శ్రీవారిని దర్శించుకున్న సీఎం వైయస్‌ జగన్‌

ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లు, నూతన బూందీపోటు ప్రారంభం

తిరుమల: సాలకట్ల బ్రహ్మోత్సవాల నేప‌థ్యంలో మంగళవారం ఉదయం శ్రీవారిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి సీఎం వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికారు. ధ్వజస్తంభాన్ని నమస్కరిస్తూ ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం శ్రీవకుళమాతను, ఆలయ ప్రదక్షిణ అనంతరం విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, శ్రీయోగనరసింహస్వామి వారిని సీఎం దర్శించుకున్నారు. శ్రీవారికి బియ్యంతో తులాభారం మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

శ్రీవారి దర్శనం అనంతరం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌కు సంబంధించి.. కన్నడ, హిందీ ఛానళ్లను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం రూ.10 కోట్లతో నిర్మించిన నూతన బూందీపోటు భవనాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ అన్నమయ్య భవన్‌కు చేరుకున్నారు. రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Back to Top