బీసీలను బ్యాక్‌ బోన్‌ క్లాస్‌గా మార్చాలన్నదే నా తపన, తాపత్రయం

పూలే వర్ధంతి కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

అణగారిన వర్గాలకు సమాన హక్కుల కోసం పూలే పోరాడారు

అంబేద్కర్‌, పూలే విధానాలను ఈనాటికీ గుర్తు పెట్టుకుంటాం

బలహీనవర్గాల్లో మహిళలు చదువుకోవాలని పూలే ఆరాటపడ్డారు

ప్రతి కుటుంబంలో ఇంజినీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు కావాలని ఆలోచన చేసిన వ్యక్తి  వైయస్‌ఆర్‌  

పేద విద్యార్థుల చదువుకు ఎంత ఖర్చైనా భరిస్తామని ఆ రోజు వైయస్‌ఆర్‌ భరోసా కల్పించారు

బీసీల అభ్యున్నతి కోసం బీసీ డిక్లరేషన్‌ చేశాం

మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేస్తున్నాం

బలహీన వర్గాల అభ్యున్నతికి అన్ని రకాలుగా ముందడుగులు 

ఐదుగురిలో నలుగురు బలహీన వర్గాలకు చెందిన వారే డిప్యూటీ సీఎంలు 

బీసీల సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాం

జనవరి 9న అమ్మ ఒడి ద్వారా అక్కాచెల్లెమ్మలకు రూ.15వేలు

ఉన్నత చదువుల కోసం పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇస్తాం

ఉగాది రోజు 24 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తాం

విజయవాడ: బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదని, బ్యాక్‌ బోన్‌ క్లాస్‌లుగా వీరందరిని మార్చాలని తపన, తాపత్రయంతో ఏలూరులో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతూ ముందుకు అడుగులు వేస్తున్నామని చెప్పారు. కేవలం ఐదు నెలల్లోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టానని, బలహీన వర్గాల అభ్యున్నతికి చట్టాలు చేశామని సీఎం పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారున్నారని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజు అణగారిన వర్గాలకు సమాన హక్కుల కోసం పోరాటం చేశారని తెలిపారు. పేద విద్యార్థుల చదువుకు ఎంత ఖర్చైనా భరిస్తామని ఆ రోజు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వరం వినిపించేదని, ఈ రోజు మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తూ.. పేదలు ఎంత వరకు చదివినా కూడా తాను తోడుగా ఉంటానని వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

ఈ రోజు జ్యోతిరావు పూలే వర్ధంతి. 1827 ఏప్రిల్‌ 13న జన్మించిన ఈయన 1890 నవంబర్‌ 28న కన్నుమూశారు. జ్యోతిరావు పూలే గొప్పతనమేంటి? ఎందుకు తాను మరణించినా కూడా ఈ రోజుకు కూడా పూలే గారిని ఎందుకు తలుచుకుంటున్నాం. ఆయన గొప్పతనాన్ని మనమంతా ఆలోచన చేయాలి. అనగారిన వర్గాలకు సమాన హక్కులు ఉండాలని సత్యశోధక్‌ సమాజాన్ని ఆ రోజుల్లో పూలే స్థాపించారు. చదువు విషయమైతే ఏమి, అంటరానితనంపై పోరాటమైతేనేమి, చివరికి మహిళలు చదువుకోవాలని, అనగారిన వర్గాల్లో కూడా సమాన అవకాశాలు ఉండాలని ఆ రోజుల్లో ఆరాటపడ్డారు. ఆ రోజుల్లో ఆడవాళ్లు వంటింటికే పరిమితమవ్వాలనే వారు. దాన్ని వ్యతిరేకించి తన భార్యను చదివించడమే కాకుండా టీచర్‌గా చేశారన్నారు. ఇటువంటి కట్టుబాట్లు ఉన్నప్పుడు ఎవరు కూడా ఎదగకూడదు అన్నవి ఉన్న సమయంలో గళం విప్పారన్నారు. పూలే, బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ కూడా పోరాడిన తీరును మనం గుర్తించుకోవాలి. వారు సమాజిక, ఆర్థిక న్యాయం కోసం పోరాటం చేశారు. సమాజంలో అందరూ సమానంగా ఉండాలని, ప్రభుత్వం నుంచి ఎక్కువ, తక్కువగా ఉండకూడదని పోరాటం చేశారు. ఒక్కసారి మనమంతా కూడా  ఆలోచన చేయాలి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన బతుకులు, పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ఆలోచన చేయాలి. కొద్దో, గోప్పో ఇటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆరాటపడిన వ్యక్తులు కొందరే ఉన్నారు. అలాంటి వారిలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కనిపిస్తారు. పేదవాడు ఎప్పుడూ కూడా పేదరికం నుంచి బయటకు రావాలంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడైనా ఇంజీనీర్‌, డాక్టర్‌ కావాలి. కలెక్టర్‌ కావాలి. ఆవిధంగా మహానేత వైయస్‌ఆర్‌ ఆరాటపడ్డారు. ఎవరూ ఊహించని విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకువచ్చారు. నీవు చదువు..ఎన్ని లక్షలు ఖర్చు అయినా నేనున్నానని  ఆ రోజుల్లో మహానేత అండగా నిలిచారు. మార్పు తీసుకురావాలని ఆరాటపడిన వ్యక్తులు చనిపోయినా కూడా ఎవరు మరచిపోరు. అణగారిన వర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది స్వయంగా నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చూశాను. బీసీలంటే పనిముట్లు కాదని, మీరంతా వెనుకబడిన కులాలు కాదని, మన సంస్కృతి, సాంప్రదాయాలకు వెన్నుముక అని, బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదని, బ్యాక్‌ బోన్‌ క్లాస్‌లుగా వీరందరిని మార్చాలని తపన, తాపత్రయంతో ఏలూరులో ఎన్నికలకు ముందు మాటిచ్చాను. బీసీ డిక్లరేషన్‌ చేసే సమయానికి పూర్తిగా అవగాహనతో హామీ ఇచ్చాను. అప్పటికే మన పార్టీలో ఉన్న బీసీ నాయకులంతా ప్రతి జిల్లా తిరిగారు. ప్రతి సమాజిక వర్గాన్ని కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. నా పాదయాత్రలో వీరంతా నా వద్దకు వచ్చి వారి స్థితిగతులను వివరించారు. పాదయాత్రలో కూడా ఆయా వర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నాను. పాదయాత్ర అనంతరం ఏలూరులో నిర్వహించిన బీసీ సభలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించాం. ఓట్లు పడ్డాయి కదా అని బీసీ డిక్లరేషన్‌ను చెత్తబుట్టలో పడేయలేదు. చెప్పిన ప్రతి మాటను నెరవేర్చుతున్నాను. మన పార్టీ మేనిఫెస్టో కేవలం రెండే రెండు పేజీలతో రూపొందించాం. బీసీలకు మాటిచ్చిన ప్రతి మాటను బాధ్యతగా భావించాను. 

Read Also: పూలే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది

అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం అడుగు ముందుకు వేశాం. ఎవరూ కూడా ఊహించనివిధంగా కేబినెట్‌లో దాదాపు 60 శాతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు ప్రాధాన్యత కల్పించాను. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. మహారాష్ట్ర రాజకీయాలు పరిశీలిస్తే కాంగ్రెస్‌ పార్టీకి స్పీకరట. ఎన్‌సీపీ పార్టీకి ఒక డిప్యూటీ సీఎం అట. అంతపెద్ద రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం మాత్రమే. మన రాష్ట్రంలో ఐదుగురు డిప్యూటీ సీఎంల్లో నలుగురు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలు ఉన్నారు.  ఎప్పుడు జరగని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాం. ఎప్పుడు చూడని విధంగా చట్టాన్ని తీసుకువచ్చాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని తీసకువచ్చాం. గతంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్లు రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్నవారికే ఇచ్చేవారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మార్కెట్‌ కమిటీ చైర్మన్లుగా ఎంపికయ్యేవారు. ఈ పరిస్థితిని మార్చాం. ఇదే కృష్ణా జిల్లాలో 10 మార్కెట్‌ కమిటీ చైర్లన్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించాం. దేవాలయ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం పదవులు ఇస్తున్నాం. ఏ నామినేటేడ్‌ పదవైనా, కాంట్రాక్ట్‌ అయినా కూడా ఈ వర్గాలకే 50 శాతం కేటాయిస్తున్నాం. అన్ని రకాలుగా ఈ వర్గాలను పైకి తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నాం. ఈ రోజు మన శాసన సభకు స్పీకర్‌గా ఉన్న వ్యక్తి కూడా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం అన్నను ఎన్నుకున్నాం.

ప్రతి అడుగులోనూ ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుడుతున్నాం. కంటికి కనిపించేవిధంగా మన పరిపాలన ఈ ఐదు నెలల్లో జరుగుతోంది. ఈ ఐదు నెలల్లో 75 శాతం స్థానికులకే పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని చట్టం చేశాం. నాలుగు నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సగర్వంగా చెబుతున్నాం. దేశం మొత్తంలో ఉద్యోగాల సంఖ్య డౌన్‌లో ఉంటే ఒక్క ఏపీలో మాత్రం లెక్కలు వేరేవిధంగా ఉన్నాయి. రెండు వేల జనాభా ఉన్న ఏ గ్రామంలో కూడా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మన రాష్ట్రంలోనే కనిపిస్తుంది. లక్ష 30 వేల ఉద్యోగాలు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 70 శాతం ఉన్నారని గర్వంగా చెబుతున్నాను. ఈ ఐదారు నెలల్లో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని గమనించమని కోరుతున్నాను. చంద్రబాబు పోతుపోతూ ప్రతి అడుగులోనూ అప్పులు పెట్టారు. డబ్బులు లేని పరిస్థితుల్లో ఎక్కడా కూడా బాధపడలేదు. ఎలా సంక్షేమ పథకాలు ఎగరగొట్టాలని ఆలోచన చేయలేదు. మంచి చేయడానికి మంచి మనసుతో అడుగులు ముందుకు వేస్తున్నాం. దాదాపుగా 46 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయతో ఇవ్వగలిగాం. కౌలు రైతులకు కూడా ఈ సాయం చేశాం. ఎవరూ పట్టించుకని ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లకు వైయస్‌ఆర్‌ వాహన మిత్ర కింద దాదాపుగా 2 లక్షల 36 వేల మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం ఐదు నెలల్లోనే అందించామని సగర్వంగా చెబుతున్నాను. మొన్నటికి మొన్న మత్స్యకార సోదరులకు సహాయం చేయగలిగాం. ఎవరు ఊహించని విధంగా, ఎప్పుడు చేయని విధంగా సాయం చేశాం.

చంద్రబాబు ఐదేళ్లలో సామాజిక పింఛన్లు సగటున రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చేవారు. ఈ రోజు మనం సగటున నెలకు అక్షరాల రూ.1400 కోట్లు ఇస్తున్నాం. దేవుడి దయతో, మీ అందరి దీవెనలతో అడుగులు ముందుకు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో మార్పులు తీసుకువచ్చే దిశగా గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్కూళ్లలో మరుగుదొడ్లు సరిగా ఉండేవి కావు. మంచినీటి సౌకర్యం ఉండేది కాదు. సమయానికి బుక్కులు ఇవ్వలేదు. మధ్యాహ్న భోజనం బిల్లులు ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. భవనాల పైకప్పులు ఊడిపోతున్నాయి. బడుల రూపురేఖలు మార్చుతూ..ప్రతి బడిని ఇంగ్లీష్‌ మీడియం చదువులు తీసుకువస్తాం. ఆశ్చర్యమనిపిస్తోంది. సమాజంలో ఎక్కడైనా తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుపై యుద్ధం చేసినప్పుడే గొప్పవాళ్లమవుతాం. మన స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం లేదు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఎక్కడా కూడా తెలుగు మీడియం లేదు.

ఇవాళ ఇంగ్లీష్‌ మీడియంపై వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష నాయకులు, పత్రికాధినేతలు వారి పిల్లలను, వారి మనవళ్లను ఎక్కడ చదివిస్తున్నారు. వారి పిల్లలంతా ఇంగ్లీష్‌ మీడియంలో కనిపిస్తున్నారు. మన పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌ మీడియం చదవకూడదట. ఎందుకంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు పోతాయట. వారి పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌ మీడియంలోనే చదవాలట. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో వ్యవస్థ ఉన్నప్పుడు బాధనిపించింది. అందుకే అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. జనవరి 9న ఈ పథకాన్ని మొదలుపెడతాం. బడికి పంపించిన ప్రతి తల్లికి రూ.15 వేలు ప్రతి ఏటా చెల్లించి అన్నగా తోడుగా ఉంటానని సగర్వంగా చెబుతున్నాను. చదువులు ఎండమావి కాకూడదనే ఉద్దేశంతో  అరకొరగా ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా మార్చేస్తున్నాం. ఎన్ని లక్షలు ఖర్చైనా ఫర్వాలేదు. మీరు చదవండి ..నేను తోడుగా ఉంటాను. ఇంజినీర్లుగా, డాక్టర్లుగా నేను చేస్తానని గతంలో నాన్నగారి స్వరం వినిపించేది.  మళ్లీ ఆ స్వరం నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ రోజు వినిపిస్తోంది. పిల్లలకు వందశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించడమే కాకుండా వారి హాస్టల్‌, భోజన ఖర్చులకు వసతి దీవెన కార్యక్రమం కింద ఏటా రూ.20 వేలు చెల్లించి తోడుగా ఉంటా.

ఎవరు చూడని విధంగా, ఆలోచన చేయని విధంగా డిసెంబర్‌ 21న నా పుట్టిన రోజు. ఆ రోజు చేనేత కార్మికులు గుర్తుకు వచ్చారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉండాలని వైయస్‌ఆర్‌ చేనేత నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఉగాది నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంట్లో వెలుగు చూడాలని దేశంలో, రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా అక్షరాల 24 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నాం. గత ప్రభుత్వం పట్టాల్లో పేదలకు కనీసం ఒక సెంట్‌ అయినా స్థలం ఇవ్వాలని ఆలోచన చేయలేదు. గతంలో కట్టిన ప్లాట్లు కారిపోతున్నాయి. పైన డ్రైనేజీ పైపులు కారుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ప్లాట్లు తగ్గించి, డబ్బులు ఎక్కువైనా ఫర్వలేదు. పట్టణాల్లో ఒక్క సెంట్‌ అయినా ఇద్దామని శ్రీకారం చుడుతున్నామని సగర్వంగా చెబుతున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేయగలిగాం. చేయడానికి మీ బిడ్డ ముందడుగు వేస్తున్నాడు. మీ అందరి చల్లని దీవెనలు ఇలాగే ఉండాలని కోరుతూ..ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా..

 

Read Also: పూలే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది

Back to Top