మీ భూమికి ప్రభుత్వం హామీ 

 వైయ‌స్ఆర్-జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు, భూర‌క్ష కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

భూమిపై మీ హక్కును ఎవరూ మార్చలేరు

రైతులకు మరింత భద్రత కలగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

పైలెట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే తక్కెళ్లపాడులో భూ రీసర్వే చేశాం

భూసర్వే కోసం అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది

ప్రభుత్వ హామీతో కూడిన భూ హక్కు పత్రాన్ని యజమానికి అందజేస్తాం

ప్రతి గ్రామానికి సర్వే మ్యాప్‌ ఉంటుంది

ప్రతి భూమికి ఐడీ నంబర్‌ ఇస్తాం

డ్రోన్, రోవర్‌ ద్వారా అక్షాంశ, రేఖాంశాలతో కూడిన సర్వే

గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం

పొరపాటు జరిగితే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది

 జగ్గయ్యపేట: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి భూమికి ప్రభుత్వం హామీ ఇస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌–జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను సక్రమంగా చేస్తామని పేర్కొన్నారు. వందేళ్ల తరువాత పవిత్రమైన యజ్ఞానికి మనందరి ప్రభుత్వం నాందీ పలుకుతుందని, మూడు విడతల్లో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి భూములను, స్థిరాస్తులను రీ సర్వే చేసి శాశ్వత హక్కు కల్పిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తక్కెళ్లపాడులో ఫైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన భూ హక్కు, భూరక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాటల్లోనే..

ఈ రోజు మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఇక్కడ నిలుచుని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం..దేశంలోని ఏ రాష్ట్రం కూడా..ఏ ముఖ్యమంత్రి సహసించని కార్యక్రమం. ఇది జరగాలి. ప్రజలకు మంచి జరగాలని.. ఏకంగా 16 వేల మంది సర్వేయర్లను గ్రామ, వార్డుస్థాయిలో నియమించాం. వీరందరికీ కూడా అత్యుత్తమ రోవర్, డ్రోన్‌ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చి, సర్వే ఆఫ్‌ ఇండియాతో మాట్లాడి..వారితో కూడా భాగస్వామ్యం చేసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. బిడ్డమీద తల్లికి ఎంత మమకారం ఉంటుందో మనందరికి తెలుసు. అదే మాదిరిగానే భూమి మీద రైతుకు అంతే మమకారం ఉంటుంది. రైతు ఒక్కరే కాదు..కష్టపడి సంపాదించుకొని, పైసాపైసా కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుంటే..వాటిపై ఎంత మమకారం ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ భూమే రైతు కుటుంబానికి ప్రాణ సమానం, చిన్న ఇల్లే ఆ కుటుంబానికి ఆస్తిగా ఉంటుంది. ప్రాణ సమానమైన ఈ ఆస్తిని రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించారు. ఇళ్లైనా, స్థలంతో కూడిన మరో భూమి అయినా వివాదంలోకి వెళ్తే దాని అసలు యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో నా పాదయాత్రలో చూశాను. గట్టు జరిపి ఒక రైతు భూమిని ఎవరైనా ఆక్రమిస్తే ఆ రైతు మానసిక క్షోభ ఎలా ఉంటుందో మనందరం ఊహించుకోవాలి.

భూములు ఖాళీగా ఉన్నాయని కాజేయడానికి రాబంధుల్లాంటి మనుషులు దొంగ రికార్డులు సృష్టిస్తే..న్యాయపరంగా పోరాడలేని శక్తిలేని ఆ కుటుంబం పరిస్థితి ఏంటన్నది ఆలోచన చేయాలి. ఈ పరిస్థితిని మార్చాలా వద్దా అన్నది మిమ్మల్నే అడుగుతున్నా..మీ ఆస్తికి మిమ్మల్నే అసలైన యజమానిగా ధ్రువీకరించే వ్యవస్థ ఉండాలా వద్దా? మిమ్మల్నే కోరుతున్నా..మీ ఆస్తి రికార్డులు పదిలంగా ఉండాలా? వద్దా అని అడుగుతున్నాను. మీ ఆస్తిని వేరొకరికి అమ్మేసే అవకాశం ఉండకుండా చర్యలు తీసుకోవాలా? వద్దా మిమ్మల్నే అడుగుతున్నాను. మీ ఆస్తికి సంబంధించిన సరిహద్దులు, కొలతలు అంగుళంతో సహా నిర్ధారణ కావాలా? వద్దా?. మీ భూమి కొలత ఏంటో..అది ఏ ఆకారంలో ఉందో రికార్డులో కనిపించాలా? వద్దా? అందరూ ఆలోచన చేయాలి. గిట్టని వారు ఎవరైనా, కబ్జా దారులు హద్దు రాళ్లు పీకేసినా, గట్టు తెగ్గొట్టినా, చెక్కు చెదరని హక్కు పత్రాలు మీ వద్దా? ప్రభుత్వం వద్దా ఉండాలా? వద్దా? మీరే ఆలోచన చేయండి. భూమి రికార్డులు శాశ్వతంగా పరిష్కారమై చెక్కు చెదరకుండా ఉంటే ఇక కోర్టు చుట్టు తిరిగే అవకాశం ఉండదు. ల్యాండ్‌ గ్రాబింగ్‌ చేసే వారు క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటే ల్యాండ్‌ రికార్డులు పక్కాగా ఉండాలి.

ఈ ప్రశ్నలకు సమాధానంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తక్కెళ్లపాడు గ్రామం నుంచి భూముల రీ సర్వేకు, శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి శ్రీకారం చుడుతున్నాం అని గర్వంగా చెబుతున్నాం. మీ భూమికి హామీగా ప్రభుత్వం ఉంటుందని హామీ ఇస్తున్నా..మీ భూమికి మనందరి ప్రభుత్వం హామీగా మాట ఇస్తూ వైయస్‌ఆర్‌– జగనన్న భూ హక్కు, భూ రక్ష కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నాం. మీ పిల్లలకు, మీ ఆస్తి వారసులకు చట్టప్రకారం దక్కేలా.. ఏ ఒక్కరూ ఆ ఆస్తిని కాజేయకుండా మొన్న అసెంబ్లీలో చట్టం కూడా చేశాం. భూ హక్కు, భూ రక్ష కార్యక్రమాన్ని పవిత్ర సంకల్పంతో ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. వందేళ్ల తరువాత ఇటువంటి సర్వే మళ్లీ జరుగుతోంది. 1927, 1928లో భూ సర్వే జరిగింది. గడిచిన ఈ వందేళ్లలో ఎన్నోన్నో మార్పులు మనకళ్లేదుటే కనిపిస్తున్నాయి. పాలకులు మారిపోయారు. రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు ఎన్నో వచ్చాయి.

ఒకప్పుడు రేడియో కూడా లేని గ్రామాలుంటే ..ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ లేని మనిషి అంటూ లేడు. వందేళ్ల తరువాత మళ్లీ భూముల సర్వే జరగలేదంటే ఎన్నో అనర్థాలకు దారి తీసింది. భూమి అన్నది దిగజారుడు రాజకీయ వెత్తలకు, రౌడీలకు, గుండాలకు, వ్యవస్థలను మ్యానేజ్‌ చేసే వ్యక్తులకు తమది కాని భూమి ఒక పాడి ఆవులా మారింది. రికార్డులు అటు ఇటు మార్చడం, రౌడీయిజం చేయడం, జెండా పాతేయడం. ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలి. వివాదాల్లో ఉన్న భూములు మాత్రమే కొంటామని ఏకంగా బ్రోకర్లు, డీలర్లు కూడా ఒక వ్యాపారంగా మార్చారు. అలాంటి వ్యక్తుల నుంచి రాష్ట్ర ప్రజలకు ఒక స్వాతంత్య్రం రావాల్సిన అవసరం ఉంది. పరుల సొమ్ము పాము అని పెద్దలు చెప్పేవారు. ఇవాళ పరిస్థితి ఏంటో తెలుసా..పరాయి వ్యక్తుల భూమి కబ్జాలతో కోట్లకు ఎలా పరుగెత్తాలని ఆరాటపడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు నా పాదయాత్రలో చూసిన ఘటనల నుంచి ప్రజలకు మంచి చేయాలని, అలాంటి పరిస్థితి రాకూడదని ఈ రోజు వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి శ్రీకారం చుట్టాం.

ప్రస్తుతం మన వ్యవస్థను గమనిస్తే..ఏదైనా భూమికి సంబంధించి వ్యవహారాలు, వివరాలు కావాలంటే ..ప్రస్తుతం నాలుగు శాఖల పరిధిలో ఉన్నాయి. రెవెన్యూ శాఖ, భూ రికార్డుల శాఖ, రిజిస్ట్రేషన్‌ శాఖ, స్థానిక సంస్థల శాఖ పరిధిలో భూ వివరాలు ఉన్నాయి. ఒక భూమికి సంబంధించి హక్కుదారు ఎవరంటే రెవెన్యూ ఆఫీస్‌కు వెళ్లాలి. ఈ భూమిపై ఎవరైనా తనఖా పెట్టారా?రిజిస్ట్రేషన్‌ చేశారా అంటే సబ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు వెళ్లాలి. ఓనర్‌ ఎవరని, కొలతలు, పన్నులు కట్టారా ? లేదా అని తెలుసుకోవాలంటే స్థానిక సంస్థ వద్దకు వెళ్లాలి. భూ వ్యవహారాలు, వివరాలు ఈ శాఖల్లో ఇమిడిఉన్నాయి. కుడిచెయ్యి చేసే పనికి ఎడమ చేతికి తెలియడం లేదు. ఏ శాఖకు ఆ శాఖకు పరిధి ఉండటంతో ఈ నాలుగు శాఖలకు సమన్వయం లేక భూ వివాదాలు ఎక్కువయ్యాయి. ఇందులో ఏ ఒక్క శాఖకు టైటిల్‌ నిర్ధారణ బాధ్యత మాత్రం లేదు.

ఇటువంటి పరిస్థితిలో భూములు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారు. సివిల్‌ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. భూమి కొనుగోలు చేసిన ఏ వ్యక్తి అయినా కూడా డబ్బు కట్టి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు కాబట్టి కచ్చితంగా అతనిదేనా అంటే అవును అని సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఇవాళ వ్యవస్థలు లేవు. కొనుగోలు చేసిన వ్యక్తే ఆ భూమి హక్కుదారు ఎవరో తెలుసుకోవాలి. ఒకరు కొనుగోలు చేయడం, మరొకరు అమ్మడం జరుగుతుంది కాబట్టి. రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆదాయం వస్తుంది కాబట్టి ఆ భూమి కొలతలు ఏంటో తెలిసేవి కావు. ఒక భూమి ఒకరి నుంచి మరొకరికి బదలాయించే సమయంలో రికార్డుల బదలాయింపులు జర గలేదు. అసలైన యజమాని ఎవరన్నది ఎక్కడ సమాధానం లేదు. ఒక భూమిని ఇద్దరూ ముగ్గురు అమ్మిన పరిస్థితిని చూశాం. వీటి పరిష్కారం కోసం భూ హక్కు..భూ రక్ష పథకానికి శ్రీకారం చుడుతున్నాం. భూతద్దంలో చూసినా కూడా భూ రికార్డులు, కొలతలు కచ్చితంగా ఉండాలనే ఈ కార్యక్రమం చేపడుతున్నాం.

ప్రభుత్వ హామీతో శాశ్వత భూ హక్కు పత్రాన్ని భూ యజమానికి ఇస్తాం. అంగుళంతో సహా నిర్ధారించిన భూమి సరిహద్దు, సర్వే వివరాలతో పత్రాలు అందజేస్తాం. ప్రతి రెవెన్యూ విలేజీకి ఒక మ్యాప్‌ ఉంటుంది. ప్రతి ఒక్కరి భూమికి ఆధార్‌ నంబర్‌ మాదిరిగా ఒక ప్రత్యేకమైన యూనిక్‌ ఐడెంటిటీ నంబర్‌ కేటాయిస్తారు. ఒక నంబర్‌తో ఆ భూమి ఎక్కడ ఉందో..దాని సరిహద్దులు ఏంటో అంగుళంతో సహా నిర్ధారణ అవుతుంది. అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం ప్రదర్శిస్తారు. శాశ్వత టైటిల్‌ డిస్‌ఫ్లేలో పెడతారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే శాశ్వత హక్కు పత్రం ఇస్తారు. వివాదాలకు తావుండదు. ఇప్పటికే తక్కెళ్లపాడు గ్రామంలో ఈ ప్రక్రియ ద్వారా ఫైలెట్‌ ప్రాజెక్టు ద్వారా సర్వే చేపట్టాం. మూడు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయిస్తాం.

ఈ సర్వేకు అయ్యే ఖర్చు రైతుకు ఒక్క పైసా కూడా ఉండదు. సర్వే రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పవిత్రయజ్ఞంలో సర్వేఆఫ్‌ఇండియా, రెవెన్యూ, సర్వే డిపార్టుమెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్‌ శాఖలు సంయుక్త భాగస్వామంతో రూ.1000 కోట్ల వ్యయంతో 4,500 సర్వే బృందాలను ఏర్పాటు చేసి 17600 రెవెన్యూ గ్రామాల్లో అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మూడు దశల్లో సర్వే చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి పూర్తి అయిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు కూడా గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకువస్తాం. 2023 నాటికి చివరి వార్డు, చివరి గ్రామం కూడా పూర్తిగా సర్వే చేస్తామని ఈ సందర్భంగా చెబుతున్నాం. పూర్తి క్లారిటీతో మీ అందరికి పత్రాలు ఇస్తాం. భూ హక్కు, భూ రక్ష సర్వే గ్రామ సభల ద్వారా సర్వే విధానం, షెడ్యూల్, సర్వే వల్ల జరిగే ప్రయోజనాలను వివరించి, గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శి, సర్వే బృందాలు సర్వే చేస్తారు.

ఇందుకోసం డ్రోన్, కోర్స్, రోవల్‌ వంటి పరికరాల ద్వారా సర్వే చేస్తారు. ప్రతి స్థిరాస్తిని అత్యంత కచ్చితమైన ఆకాంక్ష, రేఖాంశాలతో గుర్తించి కొత్త సర్వే, రెవెన్యూరికార్డులు తయారు చేస్తారు. ప్రతి యజమానికి డిజిటల్‌ రికార్డుల వివరాలు 92 నోటిస్‌ ద్వారా తెలియజేస్తారు. ఈ వివరాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే గ్రామ సచివాలయాల్లో అపిల్‌ చేసుకుంటే..వాటిని సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి మండలానికి ఒక మెజిస్ట్రేషన్‌ టీమ్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సర్వే అయిపోయిన తరువాత యజమానికి ఒక శాశ్వత హక్కు పత్రం అందజేస్తాం. ప్రతి భూమికి ఒక యూనిక్‌ ఐడీ నంబర్‌ ఇస్తాం. భూ కమతం పటంతో పాటు గ్రామ మ్యాప్, వన్‌ బీ రిజిస్ట్రర్‌ వివరాలు నాలుగు చోట్ల ఉంటాయి. వాటిని ట్యాంపర్‌ చేసే అవకాశం ఎవరికీ ఉండదు. అన్నింటికి మించి ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు ఆయా గ్రామ సచివాలయాల్లో జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఎంత మంచి జరుగుతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు. ఏ రైతే అయినా 2019లో మనం చేసిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా భూమి హక్కు పొందిన తరువాత ఆ భూమిపై యజమానికి హక్కు లేదని తేలితే రాష్ట్ర ప్రభుత్వమే తాను హక్కు ఇచ్చిన యజమానికి నష్టపరిహారం అందిస్తుంది. ఇందుకోసం ఏకంగా చట్టాన్నే తెచ్చాం. ఇలాంటి చట్టం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. మన రాష్ట్రమే నాందీ పలుకుతుంది. ఏపీలో భూమి కొనాలంటే అది గోల్డ్‌ స్టాండెండ్‌గా ఉంటుంది. ప్రస్తుత భూ యజమానులకు భూములపై ఉహాజనితమైన హక్కులు మాత్రమే ఉన్నాయి. పూర్తి హక్కులు లేవు. మన భూ రక్ష, భూ హక్కు పథకం ద్వారా హక్కులు లభిస్తాయి. సర్వే ద్వారా జరిగే ప్రయోజనాలు మీ పొరుగు వారికి వివరించండి. అవినీతికి ఎక్కడా తావులేకుండా మీ ముందరే భూ లావాదేవిలు జరుగుతాయి.

ఈ స్కీమ్‌లో అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను దోషరహితంగా సక్రమంగా తీర్చి దిద్దుతారు. ప్రస్తుత సర్వే నంబర్ల వారీగా హద్దురాళ్లు లేకపోవడం వల్ల సరిహద్దు తగాదాలు ఉన్నాయి. ప్రతి సర్వే నంబర్‌కు ఉచితంగా ప్రభుత్వ ముద్రతో హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ హద్దురాళ్లు ఉచితంగా అందజేస్తాం. దీంతో సరిహద్దు వివాదాలకు పూర్తిగా తొలగిపోతాయని నమ్మతున్నాను. లోపాలన్నింటిని కూడా సర్వే ద్వారా పూర్తిగా సరిదిద్దుతాం. ఆస్తి, క్రయవిక్రయ, తనఖా, దాన, వారసత్వ ఇతర లావాదేవీలు వివాదరహితంగా, మరింత సులభతరం చేస్తాం. వ్యవస్థలో నిజాయితీ తీసుకువస్తామన్న మాటకు కట్టుబడి ఈ 18 నెలల పాలనలో మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఇప్పటికే జ్యూడిషియల్‌ ప్రివ్యూ్య, రివర్స్‌ టెండరింగ్‌ తీసుకువచ్చాం. దేశ చరిత్రలోనే అవినీతిరహిత విధానంలో ముందడగులు వేశామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను. ఇప్పుడు స్థిరాస్తికి సంబంధించిన అవకతవకలు, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో అడుగు ముందుకు వేస్తున్నాం.

తరతరాలుగా ఉన్న సమస్యలకు పరిష్కారానికి బాటలు వేసే సర్వే ఇది. ఇరుగుపొరుగుల మధ్య వివాదాలకు తావులేకుండా, మీ పిల్లలకు ఎలాంటి వివాదాలకు తావులేని టైటిల్‌ అందజేసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. అంగుళాలే కాదు. మిల్లీ మీటర్లు సహా నిర్ధారించే అత్యాధునిక టెక్నాలజీతో సర్వే చేస్తున్నాం. ఈ విషయాన్ని అందరికి చెప్పండి. ఇది ఒక యజ్ఞం జరుగుతుంటే..దేవతలకే రాక్షసుల బెడద ఉంటుంది. మనషులమైన మనం మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మనకు కూడా Sకొందరు రాక్షసులు ఉన్నారు. ఆ దయ్యాలు,రాక్షసులు ఎవరో మీకు తెలుసు.

ఎల్లోమీడియా అని పేరు పెట్టుకొని రాక్షసత్వం చేస్తున్నారు. వీరు తప్పుడు ప్రచారం, తప్పుడు రాతలు రాస్తుంటారు.  మంచి కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు రకరకాల కుయుక్తులు పన్నుతుంటారు. మీ భూమికి మీరే శాశ్వత యజమానులుగా, ఎవరూ మార్చలేని టైటిల్‌ను ప్రభుత్వం నష్టపరిహారానికి గ్యారంటీ ఇచ్చి సర్వే చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఏర్పడిన మీ అందరి ప్రభుత్వం మంచి మాత్రమే చేస్తుందని మరోసారి స్పష్టం చేస్తూ..వైయస్‌ఆర్‌–జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష కార్యక్రమంతో రైతులకు, స్థిరాస్తి కలిగిన ప్రతి ఒక్కరికి మరింత భద్రత, భరోసా కలగాలని దేవున్ని నిండుమనసుతో కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం..మీ అందరికి ఆప్యాయతలు, ఆత్మీయతలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సెలవు తీసుకున్నారు.

జగ్గయ్యపేటకు సీఎం వరాల జల్లు
 జగ్గయ్యపేట నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గాని  పారిశ్రామిక హబ్‌గా ప్రకటించారు. నిజంగా ఇక్కడ పారిశ్రామిక హబ్‌గా ప్రకటించే అన్ని అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కచ్చితంగా ఈ అంశంపై త్వరలోనే ప్రకటించి గొప్ప ఉత్వర్హులు ఇచ్చే కార్యక్రమం చేపడుతాం. ఈఎస్‌ఐ భవన నిర్మాణానికి రూ.5 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నాం. పర్యాటక కేంద్రం అభివృద్ధికి రూ.15 కోట్లు విడుదల చేస్తున్నాం. ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.3 కోట్లు నిధులు విడుదల చేస్తున్నా. ఎ్రరకాల్వ అభివృద్ధికి రూ. 5 కోట్లు కూడా వెంటనే మంజూరు చేస్తున్నాం. జగ్గయ్యపేటకు ప్యాసింజర్‌ రైలు స్టాప్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి సిపార్స్‌లేఖ రాస్తాను. వైయస్‌ఆర్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని రూ.4800 కోట్లతో శంకుస్థాపన చేశాం. 
 
 

Back to Top