అమరావతి: ఈ నెల 25న దాదాపు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలపై ప్రసంగించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అతి తక్కువ సమయంలో 90 శాతం హామీలు అమలు చేశారు. పేదవాడికి సొంతిల్లు ఓ కల. ఈ కలను నిజం చేస్తూ సీఎం వైయస్ జగన్ పేదలకు సొంతిళ్లు అందజేస్తున్నారు. ఇది పేదలకు నిజంగా వరం. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు కేటాయిస్తున్నారు. దానికి అవసరమైన సామాగ్రి కూడా తక్కువ ధరలో అందించే కార్యక్రమం చేపట్టారు. ఇది పేదవారి పట్ల ఒక నాయకుడి తాలుక మనసును తెలియజేస్తోంది. ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఈ నెల 25వ తేదీన పెద్ద ఎత్తున చేపట్టనున్నాం. యావత్తు ప్రజలు ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. దీన్ని కూడా అడ్డుకునేందుకు ప్రతిపక్షం కోర్టుల్లో అడ్డుకోవాలని చూడటం సరికాదు. ప్రతిపక్షం ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు సహకరిస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. విమర్శలు ఎప్పుడు కూడా సద్విమర్శలుగా ఉండాలి. ప్రజల చేత అత్యంత ఆదరణ పొందిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. నాడు ప్రజా సంకల్ప యాత్రలో చెప్పిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ సత్ఫలితాలు ఇస్తోంది. ప్రజలు వేనోళ్ల కొనియాడుతున్నారు. వైయస్ జగన్ నిత్యం సీఎంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రతిపక్షం కూడా ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుంది. ప్రజలు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. మెరుగైన పాలన అందించేందుకు ప్రతిపక్ష విలువైన సలహాలు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నాం. పేదలు సంతోషించే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అందరూ సహకరించాలని ధర్మాన కృష్ణదాస్ కోరారు.