విద్యారంగానికి ఈ ప్ర‌భుత్వం పెద్ద పీట 

 విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విజ‌య‌వాడ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తుంద‌ని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడారు.  

అందరికీ నమస్కారం, టీచర్స్‌ డే శుభాకాంక్షలు, తల్లిదండ్రులతో పాటు గురువులను దైవసమానులుగా పూజించి గౌరవించే సంప్రదాయం మనది, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారు మన ఆంధ్రా యూనివర్శిటీ వీసీగా పనిచేయడం మనందరికీ గర్వకారణం. అందరూ కలిసి మెలిసి మెలగాలి, సమాజాన్ని మార్చేందుకు విద్య ముఖ్యమైన సాధనం అని గట్టిగా నమ్మిన వ్యక్తి ఆయన, వారి ఆలోచనలకు అనుగుణంగా ఉపాధ్యాయ వర్గమంతా పనిచేయాలని నేను ఆకాంక్షిస్తున్నా, గురు పూజోత్సవం సందర్భంగా అవార్డులు స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కోవిడ్‌ కారణంగా రెండేళ్ళుగా టీచర్స్‌ డే జరుపుకోలేకపోయాం, అయినా కూడా ఉపాధ్యాయులు విద్యార్ధులకు భోదనా కార్యక్రమాలు చేపట్టిన తీరు ఎంతో అభినందనీయం. ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం, విద్యార్ధులకు విద్యను నేర్పి, విజ్ఞానం నింపి, వారికి మానవతా విలువలు పెంపొందిస్తూ ఎందరినో ఉన్నతస్ధాయికి చేర్చిన ఉపాధ్యాయవర్గాల వారికి నా వందనాలు. సీఎంగారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ మన పిల్లలను గ్లోబల్‌ సిటిజెన్‌గా తీర్చిదిద్దాలనే తపనతో అనేక చర్యలు తీసుకున్నారు. ఈ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తుంది. మన బడి నాడు నేడు క్రింద సుమారు రూ. మూడు వేల కోట్లకు పైగా దాదాపు 16 వేల పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన ఘనత మన సీఎంగారిది, ఇది మొదటి విడత మాత్రమే, అలాగే రెండో విడత, మూడో విడత కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత మూడేళ్ళలో విద్యాసంస్ధల్లో మౌలిక సదుపాయాల కోసం విద్యారంగం మీద సుమారు రూ. 52,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం, పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా జాతీయ విద్యావిధానంకు అనుగుణంగా మార్పులు చేయడం, అధునాతన సదుపాయాలతో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటుచేయడం, అమ్మ ఒడి, విద్యా దీవెన వంటి ఎన్నో కార్యక్రమాలే కాకుండా నాలుగు నుంచి పదో తరగతి వరకు బైజూస్‌ కంటెంట్‌ను ఉచితంగా అందజేయడం, ఎనిమిదో తరగతి విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. పాఠశాలలన్నీ కూడా దశలవారీగా సీబీఎస్‌ఈకి అనుసంధానించడం కూడా జరుగుతుంది. విద్యారంగంలో ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చినా అవన్నీ విద్యార్ధులకు మెరుగైన నాణ్యమైన ప్రయాణంతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా తీసుకొస్తున్నాం. స్టూడెంట్‌ సెంట్రిక్‌ అనే చర్యను తీసుకుంటున్నాం, వీటిని సమర్ధవంతంగా అమలుచేసి ఉత్తమ పరిపాలనను సాధించడం ఉపాధ్యాయుల గురుతర బాధ్యతగా తీసుకోవాలని కోరుతున్నాను. సాధారణ ఉపాధ్యాయులు కేవలం తరగతి గదుల్లో, పాఠశాలల్లో మాత్రమే విద్యార్ధులతో సంబంధాలు పెట్టుకుంటారు, మంచి ఉపాధ్యాయులు తనదైన ముద్రతో పిల్లల మనసులో చిరస్ధాయిగా నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ పోటీని ఎదుర్కొని మెరిట్‌గా నిలిచి ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిన వారే, అలాంటి పోటీ తత్వాన్ని విద్యార్ధులలో కూడా పెంపొందించాలి, విద్యార్ధులు ఉపాధ్యాయుల మధ్య గ్రేడ్లు, మార్కులు మాత్రమే కాదు, పట్టుదల, వినయం, వ్యక్తిత్వం, సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదిగేందుకు అవసరమైన తోడ్పాటు అందించాలి. ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. పీఈటీ, లాంగ్వేజ్‌ పండింట్, స్కూల్‌ అసిస్టెంట్‌లకు, మోడల్‌ స్కూల్‌ టీచర్ల పదోన్నతులు కల్పించడమే కాకుండా పదవీ విరమణ వయసు పెంచాం, ఇదే కాకుండా మిగిలిన అధ్యాపక వృత్తిలో ఉన్న అందరికీ పదవీ విరమణ వయసు సీఎంగారు 62 సంవత్సరాలకు పెంచే విధంగా ఆదేశించారు. ఉపాధ్యాయులు కూడా ఈ ప్రభుత్వంలో భాగమే, ఇది ఉద్యోగులకు స్నేహపూరక ప్రభుత్వం, వారి ప్రయోజనాల పరిరక్షణలో సీఎంగారు ఎప్పుడూ ముందుంటారు, మారుతున్న కాలానికి అనుగణంగా విద్యార్ధుల బంగారు భవితకు అందరూ కలిసి బాటలు వేద్దాం, ఒక మనిషి వ్యక్తిత్వం, భవిష్యత్‌ను రూపొందించడంలో భోదన అనేది చాలా పవిత్రమైన వృత్తి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం గారు చెప్పిన మాటలను గుర్తుచేస్తూ ఏ విషయంలోనైనా ఏ సందర్భంలోనైనా ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యులు అనే నానుడితో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, విద్యారంగానికి పెద్దపీట వేసిన సీఎంగారికి మరొక్కసారి మీ అందరి తరపునా ధన్యవాదాలు అంటూ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

తాజా వీడియోలు

Back to Top