తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ దారుణం 

ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలి

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి డిమాండ్‌

 తిరుపతి:  తిరుమలలో పురాతన ఆంజనేయస్వామి విగ్రహం చోరీకి గురికావడం అత్యంత దారుణమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని, టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో 46 ఏళ్ల క్రితం మాజీ ఈవో పీవీఆర్‌కే ప్రసాద్ పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్లే 25 వేల మందికి పైగా భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించుకుంటారని, ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెప్పారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికే రక్షణ లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

విగ్రహాన్ని చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని భూమన తెలిపారు. అయితే చోరీకి పాల్పడిన వ్యక్తిని పిచ్చివాడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్న సమాచారం తమకు ఉందన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను భక్తుల ముందుంచాలని డిమాండ్ చేశారు. తిరుమల ప్రక్షాళన చేస్తామని చెప్పిన కూటమి పాలనలో నిత్యం కొండపై ఏదో ఒక అపచారం జరుగుతోందని మండిపడ్డారు. కొండగట్టు ఆంజనేయస్వామి భక్తులమని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహానికే రక్షణ లేకపోవడంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ ఘటనను ప్రభుత్వం తేలికగా తీసుకోరాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలో భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
 

Back to Top