గ్రామాల రూపురేఖలు మారుస్తాం..  

చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గ్రామాలపై శ్రద్ధ పెట్టాం

పార్టీలకు అతీతంగా పథకాలు అందించాలి

అర్హత ఉండి ఇంటి స్థలం ఇవ్వలేదనే మాట రాకూడదు

మే 21 వరకు ఇళ్ల పట్టాల దరఖాస్తుకు అవకాశం

జేసీల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది

కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. మే 31 లోగా భూసేకరణ, ప్లాట్లను సిద్ధం చేయడంతో పాటు అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇల్లు లేని నిరుపేద ఉండకూడదని, అర్హత ఉండి ఇంటి స్థలం ఇవ్వలేదనే మాట రాకూడదని కలెక్టర్‌లను సీఎం ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..

మే 21 వరకు ఇళ్ల పట్టాల దరఖాస్తు చేసుకోవచ్చని, మే 30 కల్లా వెరిఫికేషన్‌ పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి తుది జాబితా జూన్‌ 7న ప్రకటించాలన్నారు. ఇళ్ల పట్టాల కోసం రూ.4,436.47 కోట్లు విడుదల చేశామని గుర్తుచేశారు.

జిల్లాకు ముగ్గురు జేసీలు..
జిల్లాకు ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లు నియమించామని, ఒక జేసీ రైతు భరోసా, రెవెన్యూ, రెండో జేసీ గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మూడో జేసీకి ఆసరా, వెల్ఫేర్‌ కార్యక్రమాలు అప్పగించామన్నారు. జేసీల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తాం. పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందించాలని ఆదేశించారు.

మద్యం వినియోగాన్ని బాగా తగ్గిస్తున్నాం..
గతంలో ఎవరూ ప్రభుత్వ కార్యక్రమాలపై ఇంత దృష్టి ఎప్పుడూ పెట్టలేదని, చరిత్రలో ఎప్పుడూ కూడా గ్రామంపై ఇంత శ్రద్ధ పెట్టలేదని, మన ప్రభుత్వం మొత్తం గ్రామ రూపురేఖలు మారుస్తుందన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌లో 24 గంటలూ ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారని సీఎం చెప్పారు. మద్యం వినియోగాన్ని బాగా తగ్గించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే లిక్కర్‌ రేట్లు పెంచాం. మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాం. బెల్టు షాపులు ఎత్తేశాం. పర్మిట్‌ రూంలను ఎత్తివేశామని గుర్తుచేశారు.

ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం.
కరోనా మహమ్మారి నేపథ్యంలో వేసవి సెలవులు పొడిగించామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. ఆగస్టు 3వ తేదీన రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే సెలవులు పొడిగించామని, అన్ని జాగ్రత్తలతో ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు 9 రకాల సదుపాయాలు కల్పించాలని, ఇందుకు రూ.456 కోట్లు ఇప్పటికే విడుదల చేశామన్నారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో చేపడుతున్న పనులు పూర్తికావాలంటే కలెక్టర్లు ప్రతి రోజు రివ్యూ చేయాలని సూచించారు.

ఇసుక, మద్యం అక్రమాలకు చెక్‌
ఇసుక, మద్యం అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. మద్యం అక్రమాలకు చెక్‌ పెట్టడానికి యువ ఐపీఎస్‌ అధికారులను నియమించామన్నారు. వర్షాకాలం వచ్చేలోగా కావాల్సిన ఇసుక అందుబాటులో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు. తప్పనిసరిగా ఇసుక నిల్వలు పెంచాలని, దీనికి సంబంధించి ప్రత్యేక జాయింట్‌ కలెక్టర్‌ను నియమించామని చెప్పారు. ఇసుక, మద్యం అక్రమ రవాణాలను అడ్డుకోవాలని ఆదేశించారు.
 

Back to Top