మీ అందరి ప్రేమకు అస్సలామ్‌ అలైకుమ్‌.. 

మైనార్టీ వెల్ఫేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే వేడుకల్లో సీఎం వైయస్‌ జగన్‌

ముస్లింల సంక్షేమానికి నాన్నగారి కొడుకుగా రెండు అడుగులు ముందుకు..

మూడేళ్ల 4నెలల పాలనలో ముస్లింలకు డీబీటీ ద్వారా రూ.10,309 కోట్లు జమ చేశాం

నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ.10 వేల కోట్లతో మేలు జరిగింది

మైనార్టీ తోఫా నుంచి టెన్త్‌ సర్టిఫికెట్ తీసేస్తే పిల్లలు చదువుకోలేరు

ముస్లిం చెల్లి, తమ్ముడు బాగా చదవాలి.. ప్రపంచంతో పోటీపడాలి

చంద్రబాబు పాలనలో ముస్లింల కోసం ఖర్చు చేసింది కేవలం రూ.2,665 కోట్లే..

ఇప్పటికే 580 ఎకరాల అన్యాక్రాంతమైన వక్ఫ్‌బోర్డు భూముల‌ను స్వాధీనం చేసుకున్నాం

ఈ ప్రభుత్వం మీది.. జగన్‌ మీవాడు.. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటా

గుంటూరు: ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ముస్లింలకు రిజర్వేషన్‌లు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వల్లే జరిగిందని చెప్పుకోవడానికి ఆయన కొడుకుగా గర్వపడుతున్నాను. నాన్నగారు ముస్లిం సోదరులు, మైనార్టీల పట్ల ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కొడుకుగా మీ జగన్‌ రెండు అడుగులు ముందుకేస్తున్నాడు. మన ప్రభుత్వంలో పదవులు, సంక్షేమంలో ఏరకంగా చూసుకున్నా.. స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు నగరంలోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగం..
చిక్కటి చిరునవ్వుతో, మనసు నిండా ఆప్యాయతలు పంచిపెడుతున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ప్రతీ మైనార్టీ సోదరులకు, నా ప్రతీ మైనార్టీ అక్కచెల్లెమ్మలకు మీ సోదరుడు, మీ స్నేహితుడు, మీ కుటుంబ సభ్యుడు.. మీ జగన్‌ ప్రేమపూర్వకమైన అస్సలామ్‌ అలైకుమ్‌.. 

ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం.. మైనార్టీ సంక్షేమ దినోత్సవం. భారతదేశపు తొలి విద్యా శాఖ మంత్రిగా ఈ దేశంలోనే అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను స్థాపించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గురించి తెలియని వ్యక్తి ఎవరూ ఉండరు. ఆజాద్‌ స్వాతంత్య్ర సమరయోధులు, గొప్ప రచయిత, పాత్రికేయుడు, దేశానికి తొలి విద్యాశాఖమంత్రిగా 1947 నుంచి 1958 వరకు అందించిన సేవలు గుర్తుచేసుకుంటూ ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని మైనార్ట్సీ డేగా నాటి ముఖ్యమంత్రి, నాన్నగారు దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారిగా 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించారు. ముస్లింలోని పేదలందరికీ దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రిజర్వేషన్‌లు వర్తింపజేసిన పరిస్థితులు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వల్లే జరిగిందని చెప్పుకోవడానికి కొడుకుగా గర్వపడుతున్నాను. 

నాన్నగారు ముస్లిం సోదరుల పట్ల, మైనార్టీల పట్ల ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కొడుకుగా మీ జగన్‌ రెండు అడుగులు ముందుకేస్తున్నాడు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పదవుల విషయంలో, సంక్షేమంలో ఏరకంగా చూసుకున్నా.. రాష్ట్రంలో 2019 నుంచి మన ప్రభుత్వం వచ్చిన తరువాత గొప్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 

గత ప్రభుత్వ హయాంలో కనీసం మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా మనసురాలేదు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మన ప్రభుత్వంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిలో మైనార్టీ సోదరుడు ఉన్నాడంటే మార్పు ఏ విధంగా ఉందో గమనించాలని కోరుతున్నాను. 

మన పార్టీ నుంచి నలుగురు మైనార్టీ సోదరులను ఎమ్మెల్యేలుగా  గెలిపించుకోగలిగాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా చేశాం. అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా నా అక్క శాసనమండలి ఉపాధ్యక్ష పదవిలో ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను. మైనార్టీ సోదరుడు ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌గా ఉన్నాడు. ఇవన్నీ ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. మనసుపెట్టి పరిపాలన చేస్తున్నాం. 

గత ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీలకు పలానా మంచి చేయాలనే తపన, తాపత్రయం కనిపించలేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తప్ప.. ముస్లింల సంక్షేమానికి గత ప్రభుత్వం చేసిందేమీ లేదు. మన పార్టీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రతీ అడుగు కూడా మంచి చేయాలి.. ఆ మంచితో ప్రతీ గుండెలో చిరస్థాయిగా నిలబడిపోవాలని అడుగులు వేస్తున్న మన ప్రభుత్వంలో మార్పు చూడమని కోరుతున్నాను. 

రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2019 జూన్‌ నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు వివిధ పథకాల కింద కేవలం డీబీటీ విధానంతో ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా కేవలం బటన్‌ నొక్కుతున్నాం.. నా అక్కచెల్లెమ్మల కుటుంబ సభ్యుల బ్యాంక్‌ ఖాతాల్లోకి సంక్షేమ సాయం నేరుగా వెళ్లిపోతుంది. వ్యవస్థలో గొప్ప మార్పు చోటుచేసుకుంది. కేవలంలో ఈ మూడు సంవత్సరాల 4 నెలల కాలంలోనే డీబీటీ పద్ధతి ద్వారానే 44,13,773 మైనార్టీ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా రూ.10,309 కోట్లు జమ చేయడం జరిగింది. 

నాన్‌ డీబీటీ పద్ధతిలో చూసుకుంటే.. నాన్‌ డీబీటీ పద్ధతిలో మరో 16,41,622 మైనార్టీలకు సంబంధించి మరో రూ.10 వేల కోట్లు మేలు జరిగింది. నాన్‌ డీబీటీ పద్ధతిలో 2,42,026 మంది నా అక్కచెల్లెమ్మలకు కేటాయించిన ఇంటి స్థలాల విలువ తీసుకున్నా.. ఒక్కో ఇంటి విలువ రూ.2.5 లక్షల చొప్పున తీసుకున్నా.. మరో 1,36,888 మంది నా అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే ఇళ్లు కూడా మంజూరు చేసి నిర్మాణంలో ఉన్న వీటి విలువ కూడా కలుపుకుంటే.. కేవలంలో ఇళ్లకు సంబంధించిన ఒక్క విషయంలో అక్షరాల రూ.9,400 కోట్లు అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. ఇలా దేవుడి దయతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. 

గత ప్రభుత్వ హయాంలో 2014–19 వరకు మైనార్టీల సంక్షేమం కోసం చేసిన ఖర్చు కేవలం రూ.2,665 కోట్లతో మన ప్రభుత్వంలో చేసిన రూ.20 వేల కోట్లను పోల్చి చూసుకోమని సవినయంగా మనవి చేస్తున్నాను. 

ప్రతీ అడుగులోనూ నా అక్కచెల్లెమ్మలు బాగుపడాలి.. ప్రతి మైనార్టీ సోదరుడు బాగుపడాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మైనార్టీ తోఫా నుంచి పదో తరగతి సర్టిఫికెట్‌ తీసేయాలని అడిగారు. సర్టిఫికెట్‌ నిబంధన తీసేస్తే.. ఇక నా చెల్లెమ్మలు ఎవరూ చదువుకునే పరిస్థితి ఉండదు. నా చెల్లెమ్మలు బాగా చదవాలి.. ప్రతీ ముస్లిం చెల్లి, తమ్ముడు చదవాలి. దేశంతో కాదు, ప్రపంచంతో పోటీపడి వీళ్లు గెలవాలి. అలా గెలవాలంటే కచ్చితంగా చదువు అనే అస్త్రం వీరి చేతుల్లో ఉండాలి. చదువు అనే అస్త్రం లేకపోతే పోటీ ప్రపంచంలో నెగ్గలేరు. అందుకే చదువుల మీద మన ప్రభుత్వం పెట్టిన ఫోకస్‌.. బహుశా వేరే ఏ సబ్జెక్ట్‌ మీద పెట్టనంతగా పెడుతున్నాం. ప్రతీ ఒక్కరిని చదివించడంతో పాటు ఉర్దూను కూడా నేర్పిస్తూ, మరోవైపున ఇంగ్లిష్‌లో కూడా తర్ఫీదు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ప్రపంచంతో పోటీపడి గెలవాలనే ఆరాటంతో అడుగులు వేయిస్తున్నాం. 

చదువులు గొప్ప మార్పులు తెస్తున్నాయి. తల్లులు వారి పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు.. మీ తమ్ముడు, మీ అన్న జగన్‌.. చదివిస్తాడు, తోడుగా ఉంటాడని భరోసా కల్పించే కార్యక్రమం చేస్తున్నాం. మైనార్టీ తోఫాలో పదో తరగతి సర్టిఫికెట్‌ ∙అనే నిబంధన ఉంటే పదో తరగతి వరకు చదువుతారు.. పది పూర్తయిన తరువాత పైచదువులకు కూడా వెళ్తారు, చదువుకుంటారనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ ఇది అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. 

ప్రతీ అడుగూ చిత్తశుద్ధితో వేస్తున్నాం. వక్ఫ్‌ బోర్డు ఆస్తులను రక్షించాలని ప్రతి అడుగు వేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద 65,783 ఎకరాల వక్ఫ్‌ భూమి ఉండగా.. పలు చోట్ల అన్యాక్రాంతమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటిని ఒక పద్ధతి ప్రకారం తిరిగి  బోర్డుకు స్వాధీనపరిచే కార్యక్రమం మొదలుపెట్టాం. ఇప్పటికే 580 ఎకరాల అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకున్నాం. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ కోసం అన్ని వివరాలను డిజిటలైజేషన్‌ చేస్తున్నాం. ఇప్పటి వరకు 3,772 ఆస్తులకు సంబంధించి డిఫరెన్సియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సర్వే పూర్తి చేసి వాటికి కంచె వేసి ప్రొటెక్ట్‌ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. 

హిమామ్‌లు, మౌజమ్‌లకు సంబంధించిన వివరాలను డిప్యూటీ సీఎం, నా సోదరుడు  అంజాద్‌ బాషా చెప్పారు. నమాజ్‌కు సమయం అవుతున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువ సమయం తీసుకోవద్దని ఒకే ఒక్క చిన్న విషయం చెప్పి ముగిస్తాను.. ఈరోజు అందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం మీది అనేది కచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అన్నిరకాలుగా తోడుగా ఉంటానని మీ కుటుంబ సభ్యుడిగా తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, దీవెనలు, దేవుడి దయ ఎప్పుడూ ఈ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 

కాసేపటి క్రితం ఎమ్మెల్యే ముస్తఫా అన్న మాట్లాడుతూ.. అండర్‌ గ్రౌండ్‌డ్రైనేజీ సిస్టమ్‌కు సంబంధించి రూ.287 కోట్లు కావాలని అడిగాడు.. అది ఇప్పటికే మంజూరు చేశాను. ఆర్వోబీ శంకర్‌విలాస్‌ సెంటర్‌కు రూ.131 కోట్లు కావాలని అడిగాడు. దీనికి సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు మొదలవుతుంది. ముస్లిం కౌన్సిలింగ్‌ హాల్, లైబ్రరీ సెంటర్‌ గుంటూరు వెస్ట్‌లో కావాలని కోరాడు.. ఇది కూడా మంజూరు చేస్తున్నాను. 

 

Back to Top