మద్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌

సొంత అవసరాలకు ఎడ్లబండ్ల ద్వారా 5 కి.మీ పరిధిలో ఇసుక తెచ్చుకోవచ్చు

ఉపాధి హామీ కూలీల సంఖ్య 54.5 లక్షలకు చేరడం సంతోషం

మెడికల్‌ కాలేజీల నిర్మాణ స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలి

కోవిడ్‌ నియంత్రణలో కలెక్టర్ల పనితీరు అభినందనీయం

‘స్పందన’పై వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ 

తాడేపల్లి: ఇసుక రీచ్‌లను ఓపెన్‌ చేయాలని, వర్షాలు వచ్చే నాటికి 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ చేయాలని కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. జూన్‌ చివరి నాటికి రోజుకు 3 లక్షల టన్నుల ఇసుక లక్ష్యం పెట్టుకోవాలన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇసుక ఉత్పత్తిని పెంచాలన్నారు. కొత్త సోర్స్‌లను గుర్తించి ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 
 
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌ చేసుకోవచ్చని, కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. సొంత అవసరాల కోసం గ్రామాల్లో ఉన్నవాళ్లు ఎడ్లబండ్ల ద్వారా 5 కిలోమీటర్ల పరిధిలో ఇసుక తెచ్చుకోవచ్చని, గ్రామ సచివాలయంలో దీనికి సంబంధించి అనుమతులు తీసుకోవాలన్నారు. బల్క్‌ బుకింగ్‌ అనుమతులు జాయింట్‌ కలెక్టర్‌ చూసుకోవాలని సూచించారు. 

రెండు వారాల క్రితం 35 లక్షల మంది ఉపాధి హామీ పనులకు వచ్చేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 54.5 లక్షలకు చేరిందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో పనులు కల్పిస్తున్నందుకు కలెక్టర్లను అభినందించారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి 60 లక్షల మందికి పనులు కల్పించాలని ఆదేశించారు. 

55 వేల అంగన్‌వాడీల్లో 31 వేల చోట్ల కొత్త బిల్డింగ్‌లు నిర్మించాలని, వీటి నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. పట్టణ, నగరాల్లో వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌పై మ్యాపింగ్‌ చేయబోతున్నారని, వీటి స్థలాలు గుర్తించే పనిని యుద్ధప్రాతిపదికన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా నాడు–నేడు కార్యక్రమంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని సూచించారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో కలెక్టర్లు బాగా పనిచేశారని కితాబిచ్చారు.  కరోనా నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు తొలగించాలని, అనుమానం రాగానే పరీక్షలు చేయించుకుంటే ఏ ఇబ్బంది ఉండదన్నారు. 85 శాతం కేసులు ఇంట్లోనే మందులు తీసుకోవడంతో తగ్గిపోతుందని, కేవలం 2శాతం మాత్రమే మరణాలు రేటు ఉందన్నారు. ఆస్పత్రుల సన్నద్ధతను కలెక్టర్లు పర్యవేక్షించాలని, ఐసోలేషన్‌ సదుపాయాలపై కూడా దృష్టి పెట్టాలి సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమాన్ని జాయింట్‌ కలెక్టర్‌ పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 15 కొత్త మెడికల్‌ కాలేజీలను కట్టబోతున్నామని, ఒక్కో మెడికల్‌ కాలేజీకి 50 ఎకరాల స్థలం కావాలి.. కొత్త మెడికల్‌ కాలేజీలకు అవసరమైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

లిక్కర్‌ వినియోగం తగ్గించడానికి అన్నిరకాల చర్యలూ తీసుకున్నామని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. అధికారంలోకి రాగానే 43 వేల బెల్టుషాపులు ఎత్తివేశామని, 33 శాతం మద్యం దుకాణాలు తగ్గించామన్నారు. షాక్‌ కొట్టే రీతిలో రేట్లు పెంచామన్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు.. మద్యం అక్రమ రవాణా, తయారీ జరగకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎక్కువగా ఉందన్నారు. మద్యం, ఇసుక అక్రమాల్లో ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించవద్దని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 

Back to Top