విజయవాడ: ఆలయాల భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖపై మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలుగురు డీసీలు, 26 జిల్లాల దేవాదాయ శాఖ అధికారులు, 500 మంది టెంపుల్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్స్ (ఈవో)లు హాజరయ్యారు. లిటికేషన్‌లో ఉన్న దేవాదాయ శాఖ భూములను గుర్తించి వాటిని పరిష్కరించడం, దేవాదాయ భూముల లీజు వంటి అంశాలపై సమీక్షలో చర్చించారు.
సమీక్ష అనంతరం మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆలయ భూముల లీజు నిర్ణయం ఉంటుందన్నారు. కొన్ని చోట్ల లీజు ఇంప్రూమెంట్ లేకుండా సంవత్సరాల తరబడి ఉన్న భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించామన్నారు. దేవుడికి రావాల్సిన ఆదాయం సక్రమంగా రాకపోతే దాన్ని పరిగణలోకి తీసుకొని లీజు ఏ ప్రాతిపదికన ఇవ్వాలనేదానిపై తగిన గైడ్‌లెన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. రైతులను, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. అదే విధంగా ఆక్రమణకు గురైన ఆలయ భూములను గుర్తించి పొజిషన్‌లోకి తీసుకురావడంపై అధికారులకు తగిన ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. దేవుడికి సంబంధించిన ఆస్తులను కాపాడాలని, బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని, మంత్రిగా తన నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించామన్నారు.