నిర్ణ‌యం ల‌బ్ధిదారుల‌కే వ‌దిలేయండి

‘చేయూత’ ద్వారా ఏర్పాటవుతున్న షాపులకు బ్రాండింగ్‌ తీసుకురావాలి

రూ.75 వేలకు ఎన్ని మేకలు, గొర్రెలు వస్తే అన్నీ తీసుకోవాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

వైయస్‌ఆర్‌ చేయూత, ఆసరా అమలుపై సీఎం సమీక్ష

తాడేపల్లి: స్వయం ఉపాధి కల్పనలో మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ ఉండాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వైయస్‌ఆర్‌ చేయూత, వైయస్‌ఆర్‌ ఆసరా పథకాల అమలుపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం నీలం సాహ్ని, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘‘వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా కొత్తగా ఏర్పాటవుతున్న షాపులకు బ్రాండింగ్‌ తీసుకురావాలి. స్వయం ఉపాధి కల్పనలో మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ ఉండాలి. లబ్ధిదారులకు ఇచ్చే ఆవులు, గేదెల కొనుగోలులో నిపుణుల అభిప్రాయం తీసుకోవాలి. ఏది కొనవచ్చు అనేది మాత్రమే సూచించాలి.. నిర్ణయం లబ్ధిదారులకే వదిలేయాలి. మేలు జాతి ఆవులు, గేదెలు మాత్రమే కొనుగోలు చేయాలి. ఆర్‌బీకేల ద్వారా పశుగ్రాసం కూడా పంపిణీ చేయాలి. మేకలు, గొర్రెలలో ఆడ, మగ రెండూ సేకరించాలి. లబ్ధిదారులకు ఇస్తున్న రూ.75 వేలకు ఎన్ని మేకలు, గొర్రెలు వస్తే అన్నీ తీసుకోవాలి. లబ్ధిదారులకు ఒక మగ మేకపోతు లేదా గొర్రెపోతు తప్పనిసరిగా ఇవ్వాలి. ఏం మాంసానికి డిమాండ్‌ ఉంటుందో తెలుసుకొని ఎక్కువ సేకరించాలి. మేకలు, గొర్రెల సేకరణలో కూడా ఎస్‌ఓపీ ఉండాలి’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  

Back to Top