25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం ప్రపంచ రికార్డు

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
 

సింహాచలం:  సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలివ్వడం దేశంలోనే ప్రథమం అని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. ఇది ప్రపంచ రికార్డు అని తెలిపారు. ఇళ్ల స్థలాల పంపిణీ ద్వారా పేదలకు ఆస్తి ఇవ్వబోతున్నామని చెప్పారు. మంగళవారం గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజుతో కలిసి ఆయన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ..  పేదలకు పట్టాలు పంపిణీ చేస్తుంటే టీడీపీకి ఎందుకంత బాధ అని ప్రశ్నించారు.  టీడీపీ నేతల విమర్శలు దారుణమన్నారు. పేదలకి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం కన్నీళ్లు తుడిచే ప్రభుత్వమే కానీ.. కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వం కాదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో  నిబంధనలకి విరుద్దంగా వ్యవహరించటం లేదని సుభాష్‌ చంద్రబోస్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు తమ వైఫల్యాలను ప్రభుత్వం రుద్దాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.  వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.   
విచక్షణాధికారాల పేరుతో మండలి చైర్మన్ నిబంధనలకి విరుద్దంగా వ్యవహరిస్తే ఎలా చెల్లుబాటు అవుతుందని సుభాష్‌ చంద్రబోస్‌ ప్రశ్నించారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే తప్పనిసరిగా ఓటింగ్ జరగాలన్నారు. అలా కాకుండా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం కుదరదన్నారు. ఈ నిబంధనలు తెలియకపోతే యనమల మరోసారి రూల్స్ బుక్ చదువుకోవాలని సూచించారు. ఉద్యోగులను బెదిరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేయని ఉద్యోగులందరికి వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top