తాడేపల్లి: గ్రామ, వార్డు సచివాలయాల్లోని డేటా క్రోడీకరణ బాధ్యతను డిజిటల్ అసిస్టెంట్లకు అప్పగించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మండల స్థాయిలో ఉన్న ఉద్యోగి దీన్ని సూపర్‌వైజ్ చేయాలని సూచించారు. ప్రణాళిక శాఖ అధికారులతో సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రణాళిక శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ విజయ్‌కుమార్, కనెక్ట్ టు ఆంధ్రా సీఈఓ కోటేశ్వరమ్మ, ఆర్టీజీఎస్ సీఈఓ జే విద్యాసాగర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైయస్‌ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న డేటాను కూడా స్వీకరించాలని సీఎం ఆదేశించారు. దీని వల్ల ఈ–క్రాపింగ్ జరుగుతుందా..? లేదా..? అన్న దానిపై దృష్టిపెట్టగలుగుతామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేల్లో ఇంటర్‌నెట్ సరిగ్గా పనిచేస్తుందా..? లేదా..? అన్న డేటా ఎప్పటికప్పుడు రావాలన్నారు. ఉగాది రోజున వలంటీర్లను సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. వలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సహకాలతో వారిని గౌరవించాలన్నారు. సేవారత్న, సేవా మిత్ర పేరుతో వలంటీర్లను సత్కరించాలని సూచించారు.