అమరావతి: ఒడిశాలోని బాలోసోర్ సమీపంలో రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న సహాయక చర్యలపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రం నుంచి ఒడిశాకు వెళ్లిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తీసుకుంటున్న చర్యలను సీఎం వైయస్ జగన్‌కు అధికారులు వివరించారు. విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పర్యవేక్షణ కార్యకలాపాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.1లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం వైయస్ జగ్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహాయానికి అదనంగా ఇది ఇవ్వాలని సీఎం స్పష్టంచేశారు.
బాలాసోర్‌లో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి ఒకరు మరణించారని, ఇదితప్ప రాష్ట్రానికి చెందినవారెవరూ ఈ ఘటనలో మరణించినట్టుగా ఇప్పటివరకూ నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారికి మంచి వైద్యసదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వైయస్ జగన్‌కు అధికారులు తెలిపారు.