విజయవాడ: ఏలూరులో అంతుచిక్కని అనారోగ్యం బారిన పడి విజయవాడ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను డిప్యూటీ సీఎం ఆళ్లనాని పరామర్శించారు. కొద్దిసేపటి క్రితం మంత్రి విజయవాడ ఆసుపత్రిని సందర్శించి, బాధితులకు అందుతున్న వైద్యసేవలపై వైద్యాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అత్యున్నత వైద్య చికిత్స అందిస్తూనే కారణాలను గుర్తించేందుకు వివిధ రకాల నమూనాల విశ్లేషణ కొనసాగుతోందని మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. ఇప్పటికే సాంపిల్స్ సేకరించిన ఎన్ఐఎన్ సైంటిస్టుల బృందంతో సీఎం వైయస్ జగన్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రేపటిలోగా ప్రాధమిక నివేదిక ఇస్తామని ఎన్ఐఎన్ సైంటిస్టులు తెలిపారని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు అస్వస్థతతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి 585 మంది చేరగా.. 503 మంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. ఇంకా 82 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 32 మందిని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ,గుంటూరు తరలించారు. వింత వ్యాధితో ఎవరూ చనిపోలేదు: జీజీహెచ్ సూపరిన్‌టెండెంట్ శివశంకర్ ఏలూరులో అంతుచిక్కని అనారోగ్యం బారిన పడిన బాధితులు ఎవరూ చనిపోలేదని విజయవాడ జీజీహెచ్ సూపరిన్‌టెండెంట్ డాక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. కొన్ని మీడియా చానళ్లలో వస్తున్న కథనాలు నమ్మొద్దని ఆయన సూచించారు. ఏలూరు నుంచి ప్రతి రోజు వివిధ కారణాలతో ప్రతి రోజు రెగ్యులర్‌గా జీజీహెచ్‌కు కేసులు వస్తుంటాయని చెప్పారు. ఏలూరు నుంచి 25 కేసులు వచ్చాయని, వీరిలో ఇద్దరిని డిశ్చార్జ్ చేశామన్నారు. మిగిలిన 23 మంది ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఇతర ఆరోగ్య సమస్యలతో ఏలూరు నుంచి వచ్చిన ఇద్దరు మృతి చెందారని డాక్టర్ శివశంకర్ తెలిపారు. అప్పారావు టీబీతో, సుబ్బారావమ్మ కరోనా మృతి చెందారని డాక్టర్ వివరించారు.