నా జన్మకు ఈ అదృష్టం చాలు

బాపట్ల ఎంపీగా గెలిచి వైయస్‌ జగన్‌కు కానుకగా ఇస్తా

వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే సామాన్యులకు భరోసా

వైయస్‌ఆర్‌ సీపీ బాపట్ల నియోజకవర్గ లోక్‌సభ అభ్యర్థి నందిగాం సురేష్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: దళితుడినైన తనతో పార్లమెంట్‌ అభ్యర్థుల జాబితా విడుదల చేయించడం ఈ జన్మకు ఈ అదృష్టం చాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి నందిగాం సురేష్‌ అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక వ్యక్తిని నమ్మితే ఏ స్థాయిలో ఉంచుతారో తానే నిదర్శనమన్నారు. ఇడుపులపాయలో నందిగాం సురేష్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ఖర్చు కూడా భరించలేని తనను పార్లమెంట్‌ అభ్యర్థి ప్రకటించారని, బాపట్ల పార్లమెంట్‌లో విజయం సాధించి వైయస్‌ జగన్‌కు కానుకగా ఇస్తానన్నారు. సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం పనిచేసిన తనను బాపట్ల పార్లమెంట్‌ సమన్వయకర్తగా, మేనిఫెస్టో కమిటీలో మెంబర్‌గా నియమించారని, అంతేకాకుండా బాపట్ల లోక్‌సభ నుంచి పోటీ చేయడానికి అవకాశం కూడా కల్పించారన్నారు. సీట్లు అమ్ముకుంటున్నారని టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని, తనకు బాపట్ల సీటు కేటాయించడం వారి ప్రచారానికి చెంపపెట్టు అన్నారు. దళితుల పట్ల వైయస్‌ జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారన్నారు. 

 

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలంతా విసిగివేసారిపోయారని బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి నందిగాం సురేష్‌ అన్నారు. చంద్రబాబు, టీడీపీ అండ్‌ కో ఎన్ని కుట్రలు పన్నినా ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమన్నారు. ఒక ఐఏఎస్‌ అధికారి తనతో మాట్లాడుతూ.. పాదయాత్ర తరువాత వైయస్‌ జగన్‌లో ఓపిక చాలా పెరిగిందని చెప్పారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కంటే పాలనలో ఒక మెట్టు ముందుంటానని వైయస్‌ జగన్‌ చెబుతున్నారంటే ఆయన చిత్తశుద్ధి ఏంటో అర్థమైందని చెప్పారని గుర్తు చేశారు. పాదయాత్రలో ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నారని, వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో సామాన్యులకు భరోసా, ఉద్యోగులకు భద్రత పెరుగుతుందన్నారు. 

Back to Top