తాడేపల్లి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఎంఎస్‌ఆర్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటీవల కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం నిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఎం.సత్యనారాయణరావు కన్నుమూశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, మూడు పర్యాయాలు ఎంపీగా, 2004లో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా ఎంఎస్‌ఆర్ పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్‌గా, పీసీసీ అధ్యక్షులుగా ఆయన సేవలు అందించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి ఎంఎస్‌ఆర్ అత్యంత సన్నిహితులు. ఎంఎస్‌ఆర్ మృతితో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.