తిరుపతి: శ్రీ వేంకటేశ్వరస్వామినే రాజకీయ ఆయుధంగా మార్చుకున్న చంద్రబాబు, దైవ ద్రోహం పేరుతో వైయస్.జగన్ పై కుట్రకు పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... శ్రీ వేంకటేశ్వరస్వామిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారారని ఆరోపించారు. చింతామణి సతీసావిత్రిగా మారినట్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తాము తప్ప మరెవ్వరూ భక్తులు కారన్నట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తన రాజకీయాల కోసం వ్యవస్థలను వాడుకున్న చంద్రబాబు… ఇవాళ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరస్వామినే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. అయితే సిట్ నివేదికతో పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు తొలిసారిగా కూటమి పార్టీలతో కలిసి వారినీ తన తప్పులో భాగస్వామ్యులను చేస్తున్నాడని తేల్చి చెప్పారు. సిట్‌లో జంతుకొవ్వు వాడినట్టు లేకపోయినా... చంద్రబాబు అబద్ధాలు, దుష్ర్పచారం ఆగడం లేదని మండిపడ్డారు. కేవలం రాజకీయ లక్ష్యంతోనే మరలా ఏకసభ్య కమిషన్ పేరుతో మరో కుట్రకు తెరయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు వైయస్సార్ పైన కూడా పచ్చి అబద్దాలు మాట్లాడ్డంపై తీవ్రంగా ఆక్షేపించారు. తాను చేసిన తప్పులకు చంద్రబాబు కచ్చితంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఇంకా ఏమన్నారంటే... ● అడ్డంగా దొరికి చంద్రబాబు నంగి మాటలు.. గత పత్రికా సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు ఇవాళ మాత్రం నంగిగా మాట్లాడుతూ... వాస్తవాలు ప్రజలకు చెబుతున్నామంటున్నారు. కానీ వారి మాటల్లో మేం ప్రజలకు దొరికిపోయామన్న విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. గతంలో తాను నిర్వహించిన పత్రికా సమావేశాలకు భిన్నంగా ఇవాళ తొలిసారిగా మిగిలిన రెండు పార్టీల నాయకులను పిలిచి, తాను చేసిన తప్పులో ఆ రెండు పార్టీలను భాగస్వామ్యులను చేయడానికి ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి మేము అనేక కార్యక్రమాలు చేస్తుంటే.. ఇంత దారుణం జరగడం ఆశ్చర్యమని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఈ పదేళ్లలో పవన్ కళ్యాణ్ అనేకసార్లు నేను బాప్టిజమ్ తీసుకున్నాను. మా నాయన సాక్షాత్తూ దేవుడి దీపారాధనలోనే సిగరెట్ ముట్టించేవాడు మా ఇంట్లో ఏ రకమైన దైవ పూజలు జరగవు.. అవసరమైతే నేను గొడ్డు మాంసం తింటాను అంటూ ఇలాంటి మాటలు ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన ఇవాల సనాతన హైందవ ధర్మ పరిరక్షక అవతారిగా మారి చంద్రబాబు ఆలోచనలకు అమ్ముడుపోయాడు. ఇవాల్టి పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ● ఆలయాలపై మీ అరాచకాలు మర్చిపోయావా బాబూ.. చంద్రబాబు అయితే తనంత భక్తుడు లేడని.. తన ఊరు నుంచి ప్రతిరోజూ శ్రీ వేంకటేశ్వరస్వామి వైపు చూసిన తర్వాతే కార్యక్రమాలు మొదలుపెడతానని చెబుతున్నాడు. రోజు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. తన హాయంలో పదుల సంఖ్యలో దేవుడి ఆలయాలు కూల్చివేస్తే పలకని ఈ భక్తుడు.. ఇవాళ వైయస్.జగన్ హయాంలో దేవాలయాలన్నీ నాశనం చేశాడంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాతే తిరుమల కొండమీద మద్య మాంసాలు అనేకసార్లు పట్టుబడ్డాయి. బిర్యానీలు తింటూ తాగి గొడవులు చేస్తూ పట్టుబడ్డారు. కొద్ది రోజుల కిందటే మద్యం బాటిల్లు విచ్చలవిడిగా పడి ఉంటే.. దాన్ని ప్రశ్నించిన మా పార్టీ కార్యకర్త మీదే కేసు బనాయించారు. మీ హయాంలోనే వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయారు. దేవుడున్నాడు కాబట్టే 23 మైన్స్ పేల్చినా మేం బ్రతికామని చెబుతున్నారు. మీరు బ్రతికినందుకు మాక్కూడా సంతోషం చంద్రబాబు గారూ. మీ మీద దాడి చేసిన తర్వాత అందరూ నక్సల్స్ భయంతో గజగజ వణుకుతుంటే.. ఈ దాడి అమానుషమని గాంధీ విగ్రహం వద్ద వైయస్సార్ తో కలిసి మేము నిరసన దీక్ష చేసిన తర్వాతనే మీ పార్టీ కార్యకర్తలు బయటకు వచ్చారు. మీరు వెంకటేశ్వరస్వామి దయవలనే బ్రతికారు కానీ నేను చేసిన మంచి పనుల వల్లే బ్రతికాం అని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే అలిపిరి దగ్గరే మీ మీద ఎందుకు దాడి జరిగింది, అది కూడా జరగకూడదన్న ప్రశ్న వస్తుంది. మీరు ఏం చెప్పినా దాన్ని నమ్మించడానికి పత్రికలున్నాయన్న గర్వంతో సెప్టెంబరు 20, 2024న వైయస్.జగన్ పాలనలో లడ్డూలో నెయ్యికి బదులు, జంతుకొవ్వు వాడారన్న మాట ప్రపంచం అంతా వెళ్లింది. ఆ రోజు మీ మాటలపైనే మా పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లడంతో.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మిమ్నల్ని మందలించి సీబీఐతో సిట్ ఏర్పాటు చేశారు. సిట్ లో ఇద్దరు మీ పోలీసధికారులే ఉన్నారు. వాళ్లిచ్చిన నివేదికే సిట్ లో ఉంది. మీరు ఎన్ డీ డీ బీ నివేదిక చూసే మాట్లాడారు అని చెప్పారు. ఎన్ డీ డీ బీ నివేదికలో అనుమానాస్పదమైనవి ఉన్నాయి. దానికి ఆ పశువులు మేసే మేత కూడా కారణం అన్న విషయాన్ని మాత్రం పక్కనపెడుతున్నారు. ఒకవేళ జబ్బుపడిన ఆవులున్నా రిపోర్టులో ఇలాంటి మార్పులు ఉండే అవకాశం ఉందని ఎన్ డీ డీ బీ నివేదిక ఇచ్చింది. మీరు ఆవుకొవ్వు కలిసిందని చెప్పి వెనక్కి పంపించిన నాలుగు ట్యాంకుల నెయ్యిని మరలా మీరే లడ్డూ ప్రసాదంలో వాడారు. ఏడాదంతా అన్ని పనులుమానుకుని మీరు చేయించిన విచారణ నివేదికను కాదని... చంద్రబాబు, పయ్యావుల కేశవ్ సొంతంగా కొరియా నుంచి వచ్చిన శాంపిల్స్ రిపోర్టులో జంతుకొవ్వు ఉండొచ్చని చెప్పిన విషయాన్ని భక్తులకు చెప్పడానికి బాధపడిపోతున్నారు. ఒకవైపు సీబీఐ వేసిన సిట్ ఆవు,పంది కొవ్వు, చేప నూనెతో లడ్డూలు తయారు కాలేదని చెబితే... చంద్రబాబు మాత్రం దానికి కొత్త కలరింగ్ ఇస్తూ... తన భాగస్వామ్య పార్టీలతో వైయస్.జగన్ మీదే, దైవద్రోహానికి పాల్పడ్డారన్నట్టు.. శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూనే.. దుష్ర్పచారం చేస్తూ ఆయన మీదే బాంబులా వాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కచోట కూడా జంతుకొవ్వు కలిసిందని నివేదిక ఇవ్వకపోయినా.. వీళ్లే సొంత కవిత్వం అల్లి ఆపాదిస్తున్నారు. ● అయోధ్య లడ్డూల పైనా అబద్దాలు.. పవన్ కళ్యాణ్ అయితే మరింత దారుణంగా.. అయోధ్యకి పంపించిన లడ్డూలు కల్తీ అన్న విషయం ఆ రోజు ఎవరో చెబితే మాట్లాడాను అని చెప్పిన వ్యక్తి.. ఇవాళ మళ్లీ అయోధ్యకి పంపిన లడ్డూలు జంతుకొవ్వుతో తయారు చేసినవే అని మాట్లాడుతున్నాడు. ఆ రోజు అయోధ్యకు పంపించిన లక్ష లడ్డూలు... మీ ప్రభుత్వ హయాంలోనే పాలక మండలి సభ్యుడైన సౌరబ్ బోరా తాను రూ.30 లక్షల నెయ్యిని డొనేట్ చేస్తానని అందించి.. ఆయన తయారు చేసి లక్ష లడ్డూలు అయోధ్యకి పంపించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా అబద్దాలు చెప్పడం మానుకోవాలి. వై వీ సుబ్బారెడ్డే సీ ఎఫ్ టీ ఆర్ ఐ రిపోర్టు కోసం పంపిస్తే.. ఆయనే తొక్కి పెట్టారని చెప్పడం పూర్తిగా అసమంజసం. అసలు విచారణకు పంపించిందే మేమైతే తిరిగి మాపైనే లాజిక్ లేకుండా అపవాదు వేస్తున్నారు. ● మంత్రి పార్ధసారధి అబద్దాలు... మరోవైపు అప్పి పర్చేజింగ్ కమిటీని కూడా వదిలిపెట్టమని చెబుతున్నారు. కారణం అప్పటి కమిటీలో నేను కూడా ఉన్నాను కాబట్టి ఆ మాట చెబుతున్నారు, కానీ ఆ కమిటీలో ప్రస్తుతం మీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న పార్ధసారధి కూడా ఉన్నారు. అప్పట్లో బోర్డు సభ్యురాలుగా పనిచేసిన మరో వ్యక్తి, ప్రస్తుతం కూడా బోర్డులో సభ్యురాలిగానూ, ఎమ్మెల్యేగాను కొనసాగుతున్నారు. మంత్రి పార్ధసార్ధి గారు మాత్రం తనను సిట్ విచారణ పిలవలేదని చెబుతున్నారు. కానీ వాస్తవానికి సిట్ బృందం పార్ధసారధి ఇంటికి వెల్లి విచారించామని నాతో చెప్పారు. అయినా పచ్చి అబద్దాలు చెబుతున్నారు. నేను వెళ్లలేదు అంతా కరుణాకర్ రెడ్డి చూసుకున్నాడని మాట్లాడుతున్నారు. కానీ ప్రత్యేక ఆహ్వానితుడిగా మాత్రమే ఉన్నారు. ఆయనకు అంతకుమించి బోర్డులో ఎలాంటి పాత్ర ఉండదు. ● వాస్తవాలు తేలడంతో ఏకసభ్య కమిషన్ తో కుట్ర... నెయ్యి సరఫరా నిబంధనలను సడలించడం వల్లే వీళ్లంతా వచ్చారని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సరళీకృతి విధానాల్లో భాగంగా స్టార్టప్ కంపెనీలకు అవకాశాలివ్వాలని, కొత్తగా వచ్చిన పారిశ్రామిక వేత్తలకు అవకాశమివ్వాలన్న సదుద్దేశంతో నిబంధనలు సడలించాం. దురుద్దేశం మాకు ఉంటే.. ఏడాది పాటు చంద్రబాబు ప్రత్యేకంగా నియమించుకున్న ఇద్దరు అధికారులున్న, ఐదుగురు సభ్యులతో కూటిన సీబీఐ సిట్ మమ్నల్ని దోషులుగా ప్రకటించలేదు. దీనికి ఎందుకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు? తాము అడ్డంగా దొరికిపోవడంతో స్వామి వారికి ద్రోహం చేస్తున్నారంటూ.. దొంగల్ని పట్టుకుంటామని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏకసభ్య కమిషన్ వేసి మమ్నల్ని నేరస్దుల్ని చేయాలన్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇవాళ నేరస్తుడిగా ఉన్న ప్రీమియర్ డెయిరీ 2014-19 వరకు 80 శాతం వరకు మీ హాయంలోనే నెయ్యి సరఫరా చేసింది. ● అక్రమాలు మీ హయాంలోనే బాబూ... నువ్వుల నూనె ధర, నెయ్యి ధరకు పోల్చి చెబుతున్న పవన్ కళ్యాణ్.. మా హయాంలో నెయ్యి కేజీ రూ.350 కే సరఫరా చేస్తే చంద్రబాబు హయాంలో ప్రీమియర్ డెయిరీ నెయ్యి కేజీ రూ.271 కే సరఫరా చేసిన విషయం గుర్తు తెచ్చుకొండి. బోలేబాబాను 2018లోనే చంద్రబాబే తెప్పించారు. గత ప్రభుత్వ పాలనలో లడ్డూ నాణ్యత బాగాలేదు.. అందుకే భక్తుల సంఖ్య తగ్గిపోయిందని దారుణమైన అబద్దాలు చెబుతున్నారు. దీనిపై మీరు విచారణకు సిద్దమా? 2018లో ఫిబ్రవరిలో మీరు వేసిన టెండరు రూ.3.87 కోట్లకు రోజుకు 975 కేజీల నెయ్యిని ఆయా రోజుల్లో తయారు చేసే లడ్డూలకు వాసన రావడానికి అద్దడానికి కొన్నారని ఆధారాలతో చూపించారు. అంటే మీరు ఆ రోజు కల్తీ నెయ్యితో లడ్డూలు సరఫరా తయారు చేయడంతో వాటిని భక్తులు అసహ్యించుకుంటున్నారని.. వాటికి మరలా నెయ్యి అద్దడం కోసం మరో రూ.4 కోట్లతో నెయ్యి కొన్నారు. ఇది మీ హయాంలో జరిగిన విషయం. కొద్ది మంది అవినీతి అధికారులు, మీ హాయంలో మీరు ఏర్పాటు చేసిన టెక్నికల్ ఎక్ట్స్ పర్ట్స్, డెయిరీ సంస్థలు కుమ్మక్కై చేసిన అపరాధాన్ని సిట్ బయటపెట్టింది. మీ హాయంలో ఇదే సిట్ ఏర్పాటు చేయమని సుప్రీం కోర్టును అభ్యర్ధించమని మేం చేస్తున్న డిమాండ్ ను అంగీకరించే ధైర్యం మీకు ఉందా చంద్రబాబూ? ● అతి పెద్ద కుట్రకు తెరతీసిన చంద్రబాబు... తప్పు మేం చేయలేదు కనుకే సిట్ మమ్నలని దోషులుగా నివేదికలో కోర్టుకు సమర్పించలేదు. అంత దారుణమైన అపవాదు మోపిన మీరు క్షమాపణ చెప్పాల్సిందే. వైయస్.రాజశేఖర్ రెడ్డి రెండు కొండలే చేశాడని చంద్రబాబు మరో పచ్చి అబద్దం కూడా చెబుతున్నాడు. 2007లో మే 12న వైయస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో చాలా స్పష్టంగా మొత్తం 120 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 7 కొండలు శ్రీ వేంకటేశ్వరస్వామివే అని జీవో ఇచ్చారు. చంద్రబాబూ మీరు చెబుతున్నవి పచ్చి అబద్దాలు. చంద్రబాబు వైయస్సార్ మరణించిన 3 నెలల తర్వాత పాదయాత్ర చేశారు. ఇవాళ మాకు వస్తున్న అనుమానం ఏమిటంటే.. తన బలమైన ప్రత్యర్థి చనిపోయాడని స్వామివారికి ముక్కులు చెల్లించుకున్నాడనిపిస్తోంది. చివరికి శ్రీ వేంకటేశ్వరస్వామిని పావుగా వాడుకుని.. మమ్నల్ని దైవ ద్రోహులుగా చిత్రీకరించే అతి పెద్ద కుట్రకు చంద్రబాబు పాల్పడుతున్నాడు. ● స్వామి వారి విశేష సేవలో వైయస్సార్, వైయస్.జగన్ వైయస్.జగన్ చేసిన దైవ సేవ ఎవ్వరూ చేయలేదు. అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం చేయాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ మీకు రాలేదు. శ్రీ వేంకటేశ్వర ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో మా హయాంలోనే పాదరక్షలు ధరించకూడదని నిబంధన విధించాం. శ్రీ వేంకటేశ్వరస్వామి అఖండ కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని శ్రీ వేంకటేశ్వరభక్తి ఛానెల్ కూడా మా హయాంలోనే తీసుకొచ్చాం. కొండమీద హరినామ సంకీర్తన ఏర్పాటు చేసింది, నాదనీరాజనాన్ని తీసుకొచ్చింది కూడా మేమే. తిరుమలలో నిరంతరాయంగా భాగవతం, భారతంతో పాటు వేద ఘోష నిర్వహించాలని నిర్ణయం కూడా మేమే తీసుకున్నాం. వందకు పైగా పీఠాధిపతులతో సదస్సులు కూడా నిర్వహించాం. అన్యమతాల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం స్వామి వారి పాదాల చెంత ఉంచి పూజలు చేసిన మంగళసూత్రాలతో దాదాపు 46 వేల పెళ్లిళ్లు కూడా మా హయాంలోనే నిర్వహించాం. ఉమ్మడి రాష్ర్టంలో గ్రామ, గ్రామాన శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని కూడా మేమే తీసుకెళ్లాం. ● వైయస్.జగన్ హయంలో దేశవ్యాప్తంగా స్వామివారి ఆలయాలు... ఇవాళ తాము కొత్తగా 5వేల దేవాలయాలను కట్టబోతున్నామని చంద్రబాబు చెబుతున్నారు. వాస్తవానికి వైయస్.జగన్ హాయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3,500 దేవాలయాలు కట్టారు. వాటి నిర్మాణ భాగస్వామ్యం ఆరెస్సెస్ కి సంబంధించిన సంస్ధకు అప్పగించాం. వైయస్.జగన్ ఎక్కడ హైందవ ద్రోహం చేశారో సమాధానం చెప్పండి ? మ హాయంలో శ్రీవాణి పథకంపై విమర్శలు చేసిన మీరు... ఇవాళ మీ హయాంలో అదే శ్రీవాణి డబ్బుతో అమరావతిలో గుడి కడుతున్నారు. అదే డబ్బుతో గట్టు ఆంజనేయస్వామికి పవన్ కళ్యాణ్ డబ్బులిప్పించారు. అదే డబ్బుతో మీరు ఆలయాలు కడుతున్నారు.మీరు ఇవాళ కొత్తగా ఆలయాలు కట్టడం లేదు. జమ్మూకాశ్మీర్ లోనూ, నవీ ముంబాయిలోనూ, విశాఖలోనూ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలను వైయస్.జగన్ నిర్మించారు. చెన్నై లోనూ పద్మావతి ఆలయాన్ని నిర్మించారు. సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామికి చెందిన రూ.3వేల కోట్ల స్థలాన్ని ప్రైవేటు హోటల్ కి కట్టబెట్టిన మీరా దైవ చేస్తారు? వైకుంఠ ఏకాదశి 10 రోజులు ఎందుకు అని ప్రశ్నించారు. మేం ఆగమశాస్త్ర నిపుణులతో మేం చర్చించి.. 10 రోజులు పాటు నిర్వహిస్తే.. అలా నిర్వహించడం చేతగాక మీరు 2 రోజులు చాలు అన్నారు. మీరు ఎన్ని అభాండాలు వేసినా మేం నిజమైన స్వామి వారి భక్తులుగా ధైర్యంగా మాట్లాడుతున్నాం. మా మీద మీరు చేస్తున్న కుఠిల ప్రయత్నాని ఎండగడుతూనే ఉంటామని.. వైయస్ఆర్‌సీపీ హాయంలో ఎలాంటి తప్పులు జరగలేదని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మీలాంటి వాళ్లను మాత్రం దేవదేవుడు క్షమించడు చంద్రబాబూ అని హెచ్చరించారు.