అనంతపురం: చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల మెప్పుకోసం మంత్రి పయ్యావుల కోసం పాకులాడుతున్నారని, అందులో భాగంగానే రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును థెఫ్టు ప్రాజెక్టు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుని సంతృప్తి పరచడం కోసం ఒక పద్ధతి ప్రకారం రాయలసీమ ప్రాంతానికి సంజీవని లాంటి ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. అసలు పనులే మొదలు కాలేదన్న కూటమి నాయకులు.. వైయస్ఆర్‌సీపీ ప్రాజెక్టు వీడియోలు, ఫొటోలు విడుదల చేశాక మాట మార్చి సాగునీటి ప్రాజెక్టు అని కొత్త పల్లవి అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు అనుమతులు వచ్చే వరకు వేచి చూడకుండా సాగునీటి ప్రాజెక్టు పేరుతో మొదలు పెడతారన్న విషయం తెలిసి కూడా ప్రజలను మాయ చేసేందుకు కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి విషప్రచారం మొదలుపెట్టారని వివరించారు. తెలంగాణలో శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కూడా సాగునీటి ప్రాజెక్టుగానే మొదలైందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎలాగోలా ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలు మేలు చేయాలని ఆలోచించకుండా మన ప్రాజెక్టులను మనమే ఆపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో నిర్మాణం జరుపుకొంటున్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తన కేసులను ఎత్తివేయించుకోవడానికి పెద్ద పెద్ద లాయర్లను నియమించుకుని వందల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లిస్తున్న చంద్రబాబు, రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద వాదనలు వినిపించడానికి కనీసం లాయర్లను కూడా నియమించలేదని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ● థెఫ్టు ప్రాజెక్టుకి రూ. 190 కోట్లు ఎలా చెల్లించారు? రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబుతో మాట్లాడి తానే మాట్లాడి ఆపేయించానని రేవంత్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడితే చంద్రబాబు ఇంతవరకు ఖండించకపోగా రాయలసీమ లిప్టు ప్రాజెక్టుతో ప్రయోజనమే లేదన్నట్టు మాట్లాడటం రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడవడమే. 40 ఏళ్ల అనుభవం, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు 20 టీఎంసీల గురించి ఇంత రాద్దాంతం అవసరమా అని మాట్లాడటం చూసి రాయలసీమ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 20 టీఎంసీలతో 2 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు విస్మరించడం చూస్తుంటే తన ప్రయోజనాల ముందు రాయలసీమ ప్రజల ప్రయోజనాలు చాలా చిన్నవిగా కనపడి ఉంటాయి. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ అభివృద్ధిని చంద్రబాబు పణంగా పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మరో అడుగు ముందుకేసి థెఫ్టు ఇరిగేషన్ అని మాట్లాడం సిగ్గుచేటు. థెఫ్టుకి అలవాటుపడిన మంత్రి కాబట్టే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. రాయలసీమ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిందిబోయి రాయలసీమ సాగునీటి ప్రయోజనాలను తీర్చే సంజీవని లాంటి ఎత్తిపోతల పథకం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటం దౌర్భాగ్యం. ఓటేసి గెలిపించిన ప్రజలకు ఎలా మేలు చేయాలో ఆలోచించకుండా రంధ్రాన్వేషణ చేయడం దారుణం. ప్రాజెక్టును సందర్శించానని చెబుతున్న మంత్రికి అక్కడ జరిగిన పనులు కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నా. ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వంతో సంబంధం లేకుండా రూ.900 కోట్లు బిల్లులు చెల్లించారని చెబుతున్న పయ్యావుల కేశవ్ ఆర్థికశాఖ మంత్రిగా ఎలా పనిచేస్తున్నాడో అర్థం కావడం లేదు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా బిల్లులు చెల్లించడం సాధ్యమేనా? కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ అనుమతితో బిల్లులు చెల్లించడాన్ని ఆయన ఎలా అభ్యంతరం చెబుతారు? పైగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ. 190 కోట్ల పెండింగ్ బిల్లులు కూడా చెల్లించింది. థెఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు రూ. 190 కోట్లు ఎలా ఇచ్చారు? అంటే, అందులో ఏమైనా వాటాలు తీసుకున్నారా ? ● వేస్ట్ ప్రాజెక్టు అయితే అసెంబ్లీలో చర్చ చేస్తారా? ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగేలా రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టను ఆపేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే ఖండించాల్సిన ప్రభుత్వ పెద్దలు ఒక్కొక్కరిగా ఆయన మాటలను సమర్థించి రాయలసీమ రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నారంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఏపీ ప్రజల ఓట్లతో గెలిచి తెలంగాణ సీఎం మాటలను ఎలా సమర్థిస్తున్నారు? ప్రజలను మభ్యపెట్టడానికి అసలీ ప్రాజెక్టు మొదలవనే లేదని కూటమి నాయకులు, ఎల్లో మీడియా బుకాయించింది. వైయస్ఆర్‌సీపీ నాయకులు మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకునిపోయి ప్రాజెక్టును సందర్శించి ఫొటోలు, వీడియోలు విడుదల చేశాక మాటమార్చారు. దాని వల్ల ప్రయోజనమే లేదని కొత్త పల్లవి అందుకున్నారు. ఒకవేళ కూటమి నాయకులు చెప్పినట్టు రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టు అనేది వేస్ట్ ప్రాజెక్టు అయ్యుంటే, తెలంగాణ అసెంబ్లీలో అంత వాడివేడిగా ఎందుకు చర్చ జరిగినట్టు? వైయస్ జగన్‌కి మంచి పేరొస్తుందనే భయంతో సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణకు చెందిన టీడీపీ నాయకులతో చెన్నై ఈఏసీలో కేసులు వేయించి అడ్డుకోవాలని చూశారు. అయినా అవన్నీ లెక్కచేయకుండా వైయస్ జగన్ గారు పనులు వాయువేగంతో పనులు నడిపించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు పూర్తిగా పక్కనపెట్టేశారు. ఈ ప్రాజెక్టుపై వేసిన కేసులు గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలో పదిసార్లు వాదనలు జరిగితే, ప్రభుత్వం కనీసం లాయర్‌ను కూడా నియమించలేదు. అనుమతుల గురించి ఆలోచిస్తూ మీనమేషాలు లెక్కిస్తే ఏ ప్రాజెక్టు ముందుకుసాగదు. తెలంగాణలో నిర్మించే చాలా ప్రాజెక్టులు ఇప్పటికీ అనుమతులు లేకుండా నిర్మిస్తున్నా, చంద్రబాబు మాత్రం నోరెత్తడం లేదు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సైతం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అని చెప్పి అనమతులు లేకుండానే కొనసాగిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా అలాంటిదే. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం రాయలసీమ ప్రయోజనాల గురించి కనీసం ఆలోచించకుండా రంధ్రాన్వేషణ చేసి తాగునీటి ప్రాజెక్టు అంటూ పెడర్ధాలు తీయడం చూస్తుంటే వారికి చంద్రబాబు ప్రయోజనాల కంటే రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యం కాదన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి రోజుకి 8 టీఎంసీల నీటిని తోడేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉంది. కానీ కూటమి ఎమ్మెల్యేలు ఇవన్నీ పట్టించుకోకుండా రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ● చంద్రబాబు ఆలోచనలన్నీ అమరావతి మీదనే చంద్రబాబు, రేవంత్‌రెడ్డి వద్ద మెప్పు కోసం పాకులాడుతూ కూటమి నాయకులు రాయలసీమ భవిష్యత్తును, రాయలసీమ ప్రయోజనాలను కాలరాస్తున్నారు. 101 టీఎంసీలకు గాను కనీసం 50 టీఎంసీలు కూడా రాకపోతే భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు ఎదురైతే రాయలసీమ పరిస్థితి ఏంటని వారు ఆలోచించడం లేదు. 2014 -19 మధ్య రాష్ట్రంలో ఉన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కూటమి నాయకులు పనిచేయాలి. రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు చంద్రబాబుపై ఒత్తిడి తేవాలి. గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులను అనుసంధానం చేయడానికి వైయస్ జగన్ గారు ప్రయత్నించారు. ఈ ఏడాదిన్నర కాలంలో దాన్ని చంద్రబాబు పూర్తి చేసి ఉంటే చిత్తూరు, కడప జిల్లాల్లో అదనంగా మరో లక్ష ఎకరాలు సాగులోకి వచ్చేవి. చరిత్రలో తొలిసారిగా గండికోట రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో నింపిన ఘనత, కుప్పం ప్రాంతానికి నీళ్లిచ్చిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది. తన కేసులు మాఫీ చేసుకోవడానికి లాయర్లకు వందల కోట్ల ఫీజులు చెల్లిస్తూ ప్రజాధనం ఖర్చు చేస్తున్న చంద్రబాబు, రాయలసీమ ప్రాజెక్టుకి అనుకూలంగా వాదనలు వినిపించడానికి మాత్రం ఆసక్తి చూపించడం లేదు. అమరావతి తప్ప చంద్రబాబుకి ఏమీ కనిపించడం లేదు.