కడుపులో కత్తులు పెట్టుకుని దళితులను కౌగలించుకుంటున్న బాబు 

దళితులు ఏం పీకుతారు అంటూ.. కండకావరంతో లోకేశ్ వ్యాఖ్యలు 
 
 మంత్రులు  మేరుగు నాగార్జున,  ఆదిమాలపు సురేష్ ఆగ్ర‌హం
 
వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా డాక్టర్‌ బాబాసాహేబ్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి కార్యక్రమం. 

 తాడేప‌ల్లి: కడుపులో కత్తులు పెట్టుకుని చంద్ర‌బాబు దళితులను కౌగలించుకుంటున్నార‌ని  మంత్రులు  మేరుగు నాగార్జున,  ఆదిమాలపు సురేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  దళితులు ఏం పీకుతారు అంటూ.. కండకావరంతో నారా లోకేశ్ వ్యాఖ్యలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. శుక్ర‌వారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.  అంబేద్క‌ర్ చిత్ర పటానికి రాష్ట్ర మంత్రులు  మేరుగ నాగార్జున,  ఆదిమూలపు సురేష్‌. ఎమ్మెల్సీలు  లేళ్ళ అప్పిరెడ్డి,  పోతుల సునీత. పలువురు నాయకులు పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. అనంత‌రం బాబాసాహెబ్‌ అంబేద్కర్‌పై వైయస్ఆర్ సీపీ నాయకుడు  పెరికె వరప్రసాద్‌ రచించిన పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు.
 
అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన:  మంత్రి  మేరుగు నాగార్జున 
 నాడు తీవ్ర కుల వివక్షను ఎదుర్కొని నిల్చిన బాబాసాహెబ్‌ అంబేద్కర్‌.. అప్పటి సమాజంలోని అస్పృశ్యత, అంటరానితనాన్ని రూపుమాపేందుకు అవిరళ కృషి చేశారు. ఏ కులంలో జన్మించినా ప్రతి ఒక్కరికీ సమాజంలో బతికే అవకాశం ఉందన్న ఆయన, ఆ సమ సమాజ నిర్మాణానికి అనువైన పరిస్థితులు ఏర్పడేందుకు ఎంతో చొరవ చూపారు. మన దేశం సమైక్యంగా ముందుకు సాగడంలో, నాడు అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రధాన కారణం. అంతటి మహనీయుడైన అంబేద్కర్‌ ఆశయాలు విరాజిల్లాలని సీఎం  వైయస్‌ జగన్‌ కోరుకుంటున్నారు. ఆ దిశలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్నింటా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతే కాకుండా బీసీలు, మైనారిటీలతో పాటు, అగ్రకులాల్లోని పేదల కోసం ఆయన పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నాడు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందాలని ఆశించారో.. నేడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సరిగ్గా అదే బాటలో నడుస్తూ.. ఆ మహనీయుని ఆశయాలు నిలబెడుతున్నారు.
    అదే గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం చంద్రబాబు నిత్యం రాజ్యాంగం అపహస్యం పాలయ్యేలా.. దళితులు, అణగారిన వర్గాల వారు అవమానాలకు గురయ్యేలా వ్యవహరించారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ వారిపై తనకున్న అక్కసును కూడా చంద్రబాబు వెళ్లగక్కారు. ఇంకా బీసీల తోకలు కత్తిరిస్తామంటూ వారినీ అవమానించారు. అందుకే గత ఎన్నికల్లో ఆ వర్గాలన్నీ చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాయి. 
    ఇక నారా లోకేష్‌ కూడా తండ్రి మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. ఈరోజు అంబేద్కర్‌ జయంతి అని తెలిసి కూడా.. ‘దళితులు ఏం పీకుతారు?’ అని నిన్న వ్యాఖ్యానించిన లోకేష్‌ తన కండకావరాన్ని ప్రదర్శించారు. అందుకే చంద్రబాబు మాదిరిగా, లోకేష్‌కు కూడా ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. 

దళితులకు సమాన హక్కులు, సాధికారతకు సీఎం అత్యధిక ప్రాధాన్యం:  మంత్రి  ఆదిమూలపు సురేష్‌.
– బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తోంది వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ. సమాజంలో దళితులకు సమాన హక్కులు, సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం  వైయస్‌ జగన్, వారి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. సీఎం  వైయస్‌ జగన్‌ దళితులకు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. నిజానికి దళితులు జాతి సంపద.

    తన పాలనలో దళితులను తీవ్రంగా అవమానించి, వారి కోసం ఒక్క మంచి పని కూడా చేయని చంద్రబాబు, ఈరోజు తన స్వార్థం కోసం కుల రాజకీయాలు చేస్తున్నారు. కడుపు నిండా కత్తులు పెట్టుకుని దళితులను కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

భారతీయులంతా గర్వించతగిన వ్యక్తి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌:  లేళ్ల అప్పిరెడ్డి. ఎమ్మెల్సీ.
 భారతీయులంతా గర్వించతగిన వ్యక్తి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ విరాజిల్లడానికి కారణం అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం. జాతి యావత్తూ పవిత్ర గ్రంధంగా భావించే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్, సమసమాజ స్థాపనకు ఎంతో దోహదం చేశారు. అంబేద్కర్‌ ఆశయాలు, ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన సాగుతోంది.

    నవరత్నాల ప్రోగ్రాం వైస్‌ ఛైర్మన్  నారాయణమూర్తి, ప్రభుత్వ సలహాదారులు  నారమల్లి పద్మజ, ఎస్సీ కార్పొరేషన్‌ ఛెర్మన్‌ కనకారావు మాదిగ, పార్టీ నేత  కాకుమాను రాజశేఖర్‌తో పాటు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top