ఇన్సూరెన్స్‌ ప్రీమియం రైతులకు గుదిబండ కాకూడదు

వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

రైతు పక్షపాత ప్రభుత్వం మనది

రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది

2019 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు లబ్ధి

రూ.1,252 కోట్ల బీమా సొమ్మును రైతుల అకౌంట్లలో జమ

30 రకాల పంటలకు వర్తించనున్న ఉచిత బీమా పథకం

మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని చరిత్రలో తొలిసారి ప్రభుత్వమే కొనుగోలు  

మనసున్న ప్రభుత్వంగా  అడుగులు ముందుకు వేస్తున్నాం

తాడేపల్లి: పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం రైతుకు గుదిబండ కాకూడదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రైతుకు అండగా ఉండేందుకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని కూడా ఈ ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం వెల్లడించారు. ఇంత బాధ్యతగా రైతుల గురించి ఆలోచించడం గతంలో జరగలేదని, 18 నెలలుగా రైతులకు అన్ని విధాల మంచి చేస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందన్నారు. మొలకెత్తిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని చరిత్రలో తొలిసారి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మంగళవారం వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, రైతులతో సీఎం వైయస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

ఈ రోజు మనం శ్రీకారం చుట్టబోయే ఈ కార్యక్రమం రైతులకు మంచి చేయడంలో మరో అడుగు ముందుకు వేయడం. గతంలో పరిస్థితి ఏమిటి? ఎందుకు రైతులు ఇన్సూరెన్స్‌ ఎందుకు చేసుకోలేదని గమనిస్తే..ఈ ఇన్సూరెన్స్‌ ప్రభుత్వమే రైతుల తరఫున చెల్లించడంతో వారికి మేలు జరుగుతుందని చెప్పడానికి ఈ కార్యక్రమం గొప్ప ఉదాహారణగా చెప్పుకోవచ్చు. రైతుల పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించకుండా చెబుతున్నాను. ప్రతి అడుగులో రైతుకు తోడుగా ఉంటున్నాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు మాత్రమే కాకుండా.. విత్తనం వేసినా సరే..పంట పండని పరిస్థితి ఉన్న సమయంలో కూడా రైతుకు అండగా ఉండేందుకు మన ప్రభుత్వం ఎంత మనసు పెడుతుందన్నది చెప్పడానికి రైతుల పంట బీమా పథకం ఓ ఉదాహరణగా నిలుస్తుంది.  

2019 సీజన్‌లో 9.48 లక్షల మంది రైతులకు దాదాపుగా రూ.1252 కోట్లు బీమా సొమ్ము నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఈ రోజు బటన్‌ నొక్కగానే జమ అవుతుంది. కలెక్టర్ల సమావేశాల్లో  ఇదే విషయాన్ని చెప్పాం. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే చెప్పాం. డిసెంబర్‌ 15న రైతులకు బీమా సొమ్ము చెల్లిస్తామని చెప్పాం. ఆ మాటకు కట్టుబడి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుతూ అడుగులు ముందుకు వేస్తున్నాం. గతంలో పంటల బీమా అన్నది ఎవరికి అందుతుందో రైతులకు అర్థమయ్యేది కాదు. బీమా ప్రీమియం దెబ్బకు పంటనష్టం వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో రైతులు ప్రీమియం చెల్లించేవారు కాదు. రకరకాల ప్రశ్నలతో రైతులు బీమా చేసుకునేందుకు వెనుకడుగు వేశారు. అటువంటి పరిస్థితిని స్వయంగా నా పాదయాత్రను కళ్లారా చూశాను కాబట్టి ఎట్టి పరిస్థితిలో మార్పు రావాలని, ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఒక గుదిబండ కాదు అన్న ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తూ..ఎన్నికల్లో చెప్పినట్లుగానే పంటల గురించి రైతు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేకుండా రైతుల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించడమే కాకుండా కేంద్రం, ఇన్సూరెన్స్‌ కంపెనీలతో మాట్లాడే బాధ్యత ఈ ప్రభుత్వమే భుజలపై వేసుకుంది. గతంలో ఇన్సూరెన్స్‌ ఒక భాగం రైతులు కడితే..మరో భాగం రాష్ట్ర ప్రభుత్వం కడితే..మూడో భాగం కేంద్రం కడుతుంది.

ఈ మూడు భాగాలు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు చెల్లించేవారు. ఆ తరువాత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. అందరికీ పరిహారం అందేది కాదు. 2012కు సంబంధించిన ఇన్సూరెన్స్‌ కూడా రాని పరిస్థితిలో మనం కట్టి..కేంద్రం, ఇన్సూరెన్స్‌ కంపెనీలతో మాట్లాడి మనం వచ్చిన తరువాత రైతులకు చెల్లించాం. రైతులు సగటున ఏడాదికి రూ.290 కోట్లు చెల్లించేవారు. ఆ మూడేళ్లలో అప్పటి ప్రభుత్వం రైతుల భీమాకు ప్రీమియంగా ఏడాదికి రూ.390 కోట్లు చెల్లించేది. ఇలాంటి పరిస్థితిలో మనం అధికారంలోకి వచ్చాం. 2019–2020లో ప్రతి రైతుకు మంచి జరగాలని, ప్రతి రైతు ఇన్సూరెన్స్‌ పథకంలో నమోదు కావాలని, రైతుల కట్టాల్సిన ప్రీమియం వాటా రూ.460 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.503 కోట్లు ఈ రెండు కలిసి రూ.971 కోట్లు మన ప్రభుత్వం రైతుల తరఫున ఇన్సూరెన్స్‌ కంపెనీలకు చెల్లించింది. 2016–2017లో 17,79,000 మంది రైతులు, 2018–2019లో ఇన్సూరెన్సు కట్టిన రైతులు కేవలం  24.53 లక్షల మంది. ఏడాదికి సగటున చూస్తే 20 లక్షల మంది కూడా ఇన్సూరెన్స్‌ చేసుకోలేని పరిస్థితి. రైతులకు నమ్మకం లేకే  ఇన్సూరెన్స్‌ చెల్లించేవారు కాదు. ఈ రోజు పరిస్థితి చూస్తే..సగటున 49.80 లక్షల మంది రైతులు ఇన్సూరెన్స్‌కింద డబ్బులు కడుతున్నారు.

అప్పట్లో సగటున కేవలం 23.50 లక్షల హెక్టార్లు, ఇప్పుడు 45.96 లక్షల హెక్టార్లు ఈ రోజు ఇన్సూరెన్సు పరిధిలోకి తీసుకువచ్చాం. రైతుకు నష్టం జరిగితే ఇన్సూరెన్స్‌ రావాలని తపనతో చేసిన ప్రయత్నంతో ఇది సాధ్యమైంది. ఈ రోజు మరో మంచి పరిణామం తీసుకువచ్చాం. ప్రతిగ్రామంలో ఒక ఆర్‌బీకే సెంటర్‌ ఏర్పాటు చేశాం. ఈ ఆర్‌బీకేలు గ్రామ సచివాలయానికి అనుసంధానం అయ్యింది. ప్రతి ఎకరా ఈ–క్రాపింగ్‌ జరుగుతోంది. దీనివల్ల అదే గ్రామంలోని సచివాలయంలో నమోదు చేసుకోవడం వల్ల మొత్తం గ్రామంలో రైతుల వివరాల జాబితాను సచివాలయంలో ప్రదర్శిస్తున్నాం. దీనివల్ల పారదర్శకంగా పనులు జరుగుతున్నాయి. ఇటీవల వర్షాలు వస్తే..పంటలు ఎవరు నష్టపోయారు. వారి వివరాలను లెక్క కట్టి ఆర్‌బీకేల్లో ప్రదర్శించాం.

ఎవరూ కూడా నష్టపోకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. దేవుడి దయ వల్ల ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఊరట ఇచ్చాం. ఈ రోజు ఏ సీజన్‌కు జరిగిన నష్టాన్ని అదే సీజన్‌లో ఇస్తున్నాం. మరో వారంలో ఇటీవల నష్టపోయిన రైతుల వివరాలను అధికారులు పంట నష్టం అంచన వేస్తున్నారు. ఈ డిసెంబర్‌ 31న నష్టపోయిన రైతుకు పరిహారం అందజేస్తున్నాం. ప్రతి ఎకరాను ఉచిత పంటల బీమా పథకంలోకి చేర్చి రైతుకు మేలు చేస్తున్నాం. ప్రకృతి వైఫరీత్యాల ద్వారా రైతులకు బీమా పరిహారం చెల్లించే ఏర్పాటు చేస్తున్నాం. పారదర్శకత అన్నది రైతులు స్వయంగా పరిశీలించేందుకు వీలుగా ఇన్సూరెన్స్‌ జాబితాను ఆర్‌బీకేల్లో పదర్శిస్తున్నాం. కులాలు, మతాలు, పార్టీలను చూడకుండా అర్హులందరికీ న్యాయం చేస్తూ అడుగులు వేస్తున్నాం.

2020 ఖరీఫ్‌కు సంబంధించి పంట కోత ప్రయోగాలు జనవరిలో పూర్తి అయిన వెంటనే ఫిబ్రవరిలో ప్రణాళిక శాఖ నుంచి నివేదికలు తీసుకొని మార్చి, ఏప్రిల్‌లోనే బీమా పరిహారం చెల్లిస్తాం. జూన్‌కు ఈ డబ్బులు రైతుకు అందుబాటులోకి వస్తాయి. ఇంత త్వరితగతిన, బాధ్యతగా రైతుల గురించి ఆలోచన చేసి పరిహారం అందించడం గతంలో ఎప్పుడు జరగలేదు. మొట్ట మొదటిసారిగా రైతుకు ఎదైన నష్టం జరిగితే..వారికి తోడుగా ఉండేందుకు రంగు మారిన ధాన్యం కొనుగోలు మాత్రమే కాదు..మొలకలెత్తిన ధాన్యాన్ని కూడా చరిత్రలో మొదటిసారిగా గ్రేడింగ్‌ ఎంఎస్‌పీ కింద కొనుగోలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా గత 18 నెలలుగా ఒక మనసున్న ప్రభుత్వంగా, రైతుకు మంచి చేయాలని అడుగులు వేస్తూ వస్తున్నాం. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇంకొక మంచి పథకానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. రైతులందరికీ మంచి జరగాలని దేవుడిని కోరుకుంటూ ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.

 

Back to Top