తాడేపల్లి: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవాడ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. యువతి రాములమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, వెంటనే విశాఖ తరలించాలని మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు సీఎం వైయస్ జగన్‌కు తెలిపారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడాలని, అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని మంత్రులను సీఎం ఆదేశించారు. మంత్రుల పరామర్శ.. చౌడవాడ బాధితురాలిని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. దిశా యాప్ ద్వారా పోలీసులు బాధితురాలిని రక్షించారన్నారు. ఇటువంటి ఘటనల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందన్నారు.