నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గంలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సోమవారం కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఆర్డీవోకు అందజేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొందరు అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు పర్యావరణానికి కూడా తీవ్ర హాని కలుగుతోందని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఈ కార్యకలాపాలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్డీవోను కోరారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.