భూ య‌జ‌మానికి శాశ్వత హక్కు కల్పించడమే లక్ష్యం

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌– 2020 ప్రతిష్టాత్మకం

డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

అసెంబ్లీ: దేశంలో మొట్టమొదటి సారిగా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ – 2020 వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, ఈ చట్టం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయమని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. రాష్ట్రంలోని భూహక్కు దారులకు, కొనుగోలు దారులకు పూర్తి భరోసా కల్పిస్తూ.. సీఎం వైయస్‌ జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చట్టాన్ని రూపొందించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ –2020 బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘వైయస్‌ జగన్‌ తన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల నుంచి సేకరించిన వినతుల్లో ఎక్కువ శాతం భూ వివాదాలకు సంబంధించి ఉన్నాయి. రెవెన్యూ రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని గుర్తించారు. అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తానని మాటిచ్చి.. నిపుణులతో ఎన్నో చర్చలు నిర్వహించిన అనంతరం ఈ బిల్లుకు రూపకల్పన చేశారు. భూయజమానికి పూర్తిస్థాయిలో హక్కు కల్పించడం వల్ల వారికి వారి భూమిపై శాశ్వత హక్కు దఖలపడతాయి. తద్వారా ఆ వ్యక్తి ఎలాంటి భూవివాదాలకు లేకుండా శాశ్వతంగా అనుభవించవచ్చు. అతని అనుమతితో మాత్రమే ఇతరులకు హక్కులు బదలాయించవచ్చు. రెవెన్యూ మంత్రిగా నా చేతుల మీదుగా ఇలాంటి చరిత్రాత్మక ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ –2020 బిల్లును సభలో ప్రవేశపెట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. 

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల్లో ఈ చట్టం ద్వారా భూ యజమానులకు శాశ్వత హక్కులకు కల్పించడం జరుగుతుంది. మనకున్న ప్రస్తుత చట్టం ప్రకారం టైటిల్‌ మంజూరు చేసే అధికారం కేవలం సివిల్‌ కోర్టుకు మాత్రమే ఉంది. నూతన చట్టం ద్వారా రీసర్వే అయిన మరుక్షణం ప్రభుత్వమే వారికి నేరుగా ల్యాండ్‌ టైటిలింగ్‌ పట్టాలు మంజూరు చేస్తుంది. భూయజమానులకు, కొనుగోలుదారులకు భూమిపై శాశ్వత హక్కు కల్పించడం ఈచట్టం ప్రధాన లక్ష్యం. పక్కాగా భూరికార్డులు నిర్వహించడంలో సహాయపడుతుంది’ అని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వివరించారు. 
 

Back to Top