పరిశుభ్రతకు పెద్దపీట 

వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలి

ప్రతి ఇంటికి డస్ట్‌బిన్స్‌ అందించాలి

క్రమం తప్పకుండా తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించాలి

క్లాప్ కమాండ్‌ కంట్రోల్‌ రూంలో సమర్థులైన అధికారులను నియ‌మించాలి

అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమంపై సీఎం సమీక్ష

తాడేప‌ల్లి: నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో పూర్తి స్ధాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమంపై సీఎం వైయస్ జగన్‌ సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. క్లాప్‌ కార్యక్రమం కింద ఇప్పటివరకూ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించారు.  

ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. గ్రేడ్‌ 2, గ్రేడ్‌ 3 నగర పంచాయతీలకు క్లాప్‌ కింద నిర్దేశించిన వాహనాలన్నింటినీ కూడా ఆయా నగరాలకు, పట్టణాలకు, నగర పంచాయతీలకు, పంచాయతీలకు చేరవేయాలని అధికారుల‌ను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సాలిడ్‌ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ సెంటర్లు (ఎస్‌డబ్ల్యూపీసీ), అర్భన్‌లో 72 చోట్ల ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌ (ఐఎస్‌డబ్ల్యుఎం) ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. జూన్‌ 2022 నాటికి ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఇప్పటివరకు చెత్త సేకరణకు 30 లక్షల డస్ట్‌బిన్స్‌ సరఫరా చేశామని అధికారులు తెలిపారు. 

ప్రతి ఇంటికి డస్ట్‌బిన్స్‌ అందించాలని, ఎలక్ట్రిక్‌ వాహనాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌కు సూచించారు. సంబంధిత కంపెనీలతో మాట్లాడుకుని ఆయా వాహనాలను సత్వరమే తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరాలు,  పట్టణాల్లో గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుంచి సమీపంలోని ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఎప్పటికప్పుడు గార్బేజ్‌ తొలగించడమే కాకుండా ఆ ప్రాంతంలో దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

గుంటూరులో వ్యర్థాలనుంచి విద్యుత్‌ ఉత్పత్తి కర్మాగారం (వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ – డబ్ల్యుటీఈ) సిద్ధమైందని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. ప్రతిపాదిత ప్రాంతాల్లో కూడా ఈ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 2 వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణపైనా అధికారులు దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌ను నిర్మించడంపైనే కాదు, వాటిని పరిశుభ్రంగా ఉంచేలా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాల‌ని ఆదేశించారు. 

గ్రామాల్లో డస్ట్‌బిన్స్‌ లేని వాళ్లకు డస్ట్‌బిన్స్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. విలేజీ క్లినిక్స్‌ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలన్నారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్యం పైనా నివేదికలు తెప్పించుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా తాగునీటి ట్యాంకులను పరిశుభ్రం చేయించాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం దృష్టిపెట్టాలని అధికారుల‌ను ఆదేశించారు. మురుగునీటి కాల్వల నిర్వహణ దృష్టిసారించాలని, ఎక్కడా కూడా మురుగునీరు నిల్వ లేకుండా చేయాలని, దీన్నొక సవాల్‌గా తీసుకోవాలని సీఎం సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో అత్యాధునిక విధానాలను పాటించాలని ఆదేశించారు.  

క్లాప్‌ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ రూంలో సమర్ధులైన అధికారులను  నియ‌మించాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం నిర్దేశం చేశారు.

ఈ సమీక్షా సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ పి బసంత్‌ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి సంపత్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top