రూ.4 వేల కోట్ల పెట్టుబడి.. 20 వేల మందికి ఉద్యోగాలు

మూడు ప్రాజెక్టులను ప్రారంభించి.. మరో మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం

అపాచీ ద్వారానే 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

6400 మంది మరో నెలరోజుల్లోపు మన కళ్లముందే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తిరుపతి: దాదాపు రూ.4 వేల కోట్ల పైచిలుకు పెట్టుబడి, 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే మంచి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడం జరిగిందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం, వికృతమాల గ్రామంలోని ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో మూడు ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌.. మరో రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘‘ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో ఈరోజు మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తున్నాం. మరో రెండు ప్రాజెక్టులకు ఫౌండేషన్‌ స్టోన్‌ వేస్తున్నాం. ప్రారంభోత్సవం చేస్తున్న ఈ ప్రాజెక్టుల్లో టీసీఎల్‌ సంస్థ.. దాదాపు 1230 కోట్ల రూపాయల పెట్టుబడితో టీవీ ప్యానల్స్, మొబైల్‌ డిస్‌ప్లే యూనిట్స్‌ను మ్యానిఫ్యాక్చరింగ్‌ చేసే మంచి యూనిట్‌ను స్థాపించింది. దాదాపుగా 3200 మందికి ఉపాధినిచ్చే కార్యక్రమానికి ఈరోజు నుంచే శ్రీకారం చుడుతుంది. ట్రయల్‌ రన్స్‌ జరుగుతున్నాయి. 

ఫాక్స్‌లింగ్స్‌ అనే రెండో సంస్థ యూఏస్‌బీ కేబుల్స్, సర్క్యూట్‌ బోర్డ్స్‌ తయారు చేసే మరో యూనిట్‌. దాదాపు రూ.1050 కోట్లతో పెట్టుబడిపెట్టి ఫ్యాక్టరీ పూర్తిచేసింది. ఇక్కడ మరో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. అదేమాదిరిగా సన్నీ ఓపోటెక్‌ సంస్థ సెల్‌ఫోన్స్‌ కెమెరా లెన్స్‌ తయారు చేసే మరో సంస్థ రూ.280 కోట్లతో పెట్టుబడి పెట్టి, యూనిట్‌ నిర్మాణ పనులు కూడా పూర్తిచేసింది. తద్వారా 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి. దాదాపుగా 6400 మంది మరో నెలరోజులు తిరక్కముందే పూర్తిగా రిక్రూట్‌మెంట్‌ అయిపోయి.. మన కళ్లముందే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి దేవుడి దయవల్ల కలిగింది. 

అదే విధంగా మూడు ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన చేశాం. ఫెసిలిటీలోనే డిక్సన్‌ టెలివిజన్‌కు సంబంధించిన యూనిట్‌కు శంకుస్థాపన చేశాం. దాదాపు 110 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు మొదలుపెట్టింది.. మరో సంవత్సరకాలంలో పనులు పూర్తవుతాయి. 850 మందికి ఉద్యోగ అవకాశాలు ఇక్కడే వస్తాయి. 

అదే విధంగా ఫాక్స్‌లింక్‌ ఇండియా అనే కంపెనీ రూ.300 కోట్ల పెట్టుబడితో సంవత్సరంలో ప్రొడక్స్‌లోకి వస్తుంది. తద్వారా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. 

ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లోకి రాకముందు అపాచీకి సంబంధించిన యూనిట్‌ రూ.800 కోట్లతో శంకుస్థాపన చేశారు. మరో 15 నెలల్లో ఆ ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. దాని వల్ల 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయి. 

మొత్తం అన్నీ కలిపితే.. మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. మరో మూడు ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేశాం. వీటన్నింటి ద్వారా దాదాపుగా రూ.4 వేల కోట్ల పైచిలుకు పెట్టుబడి, 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే మంచి కార్యక్రమానికి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడం జరిగింది’’ అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. కంపెనీలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పూర్తి సహకారం అందిస్తామన్నారు.

తాజా వీడియోలు

Back to Top