ఓటమి భయంతోనే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు

 ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి.. ప్రజా తీర్పును గౌరవించాలి 
 
డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పల్నాడు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్

పల్నాడు జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై జరిగిన దాడులు, అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న ఘటనలను పల్నాడు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు తన ఎన్నికల హామీలపై నిజంగా నమ్మకం ఉంటే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజలు తమ పాలన పట్ల సంతృప్తిగా ఉంటే ధైర్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల ప్రణాళికతో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలని, ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవించాలని సూచించారు.

ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి అమానుషమని, ధర్మవరంలో నామినేషన్లు దాఖలు చేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను అడ్డుకోవడం, దాచేపల్లి మండలం పిడుగురాళ్లలో నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు కలిగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంపై దాడి చేసి సుమారు పది వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా పరిగణించాలని అన్నారు. దాడులు, బెదిరింపులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలనుకోవడం సరికాదని, ఇటువంటి చర్యలకు వైయ‌స్ఆర్‌సీపీ భయపడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో న్యాయబద్ధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని, ప్రతి అభ్యర్థికి నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించాల్సింది ప్రజలేనని, ప్రజలు ఇచ్చే తీర్పును వైయ‌స్ఆర్‌సీపీ గౌరవిస్తుందని స్పష్టం చేశారు.

Back to Top