గొప్ప మ‌నుషుల‌కు సాయం చేయ‌డం సంతోషంగా ఉంది

చెమటను నమ్ముకుని పనిచేసే గొప్ప మనుషులు.. నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులు

‘జగనన్న చేదోడు’తో వీరికి మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 

ఈ పథకం ద్వారా 2,47,040 కుటుంబాలకు సాయం అందిస్తున్నాం

రూ.10 వేల చొప్పున లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తున్నాం

అర్హులెవరైనా మిగిలి ఉంటే దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల గడువు 

అర్హత ఉన్నవారందరికీ మేలు చేయడమే ఈ ప్రభుత్వ సిద్ధాంతం 

పాదయాత్రలో చెప్పిన ప్రతీ మాటను నెరవేరుస్తున్నా..

జగనన్న చేదోడు పథకం ప్రారంభోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: ‘‘కొన్ని శతాబ్దాలుగా మన చుట్టూ ఉన్న సమాజంలో నివసించే ప్రజలకు సేవ చేస్తూ.. కేవలం తమ చెమటను మాత్రమే నమ్ముకొని పనిచేస్తున్న గొప్ప మనుషులు నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు. వారి కోసం ‘జగనన్న చేదోడు’ పథకం ప్రారంభించడం సంతోషంగా ఉంది.’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, అర్హత ఉన్నవారందరికీ మేలు చేయడమే ఈ ప్రభుత్వ సిద్ధాంతమని సీఎం చెప్పారు. జగనన్న చేదోడు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,47,040 నాయీ బ్రాహ్మణ, రజక, టైలర్ల కుటుంబాలకు సాయం అందిస్తున్నామన్నారు. పాత అప్పులకు ఈ సాయాన్ని జమ చేసుకోవద్దని బ్యాంకర్లతో మాట్లాడి లబ్ధిదారులకు ఖాతాలో రూ.10 వేల చొప్పున జమ చేస్తున్నామన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగనన్న చేదోడు పథకం ప్రారంభోత్సవానికి ముందు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, లబ్ధిదారులతో మాట్లాడారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే.. 

లాక్‌డౌన్‌ సమయంలో నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్ల కుటుంబాలు బతకడం కష్టతరమైన పరిస్థితులు చూశాం. మేనిఫెస్టో అనేది బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తాను. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట కచ్చితంగా అమలు చేస్తానని నా సుదీర్ఘ పాదయాత్రలో నేను చేసిన ప్రసంగంలోనూ చెప్పాను. ఆ తరువాత మేనిఫెస్టోలో రాతపూర్వకంగా పెట్టి ఎవరికైతే సాయం చేస్తానని చెప్పానో.. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నా రజక సోదరులకు, నాయీ బ్రాహ్మణ సోదరులకు, దర్జీ వృత్తి చేసుకుంటున్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముళ్లకు ఇచ్చిన మాట అమలు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. 

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,25,926 మంది టైలర్ల కుటుంబాలకు, షాపులున్న 82,347 మంది రజక సోదరుల కుటుంబాలకు, షాపులున్న దాదాపు 40 వేల నాయీ బ్రాహ్మణ అన్నదమ్ముల కుటుంబాలకు.. మొత్తం 2,47,040 కుటుంబాలకు రూ.247 కోట్లు ఈ రోజు నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి రూ.10 వేల చొప్పున అందజేయనున్నాం. ఈ డబ్బులన్నీ పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా బ్యాంకర్లతో మాట్లాడి.. ఈ సొమ్మును జమ చేస్తున్నాం. 

రాష్ట్రంలోని మూరుమాల గ్రామం, పట్టణంలో కూడా గ్రామ వలంటీర్ల ద్వారా, సచివాలయాల ద్వారా అర్హులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టాం. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి.. గ్రామసభలో పెట్టి జాబితాను చూపించి అర్హులను గుర్తించాం. ఎవరికైనా షాపు ఉండి.. అర్హత ఉండి సాయం అందని పరిస్థితి పొరపాటున జరిగి ఉంటే.. ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లండి... అక్కడ జగనన్న చేదోడు పథకానికి దరఖాస్తు చేసుకునే అర్హతలు, మార్గదర్శకాలు ఉంటాయి. అర్హతలతో కూడిన పత్రాలను తీసుకొని గ్రామ సచివాలయం నుంచి దరఖాస్తు పెట్టండి.. వలంటీర్ల ద్వారా సిబ్బంది వచ్చి పరిశీలన చేస్తారు. వచ్చే నెల 10వ తేదీ వరకు మిగిలిపోయిన అర్హులందరికీ సాయం అందిస్తాం.. ఎవరూ అధైర్యపడొద్దు. మన ప్రభుత్వం ఎలా ఇవ్వాలనే ఆరాటపడుతుంది కానీ, ఎలా కత్తిరించాలని చూసే ప్రభుత్వం మనది కాదని ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి అన్నదమ్ముడికి తెలియజేస్తున్నా. 

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనేది మా ప్రభుత్వ ధ్యేయం. సంక్షేమ పథకాల అమలులో కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడకుడదు. చివరకు నాకు ఓటు వేయని వారికైనా కూడా అర్హత ఉంటే కచ్చితంగా సంక్షేమ పథకాలు అందాలి. ఇదే ఈ ప్రభుత్వ సిద్ధాంతం. 

మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. మనం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సంవత్సరకాలంలో నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను కూడా దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మనస్ఫూర్తిగా చేయగలిగానని సగర్వంగా చెప్పగలుగుతున్నా. అమ్మ ఒడి పథకం, రైతు భరోసా పథకం, పెన్షన్‌ కానుక, సున్నావడ్డీ పథకం, విద్యాదీవెన, వసతి దీవెన, వాహన మిత్ర, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, ఈ రోజు ప్రారంభం చేస్తున్న చేదోడు పథకం తీసుకున్నా.. ఏ పథకం తీసుకున్నా.. చివరకు ఇంగ్లిష్‌ మీడియం చదువులు.. జూలై 8వ తేదీన నాన్నగారి పుట్టిన రోజున ఇవ్వబోతున్న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ఏ పథకం తీసుకున్నా.. వివక్షకు తావులేకుండా.. అవినీతికి చోటు లేకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా అమలు చేస్తున్నాం. 

ఈ సంవత్సరం కాలంలో దాదాపు 42,465 కోట్లు ఖర్చు చేసి 3.58 కోట్ల పేదలకు మేలు చేశాం. సాయం కూడా నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోనే జమ చేశాం. బహుశా రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేసి పేదవాడికి తోడుగా ఉన్న ప్రభుత్వం ఎక్కడా లేదు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమం చేయగలిగాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చెప్పినవన్నీ చేయడానికి దేవుడు సహకరించాలని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుతూ.. ఈ కార్యక్రమంతో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా.
 

Back to Top