ్చంధ సంస్ధలు, విద్యార్ధులు, మేధావులతో కలిసి  ఎమ్మార్వో కార్యాలయాల్లో  నిరసన ర్యాలీ నిర్వహించి.. గౌరవ గవర్నర్ గారికి తాసీల్దార్లు ద్వారా వినతిపత్రం సమర్పించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాం. ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

● పోలీసుల తీరు అభ్యంతరకరం...

అదే సమయంలో ప్రభుత్వ ఒత్తిడితో అక్కడక్కడ పోలీసులు ఈ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తూ..  కార్యక్రమాన్ని నిర్వహించకుండా ఆపే ప్రయత్నం చేయడం దారుణం. ప్రభుత్వ విధానాన్ని, పోలీసులు వ్యవహారశైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు, రాజకీయ పార్టీలు వారి అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం ఉండాలి. అయితే ప్రభుత్వం  పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం దుర్మార్గం. 
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ర్యాలీగా వెళ్తున్న మా పార్టీ కార్యకర్తలపై పోలీసులు ఇబ్బంది పెడుతూ వారిపై దౌర్జన్యం చేయడం దారుణం. సుమారు గంటపాటు ప్రజలనూ ఇబ్బంది పెట్టారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సహజం. కానీ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మాత్రం పోలీసులే రాస్తారోకో, ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది చాలా తప్పుడు సాంప్రదాయం.  ప్రజల రక్షణ కోసం, చట్టాల పరిరక్షణ కోసం ఉద్దేశించిన వ్యవస్థలు ఇలా వ్యవహరించడం సరికాదు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. శాంతియుతంగా ఉన్న జిల్లాలో  కొత్త సాంప్రదాయాన్ని అధికారులు సృష్టించడం భావ్యం కాదు. 

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రజారోగ్యానికి సంబంధించినది, పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేస్తున్న ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళన కార్యక్రమమిది. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం దొరకాలన్నా... పేద ప్రజలు వైద్యరంగంలో ఉన్నత విద్యను అభ్యసించాలన్నా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అవసరం. అప్పుడే సామాన్యుడికి మేలు జరుగుతుంది. ప్రైవేటు వైద్య కళాశాలలోనూ, ప్రైవేటు ఆసుపత్రులలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి మేలు జరగదు. ప్రైవేటు కాలేజీలలో సీటు రావాలంటే అధిక మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడంతో పాటు చాలా వ్యయప్రయాసలకు ఓర్చుకోవాలి. అదే ప్రభుత్వ వైద్య కళాశాలలో నాణ్యమైన వైద్య విద్య పేదలకు ఉచితంగా అందుతుంది. కానీ దురదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వం పేదలను ఉచిత వైద్యానికి, వైద్య విద్యకు దూరం చేస్తోంది.
ఇప్పటికే ఆరోగ్యశ్రీకి తూట్లు పొడిచిన కూటమి ప్రభుత్వం.. పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైయస్.జగన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆందోళన చేపట్టింది. త్వరలోనే జిల్లా కేంద్రాల్లోనూ కోటి సంతకాల ఉద్యమం చేపట్టి.. ఆ ప్రతులను గౌరవ గవర్నర్ గారికి సమర్పించి ప్రజల వాణిని వారి దృష్టికి తీసుకురావడమే మా ఉద్దేశం.

● ప్రైవేటీకరణ ఆగేవరకు పోరాటం...

ఎన్ని ఆందోళనలు చేసినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు. అవినీతితో ఎలా దోచుకోవాలన్న ఆలోచన తప్ప మరో ప్రాధాన్యత లేదు. అందుకే మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. అధికారం శాశ్వతం కాదు. ప్రజల మద్ధతుతో మరలా మేం అధికారంలోకి వస్తాం. ప్రజారోగ్యాన్ని పరిరక్షించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ.. వారిని దోచుకోవడానికి సిద్ధమవుతున్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి  మంగళం పాడుతామని... తిరిగి ఆ కాలేజీలను ప్రభుత్వ పరం చేస్తామని స్పష్టం చేశారు. మరోసారి స్పష్టం చేస్తున్నాం.. ఈ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం చేస్తాం. 

● చేయని పథకాలకు చంద్రబాబు ప్రచారం...

కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల ఇళ్లు కట్టామని గొప్పగా పత్రికల్లో ప్రచారం చేసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ 3 లక్షల ఇళ్లకు  ఎప్పుడు భూసేకరణ చేశారు? ఎప్పుడు ఇళ్ల నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు? సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మీకున్న అలవాటు ప్రకారం గతంలో ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే.. అది నా వల్లే అని చంకలు గుద్దుకోవడం మీకలవాటు. అందులో భాగంగానే మీరు కట్టని ఇళ్లకు మీ పేరు పెట్టకుని లక్షలాది రూపాయలతో ప్రచారం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలకు మసిపూసి మారేడు కాయ చేసి... క్రెడిట్ తీసుకోవడం తప్ప ఇది మా కార్యక్రమం అని గొప్పగా చెప్పుకునే ఒక్క పథకమూ మీ దగ్గర లేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్ధులకు వైద్య విద్య ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలన్నదే తమ పార్టీ విధానమని..అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...

ధర్మారెడ్డిని విచారించిన తర్వాత అధికారులు ఎలాగూ దాన్ని అధికారికంగా ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో చెబుతారు. ఈ లోగా మీకు తోచినట్లు రాస్తే... ఆ పాపం కచ్చితంగా చుట్టుకుంటుంది. విచారణలో ఎలాగూ వాస్తవాలు బయటకు వస్తాయి. అంతే తప్ప తప్పుడు వార్తలతో స్వామి వారికి అపచారం తలపెట్టి.. ఆయన ప్రతిష్టను దిగజార్చవద్దు. 

వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయకుడిపై వచ్చిన ఆరోపణలతో మా పార్టీ నేతలు గుడివాడ అమర్నాధ్, కేకే రాజులు బాధిత విద్యార్థి తండ్రితో కలిసి వాస్తవాలు వెల్లడించారు. దానికి ఇంతవరకు వారి దగ్గర నుంచి సమాధానం కూడా లేదు. చట్టం తమ చేతిలో ఉందన్న ధీమాతో... ప్రభుత్వంలో ఉన్నవాళ్లు లేనిపోనివి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కక్షసాధింపు చర్యల కోసం ఈ రకంగా దిగజారుతున్నారు. 

ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు తేడా ప్రజలందరికీ తెలుసు. కేవలం తమ తాబేదార్లకు మేలు చేయడం కోసమే పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేస్తూ... ప్రభుత్వ మెడికల్ కాలేజీలను... పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారు. 
18 నెలల పాలనలో రైతులను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇ-క్రాప్ లేదు, ఉచిత పంటల బీమా లేదు, పంట నష్టపరిహారం లేదు. అన్నింటినీ పూర్తిగా గాలికొదిలేసింది. రైతు భరోసా కేంద్రాలను మూతపెట్టింది. ఆర్బీకేల ద్వారా గతంలో ఎరువులు, విత్తనాలు ఇచ్చే విధానానికి పుల్ స్టాప్ పెట్టారు. ఇన్సూరెన్స్ స్కీం అటకెక్కించారు. ఫలితంగా మొంధా తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు కనీసం ఆదుకునే పరిస్థితిలేదు. రాష్ట్రంలో 80 లక్షల మంది రైతులుంటే కేవలం 19 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకున్నారు. వివిధ బ్యాంకులలో రుణాల కోసం ఇన్సూరెన్స్ తప్పనిసరి కాబట్టే... వాళ్లు కూడా తీసుకున్నారు. ఇప్పటికీ తుపాన్ ప్రబావంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసిన పరిస్ధితి లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రైతులు దగా పడుతూనే ఉన్నారు. ఆయన మారాడనుకోవడం భ్రమ మాత్రమే అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Back to Top