జీవ‌న ప్ర‌మాణాల పెంపుద‌ల‌కు కృషి 

 రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి  ధర్మాన ప్రసాదరావు 
 

శ్రీ‌కాకుళం:  పేద ప్ర‌జ‌ల‌ జీవ‌న ప్ర‌మాణాల పెంపుద‌ల‌కు కృషి చేస్తున్నామ‌ని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖా మంత్రి   ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. రాగోలు స‌చివాల‌య ప‌రిధిలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. స్థానిక జెడ్పీ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.."అభివృద్ధి ప‌రంగా గతం క‌న్నా వేగంగా మార్పులు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వం చేసిన  అభివృద్ధి ప‌నులు ఒక్క‌సారి జ్ఞాప‌కం చేసేందుకు,వీటిలో లోటు పాట్లు తెలుసుకునేందుకు నిర్దేశించినదే గ‌డప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం. ఇందులో భాగంగా స్థానిక స‌మ‌స్య‌ల గుర్తింపు, ప‌రిష్కారం తో పాటే మూడున్న‌రేళ్ల‌లో ప్ర‌జ‌ల‌కు ఏం చేశామో చెప్పే ప్ర‌య‌త్నం ఒక‌టి చేస్తున్నాం. విప‌క్షాలు అభివృద్ధి లేదు లేదు అని విష ప్ర‌చారం చేస్తూ ఉన్నాయి. మీ ఊళ్లో ఉన్న స్కూల్ నే గ‌మ‌నించండి. అదేవిధంగా గ్రామ స‌చివాల‌య‌ల‌నూ, వెల్న‌స్ సెంట‌ర్ల‌నూ,ఇంకా ఆర్బీకే ల‌ను ప‌రిశీలించి చూడండి. మీకే తేడా స్ప‌ష్టంగా తెలిసి వ‌స్తుంది. అభివృద్ధి ఏ మేర‌కు జ‌రిగింది అన్న‌ది. మ‌న పిల్లలు గతంలో స్కూల్స్ కి ఎలా వెళ్లేవారు ? ఇప్పుడు ఏ విధంగా వెళ్తున్నారు ? అన్న‌ది కూడా ప‌రిశీలించండి. 
మారుతున్న ఆధునిక ప్రపంచంతో పోటీ పడే  విధంగా ఇవాళ సిలబస్ లో మార్పులు చేశాం. అదేవిధంగా వాళ్లకు పోష‌కాహారం, బుక్స్,షూస్ ,బ్యాగ్స్ అందిస్తున్నాం. ఇలా ప్రతి విషయంలో మార్పులు తీసుకు వచ్చాము.

 అదేవిధంగా  మ‌న రిమ్స్ ఆస్ప‌త్రినే తీసుకోండి. గతంలో వైజాగ్ కి రిఫర్ చేసేవారు. కానీ ఇప్పుడు అటువంటి స‌మ‌స్య‌లే లేవు. మన ప్రభుత్వాస్ప‌త్రిలో 900 బెడ్స్ అందుబాటులో తీసుకు వచ్చాము. అన్ని పీహెచ్సీలనూ అభివృద్ధి చేశాము. వైద్యులను పెంచాము. ఇక  నిత్యావసర సరుకులు వాహ‌నాల ద్వారా డోర్ టు డోర్ మీ ఇంటి వద్దకే తీసుకు వస్తున్నాము. కొన్ని పత్రికలు రాజకీయ పార్టీల కోసమే పుట్టాయి. వారు పని కట్టుకొని మంచి చేస్తున్న ప్రభుత్వం మీద అబ‌ద్ధాలు రాస్తుంటాయి. వాటిని మీరు నమ్మవద్దు. టీడీపీ అధినేత చంద్రబాబు మొన్న రాజాం వచ్చినప్పుడు.. మళ్ళీ అధికారం వస్తే అమరావతి రాజధాని అని అంటున్నారు. అమ‌రావ‌తి అన్న‌ది కేవలం చంద్ర‌బాబుకు చెందిన మ‌నుషులతో నిర్వ‌హింప‌జేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే  ఏర్పాటైన న‌గ‌రి. ఆ రోజు ఆయన  రాజ‌ధాని చుట్టు పక్కల భూములను వారి మనుషులతో కొనుగోలు చేయిచారు. రాజ‌ధాని 33 వేల ఎకరాలు డెవ‌ల‌ప్ చేయాలి అంటే మన అందరి  ఆదాయం సుమారు 50 సంవత్సరాలు అమరావతి అభివృద్ధి కి వెచ్చించాలి.

హైదరాబాద్ లాంటి అనుభవమే మళ్ళీ మనకి జరుగ‌నుంది. అందరికి అభివృద్ధి ఫలాలు అందాలి అని  పార్లమెంట్ నియమించిన కమిటీలు చెప్పాయి. వాటిని చంద్రబాబు పక్కన పెట్టి త‌మ‌కు అనుగుణంగా రాజ‌ధానిగా గుంటూరు, కృష్ణ చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌ను ఎంపిక చేసుకుని దానికి అమరావతి అని పేరు పెట్టారు. విశాఖకు రాజధాని వస్తే ప్రైవేటు ఇన్వెస్టర్ల వస్తారు.. మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మళ్ళీ చంద్రబాబు వస్తే మన అభివృద్ధికి గొడ్డ‌లి పెట్టే. మళ్ళీ మరో 30 ఏళ్ళు వెన‌క్కు వెళ్తాము. చంద్రబాబు వ్యాపారస్తుడు మాత్రమే  పేదల కష్టాలు ఆయనకి తెలియవు. తోటపల్లి ప్రోజెక్టు, వంశధార ప్రోజెక్టు కు ఆయన చేసింది ఏమీ లేదు. 

  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో వంశ‌ధార‌ను వినియోగించుకు నేందుకు గొట్టా వ‌ద్ద 19 టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌నులు చేప‌డుతున్నాం. దీని ద్వారా మండు వేసవిలో కూడా రైతులకు నీరు అందిస్తాం. ఇక ధ‌ర‌ల విష‌యానికే వ‌స్తే.. నిత్యావసర సరుకుల దేశం మొత్తం మీద పెరిగాయి. బయట రాష్ట్రంలో ఉంటున్న మన పిల్లలకు, బంధువులకు ఒక్కసారి అడగండి తేడా గమనించండి. అక్కడ ఇన్నిసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా అడగండి. ముఖ్యంగా మహిళలను బలోపేతం చేసేందుకు వారి పేరు మీద సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాము. 

రాజ్యాంగం నిర్దేశించిన హ‌క్కుల అనుసారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వంవైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ ది. కరోనా సమయంలో కూడా మీరు ఇంటి నుంచి బయటకు రాకుండానే సరుకులు తెచ్చి అందించాము. అంతేకాదు ఇవాళ అభివృద్ధి ప‌నుల్లో భాగంగా రాయపాడు, బావాజీ పేటకు రోడ్లు నిర్మాణం చేయనున్నాము.బాదుడే.. బాదుడు అని టీడీపీ వాళ్ళు మీ గ్రామానికి వస్తే..సరుకులు తక్కువ రేట్ కి ఎక్కడ దొరుకుతాయి తీసుకు వెళ్ళమని చెప్పండి. ఇక వ్య‌వ‌సాయాధారిత ప్రాంతం ఇది క‌నుక శనగ, జొన్న, రాగులు, ఇలా ఆదాయం వచ్చే పంటలు వైపు రైతులు మొగ్గు చూపాలి  అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. అనంత‌రం 40 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర నాయ‌కులు ధర్మాన రామ్ మనోహర్, పార్టీ నాయకులు చిట్టి జనార్ధనరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top