గాజువాక ఘటనపై సీఎం వైయస్‌ జగన్‌ సీరియస్‌

ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

వరలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రి, దిశ పోలీసులకు ఆదేశం

విశాఖ: వరలక్ష్మి ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. విశాఖ జిల్లా గాజువాక ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరలక్ష్మి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించాలని హోంశాఖ మంత్రి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికాశుక్లా, దీపికా పాటిల్‌ను ఆదేశించారు. 

పాఠశాలల్లో చదువుతున్న బాలికలు మొదలుకొని కాలేజీ విద్యార్థినులు, ప్రతి మహిళ వరకు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించుకునేలా వారిని ఎడ్యుకేట్‌ చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాలను అదుపు చేసే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫలానా వ్యక్తుల నుంచి ముప్పు ఉందని సమాచారం వస్తే సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని పోలీసులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

కాగా, గాజువాకలోని శ్రీనగర్‌ సుందరయ్య కాలనీలో శనివారం రాత్రి ప్రేమోన్మాది చేతిలో వ‌ర‌ల‌క్ష్మి అనే యువ‌తి ప్రాణాలు కోల్పోయింది. ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేసుకున్న వరలక్ష్మి (17) అనే యువతిని చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్‌సాయి వెంకట్‌(21) ప్రేమ పేరుతో వేధించేవాడు. శనివారం రాత్రి రాము అనే స్నేహితుడితో కలిసి ఆమెకు ఫోన్‌చేసి సుందరయ్య కాలనీలోని సాయిబాబా ఆలయం వద్దకు రావాల్సిందిగా చెప్పాడు. అక్కడికి వచ్చిన యువతి ఎందుకు పిలిచావని అఖిల్‌సాయిని నిలదీయగా.. మాట్లాడాలి రా అంటూ తుప్పల్లోకి లాక్కెళ్లాడు. అక్కడి పరిస్థితిని చూసిన వరలక్ష్మి ఆలయం వద్దకు వెంటనే రావాలని తన అన్నకు ఫోన్‌ చేసి చెప్పగా.. కోపోద్రిక్తుడైన అఖిల్‌సాయి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై నరికాడు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top