గ్రామ సచివాలయాల్లోనే క్వారంటైన్‌ వసతి

కనీసం లక్ష బెడ్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశం

500 ఆర్టీసీ బస్సులను నిత్యావసర సరుకుల మొబైల్‌ వాహనాలుగా మార్చాలి

సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: లాక్‌డౌన్‌ సడలింపు నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో చిక్కుకున్న వారు స్వస్థలాలకు వస్తున్న నేపథ్యంలో గ్రామ సచివాలయాల్లోనే క్వారంటైన్‌ వసతి కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని,  సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, హెల్త్‌ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో కరోనా పరిస్థితుల కారణంగా చిక్కుకుని తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని, ప్రతి సచివాలయంలో 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించాలని ఆదేశించారు. కనీసం లక్ష బెడ్లు సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. అంగన్‌వాడీలు, మెప్మా, పంచాయతీ రాజ్‌ క్వారంటైన్‌ చర్యలు చేపట్టాలన్నారు. 

అదే విధంగా 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలు తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా మార్చాలని ఆదేశించారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటు చేసి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, నిత్యావసరాలు ఏర్పాటు చేయాలన్నారు. కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేసి నిత్యావసరాల కోసం ఒక వ్యక్తికే పాస్‌ ఇవ్వాలని ఆదేశించారు. డాక్టర్, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త, మందులు కూడా మొబైల్‌ యూనిట్‌కు అందుబాటులో ఉంచాలని అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. 
 

Back to Top