అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. పాఠశాలల అభివృద్ధిపై సీఎం వైయస్ జగన్ విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లను క్రమపద్ధతిలో ప్లస్ టు వరకు పెంచాలన్నారు. జూనియర్ కాలేజీల స్థాయికి వాటిని తీసుకెళ్లాలన్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి ఒక కాలేజీ చొప్పున బాగుచేయడంపై ప్రణాళిక రూపొందించాలన్నారు. నాడు–నేడు కింద 44,512 పాఠశాలలను బాగుచేయనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో 15,410 స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమం, తొమ్మిది రకాల కనీస వసతులు కల్పించనున్నట్లు వివరించారు. చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని, రాజీపడొద్దని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. స్కూళ్లల్లో చేపడుతున్న పనులకు విద్యా కమిటీల రాటిఫికేషన్ ఉండేలా చూడాలన్నారు. విద్యా కమిటీలు సామాజిక తనిఖీలు చేయాలని ఆదేశించారు.
వచ్చే ఏడాది నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పష్టం చేశారు. ఆ తరువాత 9, 10 తరగతులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన చేపట్టనున్నట్లు వివరించారు. 70 వేల మంది టీచర్లకు ఇంగ్లిష్ బోధనలో శిక్షణ ఇచ్చేలా డైట్స్‌ను బలోపేతం చేసేలా ఆలోచన చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రతి ఏడాది జనవరిలో పూర్తి చేయాలన్నారు. ఏ శాఖ ఏ పరీక్షలు పెట్టాలన్నా జనవరిలో పెట్టాలని సూచించారు. పర్యావరణ, వాతావరణ మార్పులు, రహదారి భద్రతపై పాఠ్యాంశాలు ఉంచాలన్నారు. వచ్చే ఏడాది నుంచి పుస్తకాలు, యానిఫాంలు, షూ, స్కూల్ బ్యాగులు స్కూల్‌లో చేరిన రోజే ఇవ్వాలని సూచించారు. నాణ్యమైన గుడ్డు విద్యార్థులకు అందేలా ఎలాంటి విధానాలు అనుసరించాలన్న దానిపై ఆలోచన చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.