ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు

ఏలూరులో వైయస్‌ఆర్‌  ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

పైలట్‌ ప్రాజెక్టు కింద పశ్చిమ గోదావరి జిల్లాలో 2059 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు

ఏప్రిల్‌ నుంచి ప్రతి నెలా  ఒక్కో జిల్లాలో 2,059 వ్యాధులకు చికిత్స విస్తరణ

వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది

ఆపరేషన్‌ చేయించుకున్నాక విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఏలూరు: పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. పైలట్‌ ప్రాజెక్టు కింద పశ్చిమ గోదావరి జిల్లాలో 2059 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి రోగానికి వైద్యం అందించాలి, రోగులకు మంచి జరగాలన్నదే తన లక్ష్యమన్నారు. ఏలూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. సీఎం మాటల్లోనే..

ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్త సంవత్సరంలో మన ప్రభుత్వం ప్రారంభిస్తున్న రెండోవ సంక్షేమ కార్యక్రమం. జనవరి 1న ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులు దాదాపు 50 వేల మందికి మంచి చేస్తూ అందరిని కూడా ప్రభుత్వంలో విలీనం చేశాం.ఈ రోజు ఈ జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు 2059 సేవలకు పెంచుతూ ఈ రోజు ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం రెండోవది. అన్నింటికన్న సంతృప్తి కలిగించే కార్యక్రమం. ఇంతకుముందు నాన్నగారు, దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి దేశంలోనే ఆరోగ్యశ్రీ విప్లవం తీసుకువచ్చారు. దేశంలోని 28 రాష్ట్రాల కంటే కూడా మిన్నగా మరో అడుగు ముందుకు వేయడానికి ఇక్కడికి వచ్చానని చెప్పడానికి గర్వపడుతున్నాను., వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింజేస్తామని, చేయాలని తపన, తాపత్రయంతో  అడుగులు ముందుకు వేస్తున్నాను, ఎన్నికల్లో మాటిచ్చాను..ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తానని చెప్పారు. పేదవాడు ఏ ఒక్కరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అన్నాను. ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. గతంలో ఆరోగ్యశ్రీ 1059 రకాల సేవలకు మాత్రమే పరిమితమైంది. ఏ ఒక్కరూ కూడా పట్టించుకోని పరిస్థితిని గత ప్రభుత్వంలో చూశాం. గత ఏడు నెలలుగా ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెస్తూ అడుగులు వేస్తున్నాం. ఆ అడుగుల్లో భాగంగానే ఈ రోజు ఈ జిల్లాలో ఫైలెట్‌ ప్రాజెక్టు కింద 1059 చికిత్సలకు తోడు మరో వెయ్యి చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చుతూ 2059 సేవలతో ఫైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాం. ఈ ప్రాజెక్టును కొనసాగిస్తునే మూడు నెలలు ఫైలెజ్‌ ప్రాజెక్టును కొనసాగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 200 రోగాలకు పెంచుతూ 1259 రోగాలకు ఆరోగ్యశ్రీ కింద సేవలందిస్తున్నాం. ఈ జిల్లాలో మాత్రం 2059 సేవలకు వర్తింపజేస్తున్నాం. ప్రతి రోగానికి వైద్యం అందాలి. ఇన్ని రోగాలను కవర్‌ చేసే పరిస్థితి ఎక్కడా లేదు. డాక్టర్ల సలహా మేరకు వెయ్యి రోగాలను ఈ ప్రాజెక్టు కిందకు తీసుకువస్తున్నాం. ఏప్రిల్‌ మాసం నుంచి ఇదే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో నెలకు ఒక జిల్లా చొప్పున అమలు చేస్తాం. ఇందులో ఒక్క ముఖ్యమైన రోగం గురించి చెబుతున్నా..క్యాన్సర్‌ పరిస్థితి ఎలా ఉందంటే..ముష్టి వేసినట్లు కాస్తో..కూస్తో ఇచ్చారు. ఈ పరిస్థితిని మార్చుతున్నాం. అన్ని క్యాన్సర్లకు ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తున్నాం. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అడుగులు వేస్తున్నాం..ఇప్పుడిప్పుడే కొలిక్కి వచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి క్యాన్సర్‌ పేసెంట్‌కు రూపాయికి కూడా డబ్బు ఖర్చు కాకుండా వైద్యం అందిస్తాం. ఏ రకమైనా క్యాన్సర్‌ అయినా ఫర్వాలేదు. ప్రభుత్వమే వైద్యం ఖర్చు భరిస్తుంది. చికున్‌గున్యా, వడదెబ్బ, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌కు గతంలో వేలకు వేలు డబ్బులు పిండేవారు. ఇవన్నీ కూడా 1259 రోగాల్లో కవర్‌ అయ్యేలా రాష్ట్రవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నాం.  పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ 1259 రోగులకు మరో వెయ్యి చికిత్సలు అదనంగా చేర్చుతూ 2059 రకాల చికిత్సలు అందిస్తు పైలట్‌ ప్రాజెక్టు మొదలుపెడుతున్నాం. ఎన్నికల్లో చెప్పినట్లుగా సంవత్సరానికి రూ.5 లక్షల ఆదాయం ఉన్నా కూడా  ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధలోకి తీసుకువస్తున్నాం. నెలకు రూ.40 వేలు పైచిలుకు జీతం ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తామని చెప్పాం. ఈ రోజు నుంచి కోటి 42 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తున్నాం. కార్డులు ఇవ్వడమే కాదు..కార్డులకు క్యూఆర్‌ బార్‌ కోడ్‌ను కూడా ఇస్తున్నాం. ఒక్కసారి బ్లేడ్‌ టెస్ట్‌, క్యాన్సర్‌ టెస్ట్‌, ఎక్సేరే, సిటీ స్కాన్‌ చేయించుకుంటే ఆ రిపోర్టు ఎక్కడ ఉన్నాయని వేతుకునే అవసరం ఉండదు. మెడికల్‌ రిపోర్టులు మొత్తం కూడా ఆరోగ్యశ్రీ కార్డులోనే ఉండేలా క్యూఆర్‌ బార్‌కోడ్‌ను ఏర్పాటు చేశాం.  కార్డులు ఇచ్చే కార్యక్రమం ఈ రోజే మొదలవుతుంది. త్వరలోనే కార్డులు గ్రామ సచివాలయాల ద్వారా అందజేస్తున్నారు. గ్రామ సచివాలయంలో ఉన్న మెడికల్‌ అసిస్టెంట్‌, పీహెచ్‌సీలో ఉన్న ఆరోగ్య మిత్రలు కూడా ఎవరికైనా ఏదైన రోగం వస్తే ఎక్కడికి వెళ్లాలని గైడ్‌ చేస్తారు. ఆశావర్కర్లు దాదాపు 50 వేల మంది ఉన్నారు. వీరిని ఇంకా మెరుగ్గా ఉపయోగించుకుంటాం. 300 ఇళ్లకు ఒక్కో ఆశా వర్కర్‌ను అటాచ్‌ చేస్తాం. ఆ ఇళ్లకు సంబంధించిన వ్యక్తుల ఆరోగ్య బాధ్యతలను వీరి చేతుల్లో పెడతాం. వాళ్లు అక్కడి నుంచి గ్రామ సచివాలయాలతో అనుసంధానం అవుతారు. ఆరోగ్యశ్రీలో ఎవరికైనా అవసరం వస్తే..మేమున్నాం మీకు తోడుగా ఉన్నాం..మాకు జగనన్న అండగా ఉన్నాడని ఆశా వర్కర్లు అనేలా చేస్తానని ఈ వేదిక మీద నుంచి గర్వంగా చెబుతాను. ఆరోగ్యశ్రీ చరిత్రలో మరో కొత్త అధ్యాయానికి ఈ రోజు ఏపీలో శ్రీకారం చుడుతున్నాం. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాను. ఆరోగ్యశ్రీలో ఏ మార్పులు చేస్తే బాగుంటుంది. ఏం మార్పులు చేస్తే ప్రజల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తాయి. ప్రజలు అప్పులపాలు కాకుండా  వైద్యం అందే పరిస్థితి రావాలంటే ఏం చేయాలన్న ఆలోచనలతోనే నా పాదయాత్రలో అడుగులు ముందుకు వేశా. మీ కుటుంబ సభ్యుడిగా గత ఏడు నెలల్లోనే మన ప్రభుత్వం ఆరోగ్య పరంగా ఎన్ని నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు ముందుకు వేసింది. నవంబర్‌ 1,2019న దేశ చరిత్రలో ఏ రాష్ట్రం తీసుకొని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రం వెలుపల కూడా సూపర్‌ స్పెషాలిటీ సేవలు ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్య శ్రీ సేవలు వర్తింపజేశాం. హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో 150 ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చాం. డిసెంబర్‌ 1, 2019న ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయించుకున్న తరువాత రోగులు కోలుకునేందుకు  విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా వారికి తోడుగా ఉండాలనే తపన, తాపత్రయంతో ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో అండగా ఉండేందుకు..రోజుకు రూ.225 చొప్పున, నెలకు రూ.5 వేల చొప్పున డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పుట్టుకతోనే వినికిలోపం, మూగ చెవుడు ఉన్న పిల్లలను పాదయాత్రలో చాలా చోట్ల చూశాను. వారికి ఆపరేషన్‌ చేయాలంటే రూ.6 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. దాన్ని కూడా మార్చుతూ..అలాంటి పిల్లలకు గతంతో ఒక్క చెవికి మాత్రమే ఆపరేషన్‌ చేసేవారు. దీన్ని రెండు చెవులకు మార్చుతూ శ్రీకారం చుట్టాం. దీనికి రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుందని అడుగులు ముందుకు వేశాం. జనవరి 1వ తేదీ నుంచి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో 510 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నాం. ఈ కార్యక్రమాన్ని చేయడానికి మొత్తం హెల్త్‌ డిపార్ట్మెంట్‌ చాలా కష్టపడింది. ఇచ్చే మందులు కూడా ఇక మీదట ఏప్రిల్‌ మాసం నుంచి క్వాలిటీ ఉండేలా చేస్తాం. నెల నెల డయాలసిస్‌ పేషంట్లకు పింఛన్‌ రూ.10 వేలకు పెంచాం. ఈ రోజు నుంచి మొదలుకొని తలసీమియా, సికిల్‌సెల్‌, హీమోఫిలియా వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారికి ఈ నెల నుంచి రూ.10 వేల చొప్పున ఇస్తున్నాం. బోదకాలు, మస్కలర్‌ డిస్కోప్రి, పక్షపాతంతో బాధపడుతున్న వారికి ఫిబ్రవరి నెల నుంచి రూ.5 వేల పింఛన్‌ ఇస్తాం. ఫిబ్రవరి 1 నుంచి కుష్టు వ్యాధిగ్రస్తులకు కూడా రూ.3 వేలు ఇస్తాం. ఫిబ్రవరి 1 నుంచి క్యాన్సర్‌లో అన్ని రకాల రోగాలకు పూర్తిగా ప్రభుత్వమే ఖర్చులు భరించేలా చేస్తాం. రెండు నెలల క్రితం ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మిక పనులు చేస్తున్న వారు నా వద్దకు వచ్చారు. చాలీచాలని జీతంతో పని చేస్తున్నామని, రూ.8 వేలతో బతకలేకపోతున్నామని చెప్పారు. ఈ నెల నుంచి వారి జీతాలు రూ.16 వేలు చేస్తున్నాం. నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆసుపత్రి రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుడుతున్నాం. మూడేళ్లలో ఆసుపత్రులను దశలవారీగా మార్పు చేయబోతున్నాం. ఫిబ్రవరి 1వ తేదీన 5 వేల ఆరోగ్య ఉప కేంద్రాల రూపురేఖలను మార్చేందుకు శ్రీకారం చుట్టబోతున్నాం. వేగంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల రూపురేఖలు మార్చి జాతీయ ప్రమాణాలకు సమానంగా తీసుకువస్తాం. మార్చి నెలాఖరుకల్లా అక్షరాల 1060 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా రోడ్లపై తిరుగుతాయి. 108, 104 కొత్త వాహనాలు రోడ్లపై తిరుగుతాయి. మిమ్మల్ని చిరునవ్వుతో ఇంటికి పంపిస్తాయి.  నెట్‌ వర్క్‌ ఆసుపత్రుల పనితీరు మెరుగు పరుస్తాం. గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేస్తాం. మే నెలాఖరుకు ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులు, నర్సులు, అన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తాం. అక్టోబర్‌ 10న వైయస్ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాం. దాదాపు 66 లక్షల బడిపిల్లలకు కంటి పరీక్షలు చేయించాం. లక్ష 47 మంది పిల్లలకు కళ్లజోళ్లు అందజేశాం. 45 వేల మంది పిల్లలకు ఆపరేషన్లు చేయిస్తున్నాం. ఫిబ్రవరి 1న అవ్వతాతలకు కంటి వెలుగు కార్యక్రమం వర్తింపజేస్తాం. ఆరు నెలల పాటు అవ్వతాతలకు స్క్రీనింగ్‌ చేయించి, ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తాం. కంటి అద్దాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1న ప్రారంభిస్తాం. పలాస, మార్కాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించి పరిశోధక కేంద్రాలు తీసుకువస్తాం. ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేస్తాం. పలాసలో ఇప్పటికే టెండర్లు పిలిచాం. మరో నెల రోజుల్లోనే పనులు మొదలుకాబోతున్నాయి. మార్కాపురం, పిడుగురాళ్ల, ఏలూరు, మచిలీపట్నం, పులివెందులలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాం. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మరో నెల రోజుల్లో టెంటర్ల కోసం తయారు చేయబోతున్నాం. రెండున్నర నెలల్లోనే పనులు మొదలుపెడతాం. మన తరువాతి తరం పిల్లలకు మంచి చేసేందుకు వైయస్‌ జగనన్న ప్రభుత్వం నాలుగు అడుగులు ముందుకు వేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ పిల్లల కోసం నా తపన, తాపత్రయం ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది.ఈ పిల్లలు బాగా చదవాలి. ఈ పిల్లలు బావి తరాలతో పోటీ పడాలి. వీరి జీవితాలు మార్చాలని నాలుగు అడుగులు ముందుకు వేస్తూ ఈ నెల 9న అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆ పిల్లలను చదివించేందుకు తల్లులు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి తల్లికి జగనన్న తోడుగా ఉన్నారు. ప్రతి చిన్న పిల్లాడికి జగన్‌ మామ తోడుగా ఉన్నాడని ఈ వేదికపై నుంచి సగర్వంగా చెబుతున్నాను. చదువుల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేయబోతున్నాం. రేపు పొద్దున మన పిల్లలు బావి తరాలతో పోటీ పడగలరు. అమ్మ ఒడి కార్యక్రమం, ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లు, నాడు-నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నాం. రాబోయే రోజుల్లో మన పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టే ఆహారంలో కూడా మెనూను మార్చబోతున్నాం. ఇవన్నీ చేయడంతో పిల్లల భవిష్యత్తు మారుతుందని సగర్వంగా ఈ వేదికపై నుంచి తెలియజేస్తున్నాం. నవరత్నాలు అన్నీ కూడా రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి గ్రామంలోనూ, పేదరికంలో ఉన్న ప్రతి వారికి కూడా అభివృద్ధి, పరిపాలన ఫలాలు అందాలి. ప్రభుత్వం అన్నది వీళ్లందరికి అందించాలి. అన్ని ప్రాంతాలు బాగుండాలి. ప్రతి నిర్ణయం కూడా ఇదే ప్రాతిపాదికన జరుగుతుందని తెలియజేస్తున్నాం. గ్రామ పరిపాలన నుంచి రాష్ట్ర పరిపాలన వరకు అందరూ సమానమే.అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయమని నమ్ముతూ రాష్ట్రంలో అత్యున్నత పాలన పరంగాను, అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని సగర్వంగా ఈ వేదికపై నుంచి చెబుతున్నాను. గతంలో అన్యాయంగా నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని సరిదిద్దుతాం. అన్నదమ్ముళ్ల మాదిరిగా అన్ని ప్రాంతాలు ఉండేలా ఎప్పటికీ అనుబంధాలు నిలిచేలా మీరిచ్చిన అధికారాన్ని దేవుడి దయతో వచ్చిన ఈ పదవిని అందరి అభివృద్ధికి ఉపయోగిస్తానని మరోసారి చెబుతూ..మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు, దేవుడి వద్ద మీరు చేసే ప్రార్థనలు  ఎల్లప్పుడు మీ బిడ్డపై ఉంచాలని కోరుతూ..మీ అందరి దీవెనల కోసం, ఆప్యాయతల కోసం రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా..

తాజా వీడియోలు

Back to Top