పేదవాడికి మంచి చేయడమే మీ జగనన్న ప్రభుత్వ లక్ష్యం

జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

పేదలపై ప్రేమ, మమకారం చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది

ప్రభుత్వ పథకాలు, సేవలు అర్హులందరికీ అందాలి.. ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదు

నవరత్నాల ద్వారా రూ.2.16 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం 

రాష్ట్ర వ్యాప్తంగా 99 శాతం మందికి అందుతున్న ప్రభుత్వ పథకాలు, సేవలు

మిగిలిపోయిన 1 శాతం మందికి మేలు చేసేందుకే జగనన్న సురక్ష

జూలై 1 నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది

సచివాలయ అధికారులు, వలంటీర్లు, ప్రజాప్రతినిధులు, గృహసారథులు, జగనన్న ప్రభుత్వాన్ని అభిమానించేవారంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు

రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తారు

ప్రతి ఇంటి తలుపుతట్టి అర్హులందరికీ పథకాలు, సేవలు అందిస్తారు

ఎలాంటి స‌ర్వీస్ చార్జీలు లేకుండా ప్ర‌భుత్వ సేవ‌లు అందుతాయి

26 జిల్లాలకు 26 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమించాం

ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో క్యాంపు.. క్యాంపు ద్వారా సమస్యల పరిష్కారం

తాడేపల్లి: ‘‘నోరు తెరిచి అడగలేక అర్హత ఉండి కూడా పొరపాటున ఎవరైనా, ఎక్కడైనా ప్రభుత్వ పథకాలు, సేవలకు నోచుకోకుండా ఉంటే ఆ అర్హుల తలుపుతట్టి మరీ మంచిచేసే కార్యక్రమమే జగనన్న సురక్ష’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు, జగనన్న ప్రభుత్వాన్ని అభిమానించే ఉత్సాహవంతులందరూ నేరుగా రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాల తలుపులు తట్టి వారికి ప్రభుత్వం నుంచి అందే ప్రతి పథకం, సేవలు లబ్ధిదారుల చెంతకు తీసుకెళ్లడమే జగనన్న సురక్ష కార్యక్రమ ఉద్దేశమన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పథకాలు, సేవలు 99 శాతం మందికి అందుతున్నాయని, మిగిలిన 1 శాతం మంచి పేదలు కూడా అలా మిగిలిపోకూడదని, వారికీ మంచి చేయాలనే తపన, తాపత్రయంతో జూలై 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. అంతకుముందు ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ పూర్తి ప్రసంగం..
జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జగనన్న సురక్ష కార్యక్రమానికి నాంది పలికాం. మనందరి ప్రభుత్వంలో అర్హులై ఉండి ఏ ఒక్కరూ నాకీ సేవలు, లబ్ధి అందలేదని చెప్పడానికి అవకాశమే లేకుండా లబ్ధిదారులు ఎవరైనా, ఎక్కడైనా, ఏ కారణంతోనైనా అర్హత ఉండి మిగిలిపోయిన పరిస్థితి ఎక్కడున్నా జల్లెడపట్టి ఆ అర్హులను గుర్తించి, వారికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్‌ కోసం చెయ్యి పట్టుకొని వారిని నడిపిస్తూ వారికి మంచి చేసే కార్యక్రమమే జగనన్న సురక్ష. 

నాలుగేళ్ల క్రితం ఒకసారి గమనించినట్టయితే.. రాష్ట్రంలో పరిస్థితి ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏ వార్డును తీసుకున్నా, ఏ పట్టణాన్ని తీసుకున్నా.. ఏ పనికావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరుగుతూనే లంచాలు ఇచ్చినా జరగని పరిస్థితులు చూశాం. ఒకవైపున లంచాలు ఇస్తూ, మరోవైపున వివక్షకు లోనవుతూ.. మొట్టమొదట మీరు ఏ పార్టీకి చెందిన వారని అడిగిన ప్రశ్నలను సైతం వినే పరిస్థితి నాలుగేళ్ల క్రితం ఉండేది. 

మనం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం. ఇప్పుడు పెన్షన్, రేషన్‌ కావాలన్నా.. నేరుగా ఇంటికే వచ్చే గొప్ప వలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చాం. దాదాపుగా 600 రకాల పౌర సేవలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను తీసుకొచ్చాం. గ్రామస్థాయిలోనే పౌర సేవలు అందిస్తున్నాం. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకొని కులం, మతం, చివరకు వారు ఏ పార్టీవారని చూడకుండా, రాజకీయాలకు తావేలేకుండా, ఎక్కడా ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, వివక్షకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా పౌరసేవలు అందించడం మన ప్రభుత్వంలోనే ప్రారంభమైంది. 

ప్రతిపక్షాలకు అజెండా అంటూ కూడా ఏదీ మిగలలేదు. గతంలో రేషన్‌ కార్డుల కోసం, ఇళ్ల పట్టాల కోసం, పెన్షన్లు కావాలని ఉద్యమాలు జరిగే పరిస్థితులు చూశాం. కానీ, మన ప్రభుత్వంలో పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ల పట్టాలు, బర్త్‌ సర్టిఫికెట్, డెత్‌ సర్టిఫికెట్, ఇన్‌కం సర్టిఫికెట్‌ ఇలా ఏది కావాలన్నా.. అత్యంత పారదర్శకంగా, ఎక్కడా రూపాయి లంచానికి కూడా చోటులేకుండా, వివక్షకు తావులేకుండా గ్రామ స్థాయిలోనే పౌర సేవలు అందుతున్నాయి. 

అంతకుమించి నవరత్నాల ద్వారా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే అక్షరాల రూ.2.16 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి లంచాలకు చోటు లేకుండా, వివక్షకు తావు లేకుండా డీబీటీ ద్వారా జమ చేశాం. నాన్‌ డీబీటీ (ఇళ్ల స్థలాలు) కలుపుకుంటే రూ.3.10 లక్షల కోట్లు దాటింది. గొప్ప విప్లవాత్మక వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని నాలుగేళ్ల మన పరిపాలనలో సాధించగలిగాం. 

ఈ సంక్షేమ విప్లవంలో భాగంగానే అర్హులెవరూ మిగిలిపోకుండా ఏ ఒక్కరైనా అర్హత ఉండి వారికి అందలేదనే మాట రాకూడదనే తపనతో పనిచేస్తున్నాం. ఇప్పటికే పొరపాటున అర్హులెవరూ మిగిలిపోకూడదని ప్రతి ఆరు నెలలకు ఒకసారి (జూలై, డిసెంబర్‌) మళ్లీ అవకాశం ఇచ్చి, వెరిఫై చేసి సంక్షేమ సాయం అందించే కార్యక్రమం జరిగిస్తున్నాం. దీనికి మరో ప్రయత్నంగా అర్హులు ఇంకెవ్వరూ ఎటువంటి పరిస్థితుల్లోనూ మిగిలిపోకూడదనే తాపత్రయంతో మరో ప్రయత్నంగా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. 

ఎవరికైనా అర్హత ఉండి పొరపాటున మిస్‌ అయిపోయి ఉంటే, ప్రయత్నం చేసినా మంచి జరగకపోయి ఉంటే.. నేరుగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా నా దృష్టికి తీసుకురావాలనే కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తరువాత కూడా ఇంకా ఎక్కడైనా, ఎవరైనా మిగిలిపోయే పరిస్థితి ఉండకూడదని, ఏ ఒక్క మనిషికి, ఏ ఒక్క కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన మంచి అందని పరిస్థితి ఉండకూడదని, ప్రతి పేదవాడికి మంచి జరగాలనే తపన, తాపత్రయంతో జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నేటి నుంచి ప్రారంభిస్తున్నాం. 

జగనన్న సురక్ష కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమై.. నెలరోజుల పాటు సాగుతుంది. రాష్ట్రంలో 99 శాతం అర్హులందరికీ పథకాలు అందుతున్న పరిస్థితి. టెక్నికల్‌ కారణాలతో ఒక్క శాతం మిగిలిపోయి ఉంటే.. ఆ 1శాతం కూడా మిగిలిపోకూడదనే తపన, తాపత్రయంతో.. టెక్నికల్‌ కారణాలను వెతికి, వాటికి పరిష్కారాలను కూడా చూపిస్తూ.. డాక్యుమెంటేషన్‌ పూర్తిచేసి వారికి ప్రభుత్వం నుంచి మంచి జరిగేలా, ప్రభుత్వ పథకాలు అందేలా చేసే కార్యక్రమమే జగనన్న సురక్ష.

జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఏం చేస్తామంటే..
వివిధ రకాల సర్టిఫికెట్లు. బర్త్, డెత్, ఇన్‌కం, కాస్ట్‌ సర్టిఫికెట్లు, సీసీఆర్‌సీ కార్డు, రేషన్‌కార్డు డివిజన్, కొత్త రేషన్‌ కార్డు, హౌస్‌ హోల్డ్‌ డివిజన్, ఆధార్‌ టు బ్యాంక్‌ లింక్, ఆధార్‌ కార్డు మార్పు (ఇప్పటికే కేంద్రంతో మాట్లాడి 2500 ఆధార్‌ సెంటర్లు, మండలానికి 4–5 సెంటర్లు వచ్చేలా చేశాం) వంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇలా ఏ ఒక్క టెక్నికల్‌ సమస్య వల్ల కూడా నిజంగా అర్హత ఉండి ఎక్కడైనా ఏ ఒక్కరికైనా మంచి జరగలేదంటే ఆ సమస్యను పరిష్కరించి వారికి మంచి చేసేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నాం. 

దాదాపుగా 11 రకాల సేవలు ఎలాంటి సర్వీస్‌ చార్జీలు లేకుండా జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమం ద్వారా ఉచితంగా పేదప్రజలకు అందించే గొప్ప అడుగు వేస్తున్నాం. 
ఇందులో మొదటి అడుగుగా.. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, గృహసారథులు, జగనన్న ప్రభుత్వంపై అభిమానం ఉన్న ఉత్సాహవంతులు అందరూ ఒక టీమ్‌గా ఏర్పడి వారం, పదిరోజుల పాటు రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల ఇళ్ల ప్రతి ఇంటి తలుపు తడతారు. లబ్ధి అందనివారు ఎవరైనా ఉంటే వారందరినీ గుర్తించి, సమస్య పరిష్కారానికి కావాల్సిన పత్రాలు, వివరాలను సేకరించి, వారి తరఫున దరఖాస్తును పూర్తిచేసే కార్యక్రమం చేస్తారు. 

సచివాలయానికి వీళ్లే వెళ్లి పత్రాలు సమర్పించి టోకెన్‌ నంబర్‌ జనరేట్‌ చేసి, సర్వీస్‌ రిక్వస్ట్‌ నంబర్‌ను తీసుకొని మళ్లీ ఇంటికి వచ్చి అందజేసి, ఏ రోజున క్యాంపు జరుగుతుంది, ఏ రోజున మన గ్రామానికి, మండలానికి సంబంధించిన అధికారులు క్యాంపు నిర్వహిస్తారు..? ఆరోజు, ఆ డేట్‌ ఎప్పుడో చెప్పి.. క్యాంపు జరిగే రోజున దగ్గరుండి క్యాంపు వద్దకు తీసుకువెళ్లడమే కాకుండా సమస్య పరిష్కారం అయ్యేలా వారికి తోడుగా ఉంటారు. 

జగనన్న సురక్ష అనే కార్యక్రమంలో ఈ నెలరోజుల్లో మండల స్థాయి అధికారులు గ్రామానికి, సచివాలయానికి వచ్చి రోజంతా అక్కడే ఉండి సమస్య పరిష్కారం చేసి సర్టిఫికెట్లు అన్నీ ఇచ్చి సమస్య పరిష్కారం అయ్యేలా చేసే బాధ్యతలో మండల స్థాయిలో తహశీల్దార్, ఈవోపీఆర్‌ అండ్‌ ఆర్డీ వీరు ఒక టీమ్గా వస్తారు. రెండో టీమ్‌గా అదే మండలంలో ఎంపీడీవో, డిప్యూటీ తహశీల్దార్‌ వస్తారు. మండలానికి రెండు టీమ్‌లు ప్రతి గ్రామ సచివాలయానికి ఒక రోజు పూర్తిగా కేటాయిస్తారు. జూలై 1వ తేదీ నుంచి ఈ టీమ్స్‌ అన్నీ బయల్దేరుతాయి. ప్రతి మండలంలోనూ రెండ్రోజులు రెండు సచివాలయాలు కవర్‌ అవుతాయి. జూలై 1వ తేదీ నుంచి ప్రతి సచివాలయంలోనూ ఈ క్యాంపు నిర్వహిస్తారు. అక్కడికక్కడే పథకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతో పాటు సేవా చార్జీలు లేకుండా అవసరమైన అన్ని సర్టిఫికెట్లు అందించే కార్యక్రమం దీని ద్వారా జరుగుతుంది. 

రాష్ట్రంలోని దాదాపుగా 5.3 కోట్ల పౌరులందరికీ చేరువయ్యేలా 1.6 కోట్ల మొత్తం కుటుంబాలను సందర్శించి జూలై 1 నుంచి 30 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాలకు అనుబంధంగా సురక్ష క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ క్యాంపులు జరుగుతాయి. పేదవాడికి మంచి చేయడం కోసం ఎన్ని లక్షల మంది పాల్గొంటున్నారంటే.. 1.5 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటారు. మరో 2.60 లక్షల వలంటీర్లు, పేదల ప్రభుత్వానికి మద్దతు పలికే గృహసారథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం మీద అభిమానమున్న వారంతా పాల్గొని ఉద్యమంలా సాగే ఈ కార్యక్రమంలో కొన్ని లక్షల మంది భాగం అవుతున్నారు. పేదవాడికి మంచి జరిగించాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో జగనన్న ప్రభుత్వానికి తోడుగా నిలిస్తూ, జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తూ మంచి జరిగించి ఉద్యమంలో వీరంతా పాలుపంచుకుంటున్నారు. 

26 జిల్లాలకు సంబంధించి 26 మంది ప్రత్యేక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను సూపర్‌వైజరీ రోల్స్‌లో నియమించాం. జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఇతర అధికారుల ద్వారా అన్ని క్యాంపుల్లో తనిఖీల్లో వీరంతా పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఎలా జరుగతుందనే విషయంపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షలు నిర్వహిస్తారు. నేరుగా వారానికి ఒకరోజు కచ్చితంగా సీఎంవో, చీఫ్‌ సెక్రటరీ కూడా దీన్ని మానిటరింగ్‌ చేస్తారు. వీరు కూడా సమీక్ష నిర్వహిస్తారు. 

దేశ చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ చూడని విధంగా పేదల పట్ల ఇంతగా ప్రేమ, మమకారం చూపిస్తున్న ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఎక్కడ ఉండకపోవచ్చు. పేదవాడు ఎలా ఉన్నా, ఏ ఒక్కరూ పట్టించుకోని పరిస్థితులు పోయి.. ప్రతి పేదవాడికి మంచి జరగాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా చూడకపోయి ఉండవచ్చు. ఆంధ్రరాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం, మీ బిడ్డ జగన్‌ ప్రభుత్వంలో సాధ్యం అవుతుంది. ఈ కార్యక్రమం వల్ల ప్రతి పేదవాడికి ఇంకా మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ, దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచిచేసే పరిస్థితులు మెరుగ్గా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 
 

Back to Top