ఎన్యుమరేషన్‌ విషయంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించాలి

కలెక్టర్లకు సీఎం వైయస్‌ జగన్‌ కీలక ఆదేశాలు

రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాల్సిందే..

రైతుకు గిట్టుబాటు ధర అందించే బాధ్యత మనదే..

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపరిహార అంచనాల నమోదు ప్రారంభించాలి

పశు నష్టం జరిగినా పరిహారం అందించాలి

మాండూస్‌ తుపాన్, భారీ వర్షాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: మాండూస్‌ తుపాన్‌ నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలని, వచ్చే వారంరోజుల్లో ఈ ప్రక్రియను ముగించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. తుపాన్‌ ప్రభావం, భారీవర్షాలు, సహాయక చర్యలపై తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా క‌లెక్ట‌ర్లు, ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్లు, అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఎన్యుమరేషన్‌ విషయంలో ఉదారంగా ఉండాలన్నారు. ఎక్కడా కూడా రైతులు నిరాశకు గురికాకుండా చూసుకోవాలని చెప్పారు. రంగు మారిన ధాన్యం, తడిసిన ధాన్యం కొనుగోలు చేయలేదన్న మాట ఎక్కడా రాకూడదని, తక్కువ రేటుకు ధాన్యం కొంటున్నారన్న మాట కూడా ఎక్కడా వినిపించకూడదన్నారు. ఒకవేళ రైతులు బయట అమ్ముకుంటున్నా సరే.. వారికి అందాల్సిన రేటు కచ్చితంగా అందాల్సిందేనని, ఆ రేటు వచ్చేలా మనందరిపై ఉందని సూచించారు. 

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్లు చర్యలు చేపట్టాలని, పంటలు దెబ్బతిన్న చోట మళ్లీ పంటలు వేసుకోవడానికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఇళ్లు ముంపునకు గురైన వారికి రూ.2 వేలతో పాటు రేషన్‌ కూడా అందించాలన్నారు. బాధితులందరికీ సహాయం అందేలా చూడాలన్నారు. భారీ వర్షాల కారణంగా పశు నష్టం జరిగినా పరిహారం అందించాలని ఆదేశించారు. నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలని సూచించారు. 

ఈ స‌మావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ(ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి వై మదుసూదన్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్,  రవాణాశాఖ కార్యదర్శి పీ ఎస్‌ ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ కమిషనర్‌ సి హరికిరణ్, డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ డైరెక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్, ఇతర ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరైన కలెక్టర్లు, ఇతర అధికారులు హాజ‌ర‌య్యారు.

Back to Top