తిరుపతి: రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని, దీని కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్‌లో జరుగుతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం వైయస్ జగన్ పలు కీలక అంశాలపై ప్రస్తావించారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడం లేదన్నారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే మిగిలి ఉన్నాయని చెప్పారు. దీంతో రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని వివరించారు. ‘పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. రీసోర్స్ గ్యాప్‌నూ భర్తీ చేయలేదు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించండి. తీవ్ర నష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరటనివ్వండి. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రేషన్ లబ్ధిదారుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదు. వెంటనే సవరణలు చేయాలి’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశంలో ప్రస్తావించారు. అన్నింటినీ తప్పనిసరిగా పరిష్కరిస్తాం.. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న అంశాలు కేవలం రెండు రాష్ట్రాలకు చెందినవే కావు.. ఇవి జాతీయ అంశాలు కూడా అని కేంద్ర హోంశాఖ మంత్రి, సదరన్ జోనల్ కౌన్సిల్ చైర్మన్ అమిత్‌షా అన్నారు. సీఎం వైయస్ జగన్ ప్రస్తావించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని, వీటన్నింటినీ తప్పనిసరిగా పరిష్కరిస్తామని కేంద్రమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు.