వారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి

వృద్ధులు, బీపీ, షుగర్‌ ఉన్నవారిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

మొత్తం 32,349 మందికి పరీక్షలు చేయాల్సిందే

భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సిందే

రైతుబజార్లు, మార్కెట్‌లలో సర్కిల్స్, మార్కింగ్స్‌ తప్పనిసరి

సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: హైరిస్క్‌ ఉన్న వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వృద్ధులు, షుగర్, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరయ్యారు.

కరోనా కేసులు, వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాల సర్వే పూర్తయిందని, శనివారం రాత్రికి వరకు 32,349 మందిని ఎన్‌ఎంలు, ఆశావర్కర్లు వైద్యాధికారులకు రెఫర్‌ చేశారని,   ఇందులో 9,107 మందికి పరీక్షలు అవసరమని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా కోవిడ్‌ కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45 వేల వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు వైద్య శాఖ సిద్ధమవుతోందని అధికారులు వివరించారు. వైరస్‌ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా వేసేందుకు ఈపరీక్షలు నిర్వహిస్తామని సీఎంకు తెలిపారు. 

రైతు బజార్లు, మార్కెట్‌లలో సర్కిల్స్, మార్కింగ్స్‌ తప్పనిసరిగా ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఎక్కడా కూడా జనం గమిగూడకుండా చూడాలని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9 గంటల వరకు నమెదైన కేసుల వివరాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. 

మొత్తం నమోదైన కేసులు 417. వీరిలో విదేశాలనుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ కేసులు 13, వారిద్వారా సోకిన కేసులు సంఖ్య 12. ఢిల్లీ వెళ్లొచ్చినవారిలో పాజిటివ్‌ కేసులు 199, వారి ద్వారా వైరస్‌ బారినపడినవారు 161 మంది. మిగిలిన పాజిటివ్‌కేసుల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల, వ్యాధి సోకిన వారిద్వారా, ఇతరత్రా మార్గాల వల్ల కరోనా సోకిన వారు 32 మంది ఉన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top