మీ రుణం తీర్చుకుంటున్నందుకు సంతోషంగా ఉంది

నాన్న మరణంతో ఒంటరైన నాకు మీరంతా తోడయ్యారు 

పులివెందులలో రూ.1329 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం

ఇది ఫస్ట్‌ ఇనిస్టాల్‌మెంట్‌ మాత్రమే.. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి

గండికోట దిగువన 20 టీఎంసీల సామర్థ్యంతో మరో ప్రాజెక్టు తెస్తాం

వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి తీసుకువస్తాం

చెరువులు లేని గ్రామాలకు చెరువులు తవ్వించి కాల్వలతో అనుసంధానం చేస్తాం

పులివెందుల బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: పులివెందులలో మొదటి ఇనిస్టాల్‌మెంట్‌ కింద రూ.1329 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. నాన్నను మీరంతా అమితంగా ప్రేమించారు. నాన్న చనిపోయిన తరువాత నాకు ఎవరూ లేరన్న సందర్భంగా మీ వెనక మీమంతా ఉన్నామని కుటుంబంలా తోడుగా నిలబడ్డారు. మీ బిడ్డ ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. మీ బిడ్డకు మీ అందరి రుణం తీర్చుకుంటున్నందుకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. గండికోట డ్యామ్‌ దిగువన 20 టీఎంసీల నీటి సామర్థ్యం గల ప్రాజెక్టుకు రాబోయే రోజుల్లో శంకుస్థాపనలు చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం సీఎం మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. 

పులివెందల నియోజకవర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద జరగబోయే పనులకు సంబంధించి శంకుస్థాపనలు చేశాం. 
1. మొట్టమొదటగా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, రూ.347 కోట్లతో గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ నిర్మించబోతున్నాం. 

2. గాలేరు – నగరి సృజల స్రవంతి ప్రధాన కాల్వ నుంచి వేముల, వేంపల్లి మండలంలోని 15 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఎత్తిపోతల పథకం నిర్మాణం. ఈ పథకం ద్వారా కొత్తగా అలవలపాడు, పెండ్లూరు, నాగూరు గ్రామాలకు జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి నీరు అందించడమే కాకుండా పీబీసీ ఆయకట్టు చివర్లో ఉన్న చెరువులు వీ.కొత్తపల్లి, గిడ్డంగులవారిపల్లి, టి.వెలమారిపల్లి, ముచ్చుకోన చెరువుల ద్వారా నీరు వెళ్లి పాపాగ్ని చెరువులో కలుస్తాయి. మధ్యలో నందిపల్లి, కుప్పాలపల్లి, ముసలిరెడ్డిపల్లి గ్రామాలకు కూడా దీని వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుకు రూ. 58 కోట్లతో శంకుస్థాపన చేస్తున్నాం. 

3. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి ఎర్రబెల్లి చెరువుకు నీటిని నింపడం, వేముల మండలంలోని యూసీఐఎల్‌ (యురేనియం కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌)తో ప్రభావితం అయ్యే ఏడు గ్రామాలకు నీటి సరఫరా నిమిత్తం ఎత్తిపోతల పథకం నిర్మాణం. ఈ పథకం ద్వారా కోమనూతల, ఎగువపల్లి, మురాలచింతల, అంబకపల్లి, ఎర్రబెల్లి చెరువుకు, మోట్లుతలపల్లి వంకకి, యూసీఐఎల్‌ గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది. గిడ్డంగులవారిపల్లెలో 1.01 టీఎంసీ రిజర్వాయర్‌ కూడా నిర్మిస్తున్నాం. దీని వల్ల యూసీఐఎల్‌ పల్లెలకు నీరు పూర్తిగా అందుతుంది. దీని కోసం అక్షరాల రూ.350 కోట్లతో ఇవాళ శంకుస్థాపన చేశాం. 

4. పులివెందల మున్సిపాలిటీలో 57.36 కిలోమీటర్ల మేర అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్‌ కోసం అక్షరాల రూ.100 కోట్లు కేటాయింపు చేశాం. ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం. 

5. పులివెందుల మున్సిపాలిటీలో 142.56 కిలోమీటర్ల మేర తాగునీటి సరఫరా కోసం పైపులైన్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. దీని కోసం టౌన్‌కు రూ.65 కోట్ల కేటాయిస్తూ శంకుస్థాపన చేశాం. 
6. వేంపల్లి గ్రామ పంచాయతీ నందు 86.50 కిలోమీటర్ల మేరకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్‌ ఏర్పాటు చేయబోతున్నాం. దీని కోసం వేంపల్లి టౌన్‌కు రూ.63 కోట్లు కేటాయింపు చేస్తూ ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది.

7. పాడా నిధులతో పులివెందుల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం, సీసీ రోడ్లు, పులివెందుల పట్టణ సుందరీకరణ పనులు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు, పీబీసీ, సీబీఆర్‌ పరిధిలో వివిధ చెరువులకు సాగునీటి సరఫరా, జూనియర్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, పీబీసీ నుంచి దొరలవాగు చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల చెరువు నుంచి వనంబావి చెరువుకు ఎత్తిపోతల పథకం, నాయినీ చెరువు నుంచి బక్కనగారిపల్లె చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల కింద రామట్లపల్లె చెరువు, గునకలపల్లె చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల కెనాల కింద సోత్రియం ఎత్తిపోతల పథకం నుంచి నల్లపరెడ్డిపల్లె, అమ్మాయిగారిపల్లి కుంటకు నీరు అందించడానికి మొత్తం ఇవన్నీ కలిపి రూ.114 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. 
8. పులివెందుల నియోజకవర్గంలో ఏడు మార్కెటింగ్‌ గిడ్డంగులు ఏర్పాటు చేస్తున్నాం. పులివెందుల, సింహాద్రిపురం మార్కెట్‌ యార్డుల మౌలిక వసతుల ఏర్పాటుకు రూ. 13.21 కోట్లుతో శంకుస్థాపన చేశాం.
9. పులివెందులలో ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్, ప్రీ కూలర్, శీతలగిడ్డంగి నిర్మాణం హార్టికల్చర్‌ పంటల కోసం. దీని కోసం రూ.13 కోట్లు కేటాయింపు చేస్తూ ఈ రోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. 
10. నల్లచెరువుపల్లె గ్రామంలో 132 కేవీ విద్యుత్‌ ఉప కేంద్రం ఏర్పాటు ద్వారా 14 గ్రామాలకు లబ్ధిచేకూరుతుంది. దీని కోసం రూ. 27 కోట్లు కేటాయింపు చేస్తూ ఫౌండేషన్‌ స్టోన్‌ వేశాం. 
11. 33/11 కేవీ విద్యుత్‌ సామర్థ్యం గల ఐదు ఉప కేంద్రాల నిర్మాణం చేయడం ద్వారా 10 గ్రామాల్లోని 2100 వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు, 10200 గృహ విద్యుత్‌ సర్వీసులకు లబ్ధి. ఇందు కోసం రూ.10 కోట్లు కేటాయింపులు చేస్తూ ఫౌండేషన్‌ స్టోన్‌ వేశాం. 
12. ఆర్‌ అండ్‌ బీ ద్వారా రెండు రహదారుల విస్తీరణ, ఓల్డ్‌ కడప నుంచి పులివెందుల రోడ్డు, వేంపల్లె టౌన్‌లో నూలివీడు, పందికుంట, కోళ్లకుంట రోడ్డు. వీటి కోసం రూ.19.60 కోట్లతో శంకుస్థాపన చేయడం జరుగుతుంది.
13. పులివెందులలో ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి కొరకు రూ.11.52 కోట్లతో ఈ రోజు ఫౌండేషన్‌ స్టోన్‌ వేయడం జరుగుతుంది. 
14. వేంపల్లెలో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ 30 పడకల ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రి స్థాయికి పెంచుతున్నాం. దీని కోసం రూ. 9.30 కోట్లతో ఈ రోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. 
15. ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ అకాడమీ చేస్తూ 14 డిసిప్లిన్స్‌కు సంబంధించిన పూర్తిగా ఇక్కడే అన్ని రకాల వసతులతో పాటు ట్రైనింగ్‌ ఇచ్చేలా.. అకాడమీ తీసుకువస్తున్నాం. ఇందుకోసం రూ.17.50 కోట్ల కేటాయింపులు చేస్తూ ఈ రోజు ఫౌండేషన్‌ స్టోన్‌ వేయడం జరిగింది. 
16. ఇడుపులపాయలో వైయస్‌ఆర్‌ మెమోరియల్‌ గార్డెన్‌ అభివృద్ధి కోసం రూ.20 కోట్లు కేటాయింపు చేస్తూ ఈ రోజు ఫౌండేషన్‌ స్టోన్‌ వేయడం జరిగింది. 
17. నియోజకవర్గంలో 51 దేవాలయాల పునరుద్ధరణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఉన్న 18 నూతన దేవాలయాల నిర్మాణాలకు రూ.16.85 కోట్లు కేటాయిస్తూ ఫౌండేషన్‌ వేయడం జరిగింది. 
18. పులివెందుల నందు ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, మినీ సచివాలయం ఏర్పాటు కొరకు రూ.10 కోట్లు కేటాయింపులు చేస్తూ ఈ రోజు ఫౌండేషన్‌ స్టోన్‌ వేయడం జరుగుతుంది. 
19. నియోజకవర్గంలో 32 గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలకు రూ.11.20 కోట్లతో ఫౌండేషన్‌ స్టోన్‌ వేయడం జరిగింది.
20. వేంపల్లెలో నూతన ఉర్దూ జూనియర్‌ కళాశాల కొరకు రూ. 4.50 కోట్లు కేటాయింపులు చేస్తూ ఫౌండేషన్‌ వేయడం జరిగింది. 
21. వేంపల్లెలో కొత్తగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తూ రూ. 20 కోట్లు కేటాయింపులు చేసి ఫౌండేషన్‌ వేశాం. 
22. జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ పులివెందుల నందు లెక్చరర్‌ కాంప్లెక్స్, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తూ జేఎన్టీయూకు రూ.20 కోట్లు కేటాయింపులు చూస్తూ ఈ రోజు ఫౌండేషన్‌ స్టోన్‌ వేశాం.
23. వేంపల్లె నుంచి కొత్తగా బీసీ తరగతులు బాలురు, బాలికల వసతి గృహాల కోసం రూ.4 కోట్ల కేటాయింపు చేసి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 
24. పులివెందులలో ఒక మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ క్రియేట్‌ చేస్తూ రూ.3.64 కోట్లు కేటాయింపు చేశాం. 

ఈ రోజు ఫస్ట్‌ ఇన్‌స్టాల్‌ మెంట్‌ కింద రూ. 1329 కోట్లతో పులివెందులలో శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టాం. దేవుడు ఆశీర్వదించి.. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రపోజల్స్, డీపీఆర్‌లు తయారవుతున్నాయి. రాబోయే రోజుల్లో, పర్యటనల్లో మిగిలిన ఇన్‌స్టాల్‌మెంట్‌ ఫౌండేషన్‌ స్టోన్‌ వేస్తాం. రాబోయే రోజుల్లో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి వచ్చే విధంగా డీపీఆర్‌ తయారవుతుంది. ఐటీకార్ల బిల్డింగ్‌ ఇక్కడే కనిపిస్తుంది.. నాయన టైమ్‌లో ఈ బిల్డింగులు కట్టారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఆ బిల్డింగులను పట్టించుకున్న  పరిస్థితులు లేవు. అంతమంచి బిల్డింగ్‌ల పరిస్థితి చూస్తుంటే దయనీయంగా ఉంది. ఆ బిల్డింగ్‌లలో అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కాలేజీలు తీసుకువచ్చే విధంగా రాబోయే రోజుల్లో ప్రపొజల్స్‌ తయారవుతున్నాయి. దానికి కూడా పునాది రాయి వేసే కార్యక్రమం చేస్తాం. రాబోయే రోజుల్లో పెండింగ్‌ పీబీసీ, లింగాల బ్రాంచ్‌ కెనాల్, గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు చేపడతాం. అంతేకాకుండా ఇప్పటికే అనేక గ్రామాలకు చెరువులు ఉన్నాయి.. చెరువులు లేని గ్రామాలకు చెరువులు తవ్విస్తాం. సర్వే చేయించి ఆ చెరువులు, దగ్గరలో ఉన్న కాల్వలతో అనుసంధానం చేసి పూర్తిగా నింపే కార్యక్రమాలు కూడా చేస్తాం. ఆ చెరువులకు మైక్రోఇరిగేషన్‌తో లింకు చేసి ఆయకట్టుకు నీరు అందించే కార్యక్రమం చేస్తాం. పీబీసీ ఆయకట్టును మైక్రో ఇరిగేషన్‌ కిందకు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 

అన్నింటికంటే ఒక్క ప్రాజెక్టు.. చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. కరువు సీమలో ఉన్నాం. నీరు లేకపోతే పరిస్థితులు ఏమిటో పూర్తిగా తెలిసిన ప్రాంతం మనది కాబట్టి గండికోట డ్యామ్‌ దిగువన ముద్దనూరు మండలంలో అరవేటిపల్లి, దేనేపల్లి దగ్గర ఇంజనీర్లు ఐడెంటిఫై చేశారు.. సర్వేలు జరుగుతున్నాయి. రిపోర్టులు తయారవుతున్నాయి. మరో 20 టీఎంసీల నీరు స్టోర్‌ చేసుకునే కెపాసిటీ మేరకు వసతులు ఉన్నాయని చెబుతున్నారు. రాబోయే ఆ డ్యామ్‌ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేస్తాం. 

మన ప్రాంతానికి చిరకాల కోరిక అయిన ముద్దనూరు నుంచి కొడికొండ చెక్‌పోస్టు రోడ్డు అంటే పులివెందుల, బెంగళూరు రోడ్డును వాడుతుంటాం. ఆ రోడ్డును కూడా విస్తరించే దిశగా అడుగులు వేస్తాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాలు, మీ అందరి చల్లని దీవెనలతో, ఆ దేవుడి దయతో మీ బిడ్డ ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడమే కాకుండా.. మీ బిడ్డ మీ అందరి రుణం తీర్చుకునే ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నాన్నను అమితంగా ప్రేమించారు. నాన్న చనిపోయిన తరువాత నాకు ఎవరూ లేరన్న సందర్భంలో మీ వెనక మీమంతా ఉన్నామని ఒక కుటుంబంలా తోడుగా నిలబడ్డారు. ఒక బిడ్డగా దీవించారు.. ఆశీర్వదించారు. రాబోయే రోజుల్లో దేవుడు ఆశీర్వదించి ఇంకా గొప్పగా మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటూ.. మీ అందరి ఆప్యాయతలకు పేరు పేరునా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

Back to Top