మనం పాలకులం కాదు.. ప్రజా సేవకులం

నూతన మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లకు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం

అవినీతి రహిత, వివక్షలేని పాలనే శ్రీరామరక్ష

మేయర్‌. మున్సిపల్‌ చైర్మన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట

కనీవిని ఎరుగని రీతిలో సామాజిక న్యాయం

పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రతి వార్డుకు రెండు వెహికిల్స్‌

ప్రతి గడపకూ రక్షిత మంచి నీరు అందించాలి

వివక్షకు చోటు లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలి

22 నెలల పాలనలో సంక్షేమం రూపంలో రూ.లక్ష కోట్లు ప్రజల చేతుల్లో పెట్టాం

దేశం మొత్తం మనవైపు చూసేలా వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల నిర్మాణం

విజయవాడ: అవినీతి రహిత, వివక్ష లేని పాలన ఈ రెండే రేపు శ్రీరామరక్ష అవుతాయని మేయర్లు, డిప్యూటీ మేయర్లు గుర్తుపెట్టుకోవాలి. మనం పాలకులం కాదు.. ప్రజల సేవకులం అని ఎప్పుడూ మర్చిపోవద్దు. మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే కచ్చితంగా సంక్షేమ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. 

నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లకు రెండ్రోజుల పాటు విజయవాడలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. చివరి రోజు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్క్‌షాప్‌కు హాజరై ప్రభుత్వ పథకాలు, పట్టణాలు, నగరాల అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై మేయర్లు, డిప్యూటీ మేయర్లకు దిశానిర్దేశం చేశారు. ముందుగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లుగా ఎన్నికైన ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

‘రాష్ట్ర స్థానిక ఎన్నికల చరిత్రలో ఇదొక రికార్డు. గతంలో ఎప్పుడూ లేని విధంగా  దేవుడి దయ, ఏకపక్షంగా ప్రజలందరి దీవెనలతో, ప్రజలు మనపై ఉంచిన తిరుగులేని నమ్మకానికి నిదర్శనమే ఈ అఖండ విజయం. ఈ విజయంతో మనపై ప్రజలు ఉంచిన నమ్మకం, బాధ్యత మరింతగా పెరుగుతాయని అందరం గుర్తెరగాలి. ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ మేయర్లు, చైర్మన్ల పదవులు మొత్తం 87 చోట్ల ఎన్నికలు జరిగితే.. ఏలూరు కార్పొరేషన్‌ కౌంటింగ్‌ కోర్టు స్టేతో ఆగిపోయింది. మిగిలిన 86 పదవుల్లో మునుపెన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం జరిగింది.  

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చట్టం ప్రకారం 45 పదవులు ఇవ్వాల్సి ఉంటే.. ఏకంగా 67 పదవులు అంటే 78 శాతం అణగారిన వర్గాలకు ఇవ్వడం గర్వకారణంగా ఉంది. అక్కచెల్లెమ్మలకు చట్టం ప్రకారం 42 పదవులు ఇవ్వాల్సి ఉంటే.. 52 పదవులు ఇచ్చాం. అక్షరాల 61 శాతం. దేవుడి దయతో ఇవ్వగలిగాం. కార్పొరేషన్లు, మున్సిపల్‌ పదవుల్లో కూడా నిజాయితీగా సామాజిక న్యాయానికి, అక్కచెల్లెమ్మలకు పెద్దపీట వేయగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

ప్రజలు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నారు.. మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో.. ఆ విషయంలో అందరూ అవగాహనతో ఉన్నారని భావిస్తున్నాను. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కూడా మనం పాలకులం కాదు.. మనం సేవకులం అని ఎప్పుడూ గుర్తు్తపెట్టుకోవాలి. ఎదిగే కొద్ది ఒదగాలి.. మన దగ్గరికి ఎవరైనా అర్జీ తీసుకొని వచ్చినప్పుడు.. వారితో మాట్లాడే తీరు.. వారి పట్ల మనం చూపించే అభిమానం ఆ మనిషి మనసులో ఎప్పటికీ నిలబడిపోతాయనే సంగతి ఎప్పుడూ మర్చిపోవద్దు. 

రెండు రోజులుగా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, కార్పొరేషన్ల అడ్మిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని అంశాల మీద అధికారులు వర్క్‌షాప్‌ నిర్వహించి సూచనలు, సందేహాలు నివృత్తి చేశారని అనుకుంటున్నాను. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ఉన్న జనాభాలో దాదాపు 1.43 కోట్ల జనాభా అంటే 30 శాతం జనాభాకు మీరు ప్రతినిధులుగా ఉన్నారని జ్ఞాపకం పెట్టుకోవాలి. పట్టణాలు, నగరాల్లో అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందుతాయన్న భరోసా ప్రజలందరికీ కల్పించాలి. 

పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా ప్రతి వార్డుకు రెండు వెహికిల్స్‌ కేటాయించి.. పరిశుభ్రతకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలో ఏకంగా 8 వేల వెహికిల్స్‌ ఏర్పాటు చేయనున్నాం. ప్రతి ఇంటికి చెత్తబుట్టలు ఇవ్వడం దగ్గర్నుంచి.. ఆ చెత్తను ఎలా డిస్పోస్‌ చేస్తామనే అంశాలపై సెక్రటరీ చెప్పే ఉంటారని భావిస్తున్నాను. జూలై 8వ తేదీన ఈ కార్యక్రమాన్ని లాంచ్‌ చేస్తున్నాం.

రక్షిత తాగునీరు ప్రతి ఇంటికి లభించాలని, ప్రతి గడప వద్దకు ఇది చేరాలని లక్ష్యం పెట్టుకున్నాం. ప్రతి మున్సిపాలిటీలోనూ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ అభివృద్ధి చేయడం కోసం ఇప్పటికే 50 మున్సిపాలిటీల్లో ఏఐఐబీ (ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌) ద్వారా పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల కూడా త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తాం. వాటర్‌ పైపులైన్‌ డిస్ట్రిబ్యూషన్‌ చాలా ముఖ్యమైందిగా ప్రభుత్వం భావిస్తుంది. 

ప్రతి గడప వద్దకు ప్రభుత్వం ద్వారా సేవలు అందించే వార్డు సచివాలయాల వ్యవస్థ దేశంలోనే తొలిసారిగా ప్రారంభించడం జరిగింది. వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తున్నాయని అందరికీ తెలిసే ఉంటుంది. ఏదైనా వ్యవస్థతో మంచి జరగాలంటే.. అవినీతి అనేది ఎక్కడా లేకుండా చేయాలి. సే నో టు కరప్షన్‌ అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 

కరప్షన్‌కు దూరం కావాలి.. వివక్ష అనేది ఉండకూడదు. మనకు ఓటు వేయనివారైనా సరే.. అర్హత ఉంటే కచ్చితంగా సంక్షేమం అందాలి. బాధ్యత గల స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ రెండు అంశాలు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవినీతి రహితం, వివక్ష లేని పాలన ఈ రెండే రేపు శ్రీరామరక్ష అవుతాయని నమ్ముతున్నా. 

గ్రామ సచివాలయ వ్యవస్థలో 540 రకాల సేవలు అందించడం జరుగుతుంది. ఆ పరిస్థితులను ఇంకా మెరుగుపర్చడం కోసం ఏదైనా చేయాల్సి వస్తే.. నిరంతరాయంగా మీరంతా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని కోరుతున్నా. దీనికి సంబంధించి డైరెక్ట్‌గా సీఎం ఆఫీస్‌ నుంచే నేరుగా కాంటాక్ట్‌ కావొచ్చు. ఇంకో గొప్ప కార్యక్రమాలు ఏంటంటే.. పేదలకు ఇంటి స్థలాలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గొప్పగా పంపిణీ చేశాం. 17 వేల లేఅవుట్లలో యూడీఏ, యూఎల్‌డీ ప్రాంతాల్లో దాదాపు 16 వేల లేఅవుట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మార్పునకు తెరతీస్తాయి. మనం నిర్మించబోయే కాలనీలను పట్టించుకోకపోతే.. అవి మురికివాడలుగా తయారవుతాయి. పట్టించుకుంటే.. దేశం మొత్తం మనవైపు చూస్తుంది. కాలనీలు ఇలా కూడా అభివృద్ధి చేయవచ్చా.. అని మనవైపు చూసేలా దేశానికే మార్గనిర్దేశం చేస్తామని తెలియజేస్తున్నా.. 

అందమైన కాలనీలు, అక్కడి నివాసితులను సంతోషపెట్టే విధంగా చేయొచ్చు. ఈ రెండో ఆప్షన్‌కు అందరూ కృషి చేయాలని కోరుతున్నా. రాబోయే కాలనీల్లో సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, పార్కులు, వాకింగ్‌ ట్రాక్స్, అండర్‌ గ్రౌండ్‌ ఎలక్ట్రికల్‌ లైన్స్, పచ్చదనం, స్మార్ట్‌ బస్టాప్‌లు, ఇవన్నీ కాకుండా సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి. యూజీడీ కాకుండా.. అండర్‌ గ్రౌండ్‌ ఎలక్ట్రికల్‌ కేబుల్‌ కూడా తీసుకువస్తాం. ఆ స్థాయిలోకి ఈ కాలనీలను తీసుకురాబోతున్నాం. 

పట్టణ ప్రాంతాల్లో మిడిల్‌ ఇన్‌కం గ్రూప్‌ (ఎంఐజీ) వీళ్లకు కూడా ఎటువంటి లిటికేషన్స్‌ లేకుండా.. ప్రభుత్వం లాభం అనేది పట్టించుకోకుండా తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్స్, మున్సిపాలిటీల్లో ఒక్కోచోట 50 నుంచి 150 ఎకరాల వరకు తీసుకొని అక్కడ ప్లాటింగ్‌లు చేస్తాం. ప్లాటింగ్‌ వల్ల ఉపయోగం ఏంటంటే.. లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు పట్టాలు అందుబాటులోకి రావడం, లీగల్‌ సమస్యలు ఏవీ లేకుండా క్లియర్‌ టైటిల్స్‌తో ఆ పట్టాలు అందుబాటులోకి తీసుకురావడం. వీటితో పాటు ఇక్కడ కూడా సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, అండర్‌ గ్రౌండ్‌ ఎలక్ట్రికల్‌ లైన్స్, పచ్చదనం, స్మార్ట్‌ బస్టాప్‌లు, వాకింగ్‌ ట్రాక్స్, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అన్ని అందుబాటులోకి వస్తాయి. ఇది కూడా ఒక గొప్ప కార్యక్రమంగా రాబోయే రోజుల్లో ప్రారంభించనున్నాం. 

గత 22 నెలలుగా మనందరి ప్రభుత్వం నవరత్నాల పాలన అందిస్తుంది. ఎక్కడా వివక్షకు, లంచానికి తావులేకుండా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రతిదీ అందించే కార్యక్రమం చేస్తూ వచ్చాం. 22 నెలల పాలన కాలంలో ప్రజలకు నేరుగా ఆర్థిక లబ్ధిని అందించే పథకాల ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయలు వినమ్రంగా ప్రజల చేతుల్లో పెట్టామని సగర్వంగా తెలియజేస్తున్నా.. ఎక్కడా వివక్ష లేదు, అవినీతి లేదు, సోషల్‌ ఆడిట్‌ పెట్టి అర్హత ఉన్న వారందరికీ ప్రతి పథకం అందించగలిగాం. 

ఇవికాకుండా, 22 నెలల కాలంలో మన కళ్ల ఎదుటే అభివృద్ధి కనిపిస్తుంది. శిథిలావస్థకు చేరిన స్కూల్స్‌ రూపురేఖలు నాడు–నేడుతో మారుతున్నాయి. ఇంగ్లిష్‌ మీడియా స్కూల్స్‌గా తయారవుతున్నాయి. శిథిలావస్థలో ఉన్న ఆస్పత్రుల రూపురేఖలు నాడు–నేడుతో మారబోతున్నాయి. ఇప్పటికే మన కళ్ల ఎదుట కనిపిస్తున్నాయి. వార్డు స్థాయిలో ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల నిర్మాణం కనిపిస్తుంది. చివరకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అండదండలుగా రైతు ఊరు వదిలిపెట్టి వెళ్లిపోకుండా.. ఊర్లోనే అన్ని సదుపాయాలతో విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు.. అదే ఊరులో మేలు జరిగేలా ఆర్బీకేల స్థాపన వరకు అన్ని మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఇవన్నీ 22 నెలల కాలంలో గొప్పగా దేవుడి దయతో చేయగలిగాం. మీరంతా రావడం వల్ల ఈ వ్యవస్థలో ఇంకా మంచి జరుగుతుందని ఆశిస్తూ.. దేవుడి దయ మీ పట్ల, మన ప్రభుత్వం పట్ల సదా ఉండాలని, ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుతున్నా’ అని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top