అత్యుత్త‌మ వైద్యం అందించాలి

కోవిడ్ ఆస్ప‌త్రుల సంఖ్య 138 నుంచి 287కు పెంపు

స్పెషలిస్టులు, డాక్ట‌ర్లను వీలైనంత త్వ‌ర‌గా అందుబాటులో ఉంచాలి

ఆస్ప‌త్రుల్లో ప్ర‌మాణాల‌ను నిరంతరం ప‌ర్య‌వేక్షించాలి

తాత్కాలికంగా నియ‌మిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది జీతాలు పెంచాలి

ఆరోగ్య ఆస‌రా ప‌నితీరును ప‌ర్య‌వేక్షించాలి

కాల్‌సెంట‌ర్లు, హెల్ప్ డెస్క్‌లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాలి

అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: ‌రాష్ట్రంలోని కోవిడ్ ఆస్ప‌త్రుల సంఖ్య‌ను 138 నుంచి 287కు పెంచామ‌ని, ఆస్పత్రుల్లో అన్ని ర‌కాల స‌దుపాయాలు, వైద్యులు, సిబ్బంది సంతృప్త సాయిలో ఉండాల‌ని ఆస్ప‌త్రుల్లో ప్ర‌మాణాల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశానికి ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, హెల్త్ స్పెష‌ల్ సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, టాస్కుఫోర్స్ చైర్మ‌న్ కృష్ణ‌బాబు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. కోవిడ్ ఆస్ప‌త్రుల సంఖ్య 138 నుంచి 287కు పెంచామ‌ని, వీలైనంత త్వ‌ర‌గా స్పెష‌లిస్టులు, డాక్ట‌ర్ల‌ను ఆస్ప‌త్రుల్లో అందుబాటులో ఉంచాల‌న్నారు. తాత్కాలికంగా నియ‌మిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. మౌలిక స‌దుపాయాలు, వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాల‌ని సూచించారు. ఆస్ప‌త్రుల్లో ప్ర‌మాణాల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు. కోవిడ్ కాల్ సెంట‌ర్‌లు, ఆస్ప‌త్రుల్లో హెల్ప్ డెస్క్‌లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాల‌ని ఆదేశించారు. ఆస్ప‌త్రుల్లో పారిశుద్ధ్యం బాగుండాల‌ని, చికిత్స పొందుతున్న వారికి మంచి భోజ‌నం అందించాల‌ని, హోంక్వారంటైన్‌లో ఉన్న‌వారికి స‌క్ర‌మంగా సేవ‌లు అందాల‌ని అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

ఆరోగ్య‌శ్రీ కింద వ‌చ్చే రోగుల‌కు అత్యుత్త‌మ వైద్యం అందించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. మ‌నం ఆస్ప‌త్రికి వెళితే ఎలాంటి సేవ‌లు కోరుకుంటామో.. అలాంటి విధానాలు క‌చ్చితంగా అమ‌లు కావాల‌ని సూచించారు. రిఫ‌ర‌ల్ ప్రోటోకాల్ చాలా స్ప‌ష్టంగా ఉండాల‌ని, విలేజ్‌, వార్డు క్లినిక్స్ నుంచి ఈ ప్రోటోకాల్ అమ‌లు జ‌ర‌గాల‌న్నారు. ఆరోగ్య‌శ్రీ సేవ‌ల స‌మాచారం, ఫిర్యాదుల కోసం కాల్ సెంట‌ర్ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆరోగ్య ఆస‌రా ప‌నితీరును కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించాల‌ని ఉన్న‌తాధికారుల‌ను సూచించారు. ఆస్ప‌త్రి నుంచి త‌ల్లీబిడ్డా డిశ్చార్జ్ అవుతున్న‌ప్పుడే డ‌బ్బులు వారి అకౌంట్ల‌లో ప‌డాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. 

Back to Top