14 ఏళ్లు పాలించిన అనుభవం ఇదేనా..?

గ్యాలరీలో కూర్చొని కనుసైగలు చేయడం సిగ్గుమాలిన చర్య

వికేంద్రీకరణ బిల్లును కౌన్సిల్‌ ఆమోదించలేదు.. తిరస్కరించలేదు

ఆ బిల్లును ఆమోదించినట్లే లెక్క..

రూల్‌ బుక్స్‌ పట్టుకొని తిరిగే యనమలకు ఇది తెలియదా..?

మండలి చైర్మన్‌ ఒక పార్టీ వ్యక్తిలా వ్యవహరించి తప్పు చేశారు

అసెంబ్లీ సెక్రటరీని సస్పెండ్‌ చేసే హక్కు యనమలకు ఎవరిచ్చారు

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆగ్రహం

సచివాలయం: శాసనసభ ఆమోదం పొంది మండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును కౌన్సిల్‌ ఆమోదించకుండా.. తిరస్కరించకుండా జాప్యం చేసింది. ఎలాంటి నిబంధనలు పాటించకుండా సెలెక్ట్‌ కమిటీకి బిల్లును పంపిస్తామన్నారు. కమిటీ కూడా ఫామ్‌ చేయకుండా.. ఎవరి అభిప్రాయాలు సేకరించకుండా కాలయాపన చేశారు. 14 రోజులు దాటింది కాబట్టి వికేంద్రీకరణ బిల్లు ఆమోదించినట్లుగా పరిగణలోకి తీసుకోవచ్చని డిప్యూటీ సీఎం సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. శాసనసభలో ముందుగానే జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ వేద్దామని సీఎం వైయస్‌ జగన్‌కు చెబితే ఆయన అంగీకరించలేదు. అటువంటి క్రికెట్‌ పాలిటిక్స్‌ మనం చేయవద్దు చెప్పారన్నారు. కానీ, మండలి చైర్మన్‌ మాత్రం రూల్స్‌ పాటించకుండా ఒక రాజకీయ పార్టీని కాపాడే వ్యక్తిగా వ్యవహరించారన్నారు. అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని కనుసైగలు చేశారంటే.. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదన్నారు.

సచివాలయంలో డిప్యూటీ సీఎం సుభాష్‌ చంద్రబోస్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ బిల్లుపై ఆ రోజున ఏం జరిగిందో వివరించారు. ఆయన ఏం మాట్లారంటే.. ‘దాదాపు 2–3 గంటలు రూల్‌ 71 కింద చర్చ జరగాలని చైర్మన్‌ స్థానంలోకి రాగానే దానిపై ఓటింగ్‌ పెట్టడం, టీడీపీ సభ్యులు మద్దతు తెలిపి చర్చకు తీసుకున్న సందర్భంలో మేము అభ్యంతరం చెప్పాం. రూల్‌ 71 కింద ప్రభుత్వ పాలసీని డిస్కర్స్‌ చేయాలని వారు చర్చ లేవనెత్తారు. దాన్ని మేము వ్యతిరేకించాం. పాలసీకి నిర్వచనం చెప్పాలని సభాపతిని అడిగితే.. సమాధానం చెప్పలేదు. అసలు పాలసీ ఎప్పుడు వస్తుంది.. వారిచ్చిన లెటర్‌లో ఉన్న రూల్‌ 71ని సాటిస్‌ఫై చేస్తాయా..? అంటే దానికి సవివరమైన సమాధానం చెప్పలేదు. పాలసీ అనేది జీఓ విడుదలైన తరువాత వస్తుంది. జీఓ విడుదల కాకముందు పాలసీ రాదు. బిల్లును పక్కనబెట్టి పాలసీ మీద చర్చించాలని ఎక్కడైనా ఉంటే తప్పకుండా ఒప్పుకుంటామని చెప్పినా.. నాకున్న విచక్షాధికారులతో చర్చించాల్సిందే అని చైర్మన్‌ ఆదేశిస్తే.. అంగీకరించాం. రూల్‌ 71పై చర్చ జరిగి.. ప్రభుత్వ బిల్లులపై చర్చ జరుగుతున్నప్పుడు అనేక అడ్డంకులు వచ్చాయి. నాకు విచక్షణాధికారులు ఉన్నాయి.. ఏ నిర్ణయం ప్రకటించినా సభ అంగీకరించాలని చైర్మన్‌ మాట్లాడారు. 

ఎప్పుడుపడితే అప్పుడు.. ఎక్కడబడితే∙అక్కడ.. ఒకరి ప్రయోజనాలు కాపాడేందుకు విచక్షణాధికారం ఉపయోగించకూడదు. విషయం సందిగ్ధంలో ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలి. బ్యాట్మింటన్‌ ఆడుతున్నప్పుడు బాల్‌ ఇన్‌కోర్టుకు, అవుట్‌ కోర్టుకు చివర పడినప్పుడు రిఫరీ ఏం చెబితే అది అంగీకరించాలి. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నామని సభ్యులను కోరాలి.. ఓటింగ్‌ పెట్టాలి అప్పుడు ఏ కమిటీకి ఇచ్చిన పర్వాలేదు. కానీ, అసలు బాలే కొట్టకుండా రిఫరీ ఒకరికి పాయింట్లు ఇస్తే ఏ విధంగా ఉంటుందో.. అసలు ఓటింగ్‌ పెట్టకుండా నాకు విచక్షణాధికారులు ఉన్నాయని మాట్లాడటం.. పెద్దల సభకు అధ్యక్షత వహిస్తున్న చైర్మన్‌ అధికారాలను దుర్వినియోగం చేసినట్లే.. 

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు.. నాకు విచక్షణాధికారులు ఉన్నాయి.. నేను ఓటింగ్‌ జరపను అంటే చెల్లుతుందా..? విచక్షణాధికారాలు ఉన్నాయని 4 తరువాత 10 వస్తుందంటే అంగీకరించాలా..? విధిగా ఓటింగ్‌ జరగాలని రూల్స్‌ చెబుతున్నా.. వినిపించుకోకుండా సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నానని చైర్మన్‌ సభను నిరవధిక వాయిదా వేశారు. అసెంబ్లీ రూల్స్‌ను అమలు చేయలేదు కాబట్టి అభ్యంతరాలు లేవదీసి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నేను లిఖితపూర్వకంగా మండలి చైర్మన్, సెక్రటరీకి లేఖలు పంపించాం. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు విజిటర్స్‌ గ్యాలరీలో కూర్చొని కనుసైగలతో ఆదేశాలు ఇస్తున్నారంటే.. బహుశా దేశ చరిత్రలో ఇంత సిగ్గుమాలిన పని ఇంకొకటి ఉండదు. వికేంద్రీకరణ రూల్స్‌ పుస్తకం పట్టుకొని తిరిగే యనమల రామకృష్ణుడికి ఇవన్నీ తెలియదా..? ఏదో గందరగోళం చేయడానికి తాపత్రయపడ్డారు తప్ప.. నిబంధనలను సక్రమంగా పాటించి మన కర్తవ్యం నిర్వర్తించాలని ప్రవర్తించలేదు. 

సుదీర్ఘ అనుభవం ఉన్న యనమల టీడీపీని గోతిలో పడేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ పనిచేస్తున్నారని చెబుతున్నారు. సెక్రటరీపై ప్రివిలేజ్‌ మోషన్‌ పెడతామని యనమల అంటున్నాడు. చంద్రబాబు కనుసైగలతో చైర్మన్‌ వ్యవహరించి దాన్ని అసెంబ్లీ కార్యదర్శిని బలిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటే.. ఎవరి హక్కులను ఎవరు హరిస్తున్నారు. సెలెక్ట్‌ కమిటీని చూసి భయపడే అంత దౌర్భాగ్యం మాకు కలగలేదు. టీడీపీని దగా చేసిన యనమలే భయపడుతున్నాడు. అర్థరహితమైన వాదనలు చేసి ఎవరిని తప్పుదోవపట్టిస్తున్నారు. నీ పార్టీకి ఇలాంటి సలహాలు ఇచ్చే నిట్టనిలువునా బోర్లాపడేశారు. యనమల టీడీపీని గోతిలో పెట్టి పాతేశారు. 

శాసనసభలో ముందుగానే జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ వేద్దామని ఒక ప్రపోజల్‌ సీఎం వైయస్‌ జగన్‌కు చెబితే ఆయన అంగీకరించలేదు. అటువంటి క్రికెట్‌ పాలిటిక్స్‌ మనం చేయవద్దు.. వారు ఏం చేసుకున్నా మనకు ఏం అభ్యంతరం లేదు అంతేగానీ, ఓ పది రోజులు కాలక్షేపం చేసి బిల్లును ఆమోదింపజేసుకునే అగత్యం పట్టలేదని సీఎం చెప్పారు. సెలెక్ట్‌ కమిటీకి ఇవ్వాల్సిన నియమ నిబంధనలు పాటించకుండానే ఆవేశాలకు పోయి ఆ రోజున అలజడులు సృష్టించారు. తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున యనమల మాట్లాడుతున్నారు. 

వికేంద్రీకరణ బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే.. శివరామకృష్ణన్‌ కమిటీ వేసే ముందు ప్రధానంగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలు.. 1. జనాభా తరలింపు తక్కువగా ఉండాలి. 2. అగ్రికల్చర్‌ ల్యాండ్‌ అతి తక్కువ నష్టం ఉండాలి. 3. పర్యావరణానికి ఎక్కడా ఇబ్బంది కలగకూడదు. 4 తక్కువ ఖర్చు అవ్వాలి. వీటిని చంద్రబాబు పట్టించుకోకుండా నారాయణ కమిటీ వేసి హడావిడిగా చేసిన నిర్ణయం సమంజసమేనా..? ఇంకా పది వేల ఎకరాలు ఉంది.. దాంట్లో 5 వేల ఎకరాలు అమ్ముకుంటే చక్కని రాజధాని కట్టుకోవచ్చని చంద్రబాబు మాట్లాడాడు. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేస్తామని భూమి సేకరించింది. ఒకరి భూమి తీసుకున్నప్పుడు ఆ రైతు ఎంత ఆవేదన పడతారో అందరూ ఆలోచించాలి. భూ యజమాని ఆ భూమితో ఎంతో ప్రేమతో ఉంటాడు. రాజధాని పేరుతో చంద్రబాబు గ్రామాలు ఖాళీ చేయించారు. ప్రభుత్వాలు సహాయ సహకరాలు చేసే విధంగా ఉండాలి తప్ప.. అప్పులిచ్చే సంస్థలు, లాభాలు అర్జించే స్థంస్థలుగా ఉండకూడదు. 

సుదీర్ఘ పాలన అనుభవం ఉండి.. ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసిన చంద్రబాబు భూములు అమ్ముకోండి అని మాట్లాడుతున్నారంటే.. ఎవరిని దగా చేస్తున్నట్లు. ఆ భూమిని అమ్ముకొని ప్రభుత్వం లాభాలు అర్జించాలా..? 14 ఏళ్లుగా పాలించిన అనుభవం ఇదేనా..? రైతుల దగ్గర మనం అవమానం పడతామేమో అని ముందు జాగ్రత్తగానే బజారులో భిక్షం ఎత్తుకుంటే సానుభూతి వస్తుందని భావిస్తున్నారా..? రైతులను కూడా దగా చేయాలనే అభిలాష చంద్రబాబుకు ఉన్నట్లే కదా..? దయచేసి రైతులు ఆందోళనలు మాని చంద్రబాబును ప్రశ్నించండి. సీఎం వైయస్‌ జగన్‌ రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం చేయలేదు. 

యనమల చేసిన పొరపాటుకు క్షమించమని చంద్రబాబును అడగాలి. మీ తప్పుకు మాపై బురదజల్లాలని చూడొద్దు. డిఫమేషన్, సభా హక్కుల తీర్మానం, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని, సస్పెండ్‌ చేస్తామని అసెంబ్లీ సెక్రటరీని యనమల బెదిరిస్తున్నారు. సస్పెండ్‌ చేసే అధికారం మీకు ఎక్కడిది.. ఒక ఎంప్లయిని సస్పెండ్‌ చేసే అధికారం యనమలకు లేదు. ఇంకా అధికారంలోనే భ్రమలోనే ఉన్నారా.. అలాంటి కలలు కనొద్దు. కమిటీ వేసేటప్పుడు మండలి చైర్మన్‌ ఓటింగ్‌ పెట్టాలి. ఎంత మంది సభ్యులు ఉంటారో.. ఆ సెలెక్ట్‌ కమిటీలో ఆ పార్టీ సభ్యుడి ప్రాతినిథ్యం ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి ఇవ్వాలి. పేర్లు పంపించమని పార్టీ అధ్యక్షులను అడగాలి.. జాబితాలో ఉన్న సభ్యుల అంగీకారం తీసుకోవాలి. అవేమీ లేకుండా విచక్షణాధికారులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. దానికి ఒక లెక్కా.. పద్ధతి లేదా..? చైర్మన్‌ ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు తప్ప.. న్యాయాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తిగా వ్యవహరించలేదు. 14 రోజుల సమయంలో మీరు కమిటీ వేయలేకపోయారు.. కాబట్టి బిల్లును ఆమోదించినట్లే.. అని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు.  
 

తాజా వీడియోలు

Back to Top