ఈనెల‌ 31లోగా పంటనష్టం అంచనాలను పూర్తిచేయాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

రాష్ట్రంలో 5.5 నుంచి 4.76కు తగ్గిన కరోనా పాజిటివిటీ రేట్‌

కరోనా తగ్గిన వారిలో కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు

అలాంటి కేసుల‌కూ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించేలా ఆదేశాలిచ్చాం

‘స్పందన’పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ 

తాడేపల్లి: భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన పంటనష్టం అంచనాలను అక్టోబర్‌ 31లోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని సూచించారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై, ఆర్బీకేలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జల‌కు ప్ర‌భుత్వం త‌క్ష‌ణ సాయం అందిస్తుంద‌ని, స‌హాయ‌క చ‌ర్య‌లపై దృష్టిసారించాల‌న్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరగాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌ మరమ్మతులు వెంటనే మొదలుపెట్టాలన్నారు. 

కరోనా పాజిటివిటీ రేట్‌ బాగా తగ్గింది: సీఎం
రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేట్‌ బాగా తగ్గిందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. ‘కరోనా పాజిటివిటీ రేట్‌ 5.5 నుంచి 4.76కు తగ్గింది. ప్రతి రోజూ 70 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. కరోనా బాధితులు నెగిటివ్‌ వచ్చినా 6 నుంచి 8 వారాలు జాగ్రత్తగా ఉండాలి. కరోనా తగ్గిన తరువాత కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కరోనా తగ్గిన వారిలో కిడ్నీ, గుండెకు సంబంధించిన సమస్యలొస్తున్నాయి. అటువంటి కేసులను ఆరోగ్యశ్రీలోకి తీసుకురావాలని హెల్త్‌ సెక్రటరీకి ఆదేశాలిచ్చాం. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఆరోగ్య మిత్రలకు పూర్తి శిక్షణ ఇవ్వాలి. రోగులకు అందుతున్న సేవలపై ప్రతి రోజూ రిపోర్టు రావాలి. మాస్క్‌ శానిటైజేషన్, భౌతికదూరంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి’ అని అధికారులను ఆదేశించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో స‌మీక్షా స‌మావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top