రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

వ్యవసాయం పండుగ చేస్తాం. రైతు ముఖంలో సంతోషం చూస్తాం

ఆక్వా రైతులకు విద్యుత్‌ రాయితీలు

వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు వేయిస్తాం

పెట్టుబడి కోసం రైతు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండదు

మండలాల్లో కోల్డ్‌ స్టోరేజీలు, నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటా

రుణమాఫీ అని రైతులను చంద్రబాబు వంచన చేశారు

ప్రతి గ్రామంలో భూములు లాక్కునే మాఫియాను తయారు చేశాడు

చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించండి

ప్రతి కుటుంబంలో సంతోషం నింపుతా

రేపల్లె సభలో వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రేపల్లె: రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుంది. అన్నం పెట్టే రైతు కడుపు మాడుతుంటే బాధగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలన పోవాలంటే మనందరి ప్రభుత్వం రావాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా రేపలెల్లో వైయస్‌ జగన్‌ బహిరంగ సభ నిర్వహించారు. సభకు అశేషంగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జననేత ప్రసంగించారు.. 

 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో 20 రోజుల్లో ఓట్లు వేసే తరుణం. ఇదే రేపల్లె ప్రజలను అడుగుతున్నా.. మున్సిపాలిటీ, రేపల్లె రూరల్‌ మండలాల్లో గానీ ఒక్కసారి అడుగుతున్నా.. రెండ్రోజులకు ఒకసారి తాగునీరంట. అది కూడా 20 నిమిషాలంట. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ పాలన సాగుతుంది. నిజాంపట్నం నగరం మండలాల్లో గతంలో రెండు పంటలు పండే ఈ ప్రాంతంలో ఇవాళ పంటలకు విరామం ప్రకటించిన దుస్థితి నెలకొంది. 15 వేల ఎకరాలకు సాగునీటికి కటకట అనే పరిస్థితి. నాన్నగారి హయాంలో 6 లిఫ్టులు పెట్టి 15 వేల ఎకరాలకు మేలు చేస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరో 2 లిఫ్టులు పెట్టండి అని ప్రజలు గట్టిగా అడుగుతున్నా.. గట్టిగా కోరుకుంటున్నా.. కనీసం పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. నిజాంపట్నం రేవులో హార్బర్‌ ఉంది. పడవలు నిలుపుకోవడానికి అక్కడ స్థలం లేదు. సరైన రోడ్డు కూడా లేదు హార్బర్‌కు పోవడానికి, మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్, వైట్‌ కిరోసిన్‌ అందడం లేదు. వేట నిషేదం సమయంలో ఇవ్వాల్సిన రూ. 4 వేలు కూడా అందడం లేదు. ఇలాంటి పాలనను మనం చూస్తున్నాం. 

 

ఇదే రేపల్లెల్లో దాదాపు 18 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా.. ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఆక్వా రైతులు ఇవాళ నష్టంలో ఉన్నారా.. లాభాల్లో ఉన్నారా.. ఆలోచన చేయాలి. పంట చేతికి వచ్చే సమయానికి దళారులు ఏకమవుతున్నారు. రేట్లు దబాలున పడేస్తున్నారు. పంట చేతికి వచ్చే సరికి వ్యవసాయం, ఆక్వా రంగంలో ఇదే పరిస్థితి. వంట కౌంట్‌ రొయ్యల ధర రూ. 270 ఉంటే కాని గిట్టుబాటు కాదు.. ఇప్పటికే రూ. 200లకు పడిపోయింది. ఏప్రిల్‌ వచ్చే సరికి ఏ స్థాయికి పడిపోతుందో తెలియని పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. 

 

3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో పాదయాత్ర పూర్తి చేశాను. పాదయాత్రలో రైతన్న కష్టాన్ని చూశాను. బాధలు విన్నాను. రైతు పరిస్థితి చూస్తే ‘తాను కరిగిపోతూ మనకు వెలుగునిచ్చే కొవ్వత్తిలా అయిపోయింది’ రైతుకు మిగిలేది కష్టం. రైతుకు మిగిలేది నష్టం అన్నట్లుగా తయారైంది ఈ ఐదేళ్ల పాలన. నా సుదీర్ఘ పాదయాత్రలో మూడు ప్రాంతాల్లోని రైతుల కష్టాలు దగ్గర నుంచి చూశా.. అన్నం పెట్టే రైతు ఆకలితో మాడుతుంటే ప్రభుత్వం కాకపోతే ఆదుకునేవారు ఇంకెవరు ఉంటారనే ఆలోచన నా మనస్సులో సాగాయి. అలాంటిది చంద్రబాబు పాలనలో రైతుకు చేయని అన్యాయం లేదు. రైతుకు మిగిల్చింది దుఖ్ఖమే ఈ ఐదు సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు రైతన్నల నోట్ల నుంచి వచ్చిన ఆవేదన చూసి బాధ అనిపించింది. వ్యవసాయ రుణమాఫీ మోసం కాబట్టే ఐదేళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రూ. 87,612 కోట్ల రుణాలు ఉంటే ఇప్పుడు ఆ రుణాలు వడ్డీలతో తడిసిమోపెడయి ఏకంగా రూ. 1.50 లక్షల కోట్లకు చేరింది. వడ్డీలకు కూడా చాలని ఆ రుణమాఫీ అనే పథకం చివరి రెండు విడుతలు ఎన్నికలు షెడ్యూల్‌ వచ్చాక పోస్ట్‌డేటెడ్‌ చెక్కులు ఇస్తున్నాడనే రైతులు ఆవేదన విన్నాను. 

 

రైతులకు సున్నావడ్డీలు లేవు, బీమా లేదు, ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. రైతుల భూములు బలవంతంగా లాక్కుంటున్న పరిస్థితి చూస్తున్నాం. రైతులు చెబుతున్న బాధలు వింటుంటే గుండె చలించిపోయింది. వెబ్‌ ల్యాండింగ్‌ పేరుతో రైతుల భూములు కొట్టేసేందుకు ప్రతి గ్రామంలో తన మాఫియాను తయారు చేశారు. ఇది సరిపోదని భూములు లాక్కునేందుకు భూసేకరణ చట్టాన్ని కూడా సవరణ చేశాడు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంట చూసినా గిట్టుబాటు ధర రాని అధ్వాన్న పరిస్థితుల్లో రైతులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు హెరిటేజ్‌ కంపెనీ లాభాల కోసం రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితిలో ఉండి హెరిటేజ్‌ కోసం దళారీలకు తానే కెప్టెన్‌గా ఉండి రేట్లను పతనం చేస్తున్నాడు. రైతన్న పడుతున్న బాధలు చూశాను, రైతన్న పడుతున్న కష్టాలు చూశాను.. ఆ రైతన్నకు చెబుతున్నా.. మీ కష్టాలు తీర్చేందుకు నేనున్నానని చెబుతున్నాను. రాష్ట్రంలో వ్యవసాయం మళ్లీ పండుగ చేస్తాం. నవరత్నాలతో ప్రతి రైతు మొహంలో చిరునవ్వు చూస్తామని భరోసా ఇస్తున్నా. 

 

దేవుడి దయతో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి రైతు కుటుంబానికి అండగా ఉంటాం. పెట్టుబడి కోసం రూ. 12,500లు ప్రతి సంవత్సరం మే నెలలోనే ప్రతి రైతు చేతిలో పెడతాం. పంట బీమా గురించి రైతులు ఆలోచన చేయాల్సిన పనిలేదు. రైతులు కట్టాల్సిన పంట బీమా మనమే కడుతామని చెబుతున్నా.. రైతుకు వడ్డీలేని పంట రుణాలు, రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల కరెంటు, ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయిన్నరకే ఇస్తాం. రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గించే కార్యక్రమం ముందుండి చేస్తాం. మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ ఇస్తాం. పంట వేసే ముందే పలానా రేటుకు కొంటామని ప్రకటిస్తాం. రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం. కరువు, అకాల వర్షాలు వచ్చినా రైతుకు నష్టం కలగకుండా తోడుగా ఉంటాం. ప్రతి మండలంలో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. మొదటి ఏడాదిలో సహకార రంగాన్ని పునరుద్దరిస్తాం. రెండో ఏడాది నుంచి సహకార డెయిరీలకు పాలుపోసే ప్రతి పాడి రైతుకు లీటర్‌కు రూ. 4 సబ్సిడీ ఇస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్, టోల్‌ ట్యాక్స్‌లు కూడా రద్దు చేస్తాం. ఏ రైతు కూడా ప్రమాదవశాత్తు మరణించవద్దని కోరుకుంటూనే.. పొరబాటున ప్రమాదవశాత్తు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైయస్‌ఆర్‌ బీమా ద్వారా రూ. 7 లక్షలు ఇస్తామని హామీ ఇస్తున్నా.. అంతేకాదు ఆ డబ్బును ఏ అప్పుల వాళ్లు ముట్టుకోకుండా అసెంబ్లీలో చట్టం చేస్తాం. ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటామని చెబుతున్నా.. 

 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్న జలయజ్ఞం పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం. పోలవరం, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం, జలకళలను కూడా తీసుకొస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుంది. రైతు కన్నీరు పెడితే అది రాష్ట్రానికి అరిష్టం అని నమ్ముతున్నా.. మీ అందరినీ ఒక్కటే వేడుకుంటున్నా.. నవరత్నాల గురించి మనం చెప్పాం. నవరత్నాలల్లోని ప్రతి అంశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి. గ్రామాల్లో ఉన్న ప్రతి అక్క, ప్రతి అన్న, ప్రతి చెల్లెమ్మ దగ్గరకు వెళ్లి చెప్పాలి. ప్రతి అవ్వా, ప్రతి తాత దగ్గరకు వెళ్లి చెప్పాలి. ఎన్నికల నాటికి చంద్రబాబు చెయ్యని మోసం ఉండదు. చెప్పని అబద్ధం ఉండదు, మనకు చూపని సినిమా కూడా ఉండదని ఎవరూ మర్చిపోవద్దు. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి చెప్పని అబద్ధం ఉండదు కాబట్టి, మనం పోరాటం చేస్తున్నది ఒక్క చంద్రబాబుతోనే కాదూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పోరాటం చేస్తున్నాం. ఇంకా అమ్ముడుపోయిన అనేక టీవీ చానళ్లతో యుద్ధం చేస్తున్నామని మర్చిపోవద్దు. 

ఎన్నికలు వచ్చే సరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టి మనల్ని మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.. మీ గ్రామాల్లో ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తాత, ప్రతి అవ్వ దగ్గరకు వెళ్లండి. వారందరికీ చెప్పండి.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు ఆ ప్రతి అక్కకు సంవత్సరానికి రూ. 15 వేలు ఇస్తాడు అన్న అని చెప్పండి. మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ వంటి చదువులు చదివించాలన్నా.. మనం ఆ పరిస్థితుల్లో ఉన్నామా అని అడగండి. ఫీజులు చూస్తే సంవత్సరానికి రూ. లక్షలు దాటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లలను చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేకపోతున్నాం అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టండి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరువాత మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్‌ వంటి చదువులను ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న చదివిస్తాడని ప్రతి అక్కకు చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అక్కా.. ఐదేళ్లు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. ఎన్నికలప్పుడు పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామన్నాడు.. మాఫీ చేయకపోగా గతంలో వచ్చే సున్నా వడ్డీ కూడా ఎగరగొట్టిన పరిస్థితిని చూస్తున్నాం.. 20 రోజులు ఓపిక పట్టు అక్కా అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఎంతైతే రుణాలు ఉంటాయో మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా మీకే ఇస్తారక్కా అని చెప్పండి. పేదరికంలో ఉండి అలమటిస్తున్న బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకు చెప్పండి... 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలలోపు ఉన్న అక్కలకు చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం.. ప్రతి అక్క చేతిలోనూ వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొస్తున్నాడు.. అక్షరాల రూ. 75 వేలు ప్రతి అక్కచేతికి నాలుగు దఫాలుగా ఇస్తాడని చెప్పండి. ప్రతి అవ్వాతాతల దగ్గరకు వెళ్లి ఆ అవ్వను ఒకే ఒక్క మాట అడగండి మూడు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. రూ. వెయ్యి అని మాత్రమే చెబుతుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే చంద్రబాబు ఇచ్చేవాడా అని అడగండి. అవ్వాతాతలకు చెప్పండి చంద్రబాబు మోసాలకు బలికావొద్దు.. 20 రోజులు ఓపిక పట్టండి.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.. పెన్షన్‌ రూ. 3 వేలకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

నవరత్నాలతో ప్రతి పేదవాడి జీవితాల్లో మార్పులు, ప్రతి రైతు ముఖాల్లో చిరునవ్వు ఉంటుంది. ప్రతి పేదవాడు సంతోషంగా ఉండే పరిస్థితి తీసుకొస్తాడన్నా అని ప్రతి ఇంటికి చెప్పాలి. అగ్రిగోల్డ్‌ బాధితులకు చెబుతున్నా.. మీ బాధలు నేను విన్నాను. మీకు తోడుగా ఉంటానని ప్రతి బాధితుడికి చెబుతున్నా.. మన పార్టీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా మోపిదేవి వెంకటరమణను నిలబెట్టాం. మీ అందరి చల్లని దీవెనలు రమణ అన్నపై ఉంచాలని కోరుతున్నాం. అదేరకంగా మీ ఎంపీ అభ్యర్థిగా సురేష్‌ నిల్చోబోతున్నాడు. మంచివాడు యువకుడు, ఉత్సాహ వంతుడు, మీ అందరి చల్లని దీవెనలు సురేష్‌పై ఉంచాలని పేరు పేరునా ప్రార్థిస్తున్నా.. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని మర్చిపోవద్దు. 

 

తాజా వీడియోలు

Back to Top