రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం

 వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి 

హైకోర్టు ఏర్పాటును అడ్డుకుని బెంచ్‌ని చేస్తాననటం సరికాదు

హెచ్.ఎన్.ఎస్.ఎస్ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసిన ఘనత వైయ‌స్ఆర్‌ది

గండికోట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని వైయ‌స్‌ జగన్ పెంచారు

పోర్టులు, మెడికల్ కాలేజీలను వైయ‌స్ జగన్ తెస్తే వాటిని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు

తాడేపల్లి: సీఎం చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అభివర్ణించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైకోర్టు ఏర్పాటును అడ్డుకుని బెంచ్‌ని చేస్తాననటం సరికాదన్నారు.

 రాయలసీమకు చంద్రబాబు ద్రోహం:
– చరిత్ర ఎప్పుడూ క్షమించని విధంగా, భవిష్యత్తులో రాయలసీమ ఎప్పటికీ కోలుకోని విధంగా మా ప్రాంతాన్ని నాశనం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు. రాయలసీమకు చెందిన మంత్రితోనే రాయలసీమకు హైకోర్టు వద్దు.. బెంచ్‌ చాలు అని తీర్మానం చేయించి రాయలసీమను ఉద్దరించానని చెప్పడం చూసి ఈ ప్రాంత వాసిగా బాధపడుతున్నా. 
– తెలుగు ప్రజల ఐక్యత కోసం రాయలసీమ ఎంతో త్యాగం చేసింది. శ్రీబాగ్‌ ఒడంబడికలో రాజధాని ఒక చోట ఉంటే, హైకోర్టు మరో చోట ఉండాలని స్ఫష్టంగా చెప్పింది. అంచలంచెలుగా మా ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. హైకోర్టు వస్తే నాలుగు బెంచీలు, జిరాక్సు మిషన్లు తప్ప ఏమొస్తుందన్న చంద్రబాబు.. హైకోర్టు బెంచ్‌తో ఏమొస్తుందో సమాధానం చెప్పాలి. 
– కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా చేయాలని తలచి సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మొత్తాన్ని హైకోర్టునే తరలించి బెంచ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పడం దారుణం. శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన లా యూనివర్సీటీని, కడపలోని ఈఎంసీ సెంటర్‌ను ఎందుకు మారుస్తున్నారు?. 
– చంద్రబాబు చేస్తున్న ఈ పనులను చూసి రాయలసీమ వాసులంతా బాధపడుతున్నారు. ఇంత ద్రోహం ఎందుకు తలపెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. 
– సీఎం చంద్రబాబు ఇకనైనా రాయలసీమ నుంచి కంపెనీలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల తరలింపు ఆపాలి. 

నిస్సిగ్గుగా ప్రాజెక్టులపై అబద్ధాలు:
– హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌), గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్‌)ని తానే ప్రారంభించి పూర్తి చేశానని నిన్న అసెంబ్లీలో చంద్రబాబు చెబుతుంటే నవ్వొస్తోంది. మర్చిపోతాడో! లేక  ప్రజలను తప్పదారి పట్టిస్తున్నాడో.. అర్థం కావడం లేదు.
– 1995–2004 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగాడు. ఆ సమయంలో  ్ఛ ఆ రెండింటినీ కనీసం ప్రారంభించి ఉంటే నికర జలాలు కేటాయించబడేవి. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఏర్పడిందే 2004లో. అలాందిది అంతకు ముందు ఈ ప్రాజెక్టులు చంద్రబాబు మొదలుపెట్టి ఉన్నా నికరజలాలు కేటాయించబడేవి.
– ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ఈ విషయంలో రాయలసీమ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. 1983 లో ఎన్టీఆర్‌ ఆ రెండు పాజెక్టులు మొదలుపెట్టి పక్కన పడేస్తే, ఆయనకు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సైతం ఒకే టర్మ్‌లో రెండుసార్లు శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. ప్రాజెక్టు సామర్థ్యాన్ని తగ్గించాడు. 
– హంద్రీనీవా సుజల స్రవంతిలో 40 టీఎంసీలు కుదరదని, 4 టీఎంసీలకు కుదించి కేవలం తాగునీటికి వాడుకోవాలని జీవో ఇచ్చి శంకుస్థాపన చేశాడు. కానీ ఏ పని స్టార్ట్‌ చేయలేదు. గాలేరు నగరి సుజల స్రవంతికి సంబంధించిన గండికోటలో పెన్నా జలాలు గ్రావిటీ ద్వారా నడవాలని, 28 టీఎంసీలకు పెంచాలంటే అసలు ఆ ప్రాజెక్టే అవసరం లేదంటూ దాన్ని 2 టీఎంసీలకు కుదించాలని జీవో ఇచ్చాడు. 

అదంతా మహానేత వైయ‌స్ఆర్‌ ఘనత:
– అటువంటి స్థితిలో రాయలసీమకు సంబంధించి ఒకే టర్మ్‌లో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జీఎన్‌ఎస్‌ఎస్‌ను పూర్తి చేసిన ఘనత దివంగత మహానేత వైయ‌స్ఆర్‌దే. ఎడారిగా మారాల్సిన అనంతపురం జిల్లా ఇప్పుడు సస్యశ్యామలం అయిందంటే, అది వైయ‌స్ఆర్‌ కృషి ఫలితమే అని చిన్నపిల్లాడని అడిగినా చెబుతారు. అలాంటి ప్రాజెక్టులను తానే పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరం. ఘోరం. 
– 1995–2004 మధ్య ఏ రికార్డులు చూసినా ఆ ప్రాజెక్టులకు చంద్రబాబు ఒక్క రూపాయి కూడా కేటాయించిన దాఖలాలు లేవు. 
– వైయ‌స్ఆర్‌ హయాంలో పూర్తయిన ఫలితంగానే జీడిపల్లి రిజర్వాయర్, గొల్లపల్లి రిజర్వాయర్, మార్లం రిజర్వాయర్‌.. వరుసగా చేసుకుంటూ పోయిన ఫలితంగానే అనంతపురం ప్రాంతానికి కియా ప్రాజెక్టు వచ్చింది. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీటి సరఫరాకు అవకాశం ఉండడం వల్లనే కియా ప్రాజెక్టు వచ్చింది. 
– ఇంకా రాయలసీమలో శ్రీసిటీ, కొప్పర్తి పారిశ్రామిక వాడలు వైయ‌స్ఆర్ పుణ్యమే. కొన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయంటే అదంతా వైయ‌స్‌ జగన్‌ పుణ్యమే. 
– చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే, 80 శాతం పనులు పూర్తయిన రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తి చేయాలి. 
– గతంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును వ్యతిరేకించి రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన చంద్రబాబుని రాయలసీమ ప్రజలు క్షమించరు. 

ఎమర్జెన్సీ కన్నా దారుణం:
– రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎమర్జెన్సీ రోజుల్లో కూడా లేవు.
– విజయవాడ వరదల పేరు చెప్పి అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, పులిహోర ప్యాకెట్లకు ఖర్చు చేశామని విరాళాలు దోచుకుంటారా అని సోషల్‌ మీడియాలో ప్రశ్నించినందుకు కేసులు పెట్టి మా కార్యకర్తలను వేధిస్తున్నారు.   
– బోట్లతో ప్రకాశం బ్యారేజీ కూల్చి, మూడు లక్షల మందిని జలసమాధి చేయాలని కుట్ర చేశారని అసత్య ప్రచారం చేశారు.
– చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, హోంమంత్రి అనిత, నాటి టీడీపీ అధ్య్యక్షుడు అచ్చెన్నాయుడు,  మా నాయకుడు జగన్‌గారు, ఆయన కుటుంబంపై పెట్టిన అభ్యంతరకర పోస్టులు, మార్పింగ్‌ ఫొటోలు చూడండి..
అంటూ ఆ పోస్టులు చూపారు.
    అలాంటి వారు ఈరోజు నీతులు చెబుతున్నారు. జగన్‌గారిపై బురద చల్లుతూ, ఆయన వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. వాటిపై మేము పోలీసులకు సాక్ష్యాధారాలతో సహా, ఫిర్యాదు చేసినా ఏ చర్యా తీసుకోవడం లేదు. కనీసం కేసు కూడా నమోదు చేయడం లేదు.
– ఏ విమర్శలైనా పాలసీ మ్యాటర్‌ అన్నట్టుగానే ఉండాలనేది మా సిద్ధాంతం. అసభ్యకర పోస్టులు ఎవరు పెట్టినా మేం అంగీకరించం. చర్యలు తీసుకోంటే అభ్యంతరపెట్టం. కానీ వ్యక్తిత్వ హననానికి దిగితే మాత్రం ఒప్పుకోం. 
– వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో టీడీపీ కార్యకర్తలే అసభ్యకర పోస్టులు పెట్టి తిడితే.. ఆ విషయం తెలిసి కూడా నెపాన్ని మాపై నెడుతున్నాడు చంద్రబాబు. ఇదంతా కుట్రలో భాగం. 
– బాలకృష్ట ఇంటి నుంచే తనపై దారుణమైన పోస్ట్‌లు పెట్టారని స్వయంగా షర్మిల చెప్పారు. ఇవన్నీ తను చేస్తూ తాను నీతిమంతుడైనట్టు మాట్లాడటం ఆశ్చర్యకరం. చట్టం ఎవరికైనా ఒకేలా ఉండాలి. 

అదేపనిగా దుష్ప్రచారం:
– ల్యాండ్‌ గ్రాబింగ్‌ ఉండకూడదనే ఉద్దేశ్యంతో సమగ్ర భూసర్వే చేయిస్తుంటే మీ కోవర్టులతో దానిమీద దుష్ప్రచారం చేయించి నిర్మూలించిన ఘనత చంద్రబాబుది కాదా.. లేని ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేసినట్టు జనాన్ని భ్రమింపజేస్తున్న ఘనత చంద్రబాబుకి దక్కుతుంది. 
– భూముల సర్వే చేయకోపతే నిధులు ఇవ్వమని కేంద్రం చెప్పడంతో తానూ సర్వే చేయడానికి చంద్రబాబు పూనుకున్నాడు. వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా తీసుకొచ్చిన ప్రతి పథకం ప్రజల కోసమే.. దాని వెనుక ప్రజల బాగోగులు ఉన్నాయి.   
– భూసమస్యలకు శాశ్వత పరిష్కారం ఉండాలనే కారణంతో భూసంస్కరణలు తీసుకొస్తే ఆయనకు మంచిపేరొస్తుందనే కారణంతో బురదజల్లి వ్యక్తిత్వ హననానికి దిగాడు. 
– చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న తప్పుల కారణంగానే ఆలస్యమైందని, దాన్ని కవర్‌ చేసుకునేందుకు వైఎస్సార్‌సీపీపై డయాఫ్రం వాల్‌ కట్టలేదని నెపాన్ని నెడుతున్నాడు. 
– కరోనా సమయంలో ప్రపంచమంతా అతలాకుతలమైనా, దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా అన్ని గణాంకాల్లోనూ మెరుగైన పాలన వైఎస్‌ జగన్‌ చేసి చూపించారు.  
– గ్రోత్‌ రేట్, పర్‌ క్యాపిటా ఇన్‌కం.., మూల ధన వ్యయం.. ఇలా ఏ గణాంకాలు చూసినా విజనరీనని చెప్పుకుని తిరిగే చంద్రబాబు కన్నా మిన్నగా వైయ‌స్‌ జగన్‌ పాలన ఉంది. దానికి ఈ గణాంకాలే సాక్ష్యం.

ఏది మంచి ప్రభుత్వం?:
– 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటలు చెప్పడం కాదు.. ఉద్యోగాలు ఎవరిచ్చారో లెక్కలు చూస్తే విధ్వంసకర పాలన ఎవరిదో తెలుస్తుంది. 
– కమిషన్ల కోసం పోర్టులు, మెడికల్‌ కాలేజీలు ప్రైవేటుపరం చేస్తున్న ఘనత చంద్రబాబుది. 
– ఆఖరుకి రాష్ట్ర రహదారుల మీద కూడా టోల్‌ వసూలు చేస్తామని చెప్పడం కూడా విజనరీ నిర్ణయమా?.
– చంద్రబాబుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన పాలనలో జరిగిన ఒక్క మంచి కార్యక్రమైదైనా ఉంటే చూపించాలని, ఇప్పటికైనా విధానాలు మార్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సూచించారు.

Back to Top