బత్తాయి కొనుగోలుకు సిద్ధంగా ఉండాలి

అర్హులెవరైనా ఉంటే 10వ తేదీ లోగా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోండి

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పసుపు, మొక్కజొన్న పంటలపై చర్చ

ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా అవగాహన కల్పించాలి

వ్యవసాయ శాఖ సమీక్షలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: అర్హులైన వారు ఈ నెల 10వ తేదీ లోగా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించాలని ఆదేశించారు.  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ నెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా 10 వేల టన్నుల బత్తాయి కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. రిటైల్‌ అమ్మకాల్లో కొంత సబ్సిడీ ఇవ్వాలన్న అధికారుల సూచనను సీఎం అంగీకరించారు. పసుపు, మొక్కజొన్నకు కనీస మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నామని, పక్క రాష్ట్రాల్లో పంటల ధరలు అమలు చేయకపోవడంతో అక్కడి నుంచి రైతులు పసుపు, మొక్కజొన్న పంటలను ఏపీకి తీసుకువస్తున్నారని అధికారులకు సీఎంకు వివరించారు. పక్క రాష్ట్రాల నుంచి అలా తీసుకువస్తే ఇక్కడి రైతులకు నష్టం కదా..? దీన్ని ఎలా నివారించాలన్న దానిపై అధికారులతో సీఎం చర్చించారు.

ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు మండల వ్యవసాయ అధికారులు ఇచ్చే పాస్‌లను అనుమతించాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తెరుచుకుంటున్న దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 6 కోట్లకు పైగా మాస్కులు పంపిణీ చేసింది. ప్రతి రోజూ 42 లక్షల మాస్కులను తయారీ చేయిస్తోంది.
 

Back to Top