విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యంలో బుధవారం సువర్ణాధ్యాయం లిఖించబడింది. ఇప్పటికే వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. 108 సర్వీసుల్లో మార్పులు ► అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారిని వెంటనే ఆదుకునే 108 సర్వీసులో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్స్‌లను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్స్‌లను కూడా వినియోగించనున్నారు. ► కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్‌లలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్‌ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్టు (ఏఎల్‌ఎస్)గా తీర్చిదిద్దారు. ► మరో 26 అంబులెన్స్‌లను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు. ఎన్నో సదుపాయాలు ► బీఎల్‌ఎస్ అంబులెన్స్‌లలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏఎల్‌ఎస్ అంబులెన్స్‌లలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారు. నియో నేటల్ అంబులెన్స్‌లలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను అమర్చారు. జనాభా–అంబులెన్స్‌ల నిష్పత్తి ► గతంలో సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్ ఉండేది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు మిన్నగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గరగా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండనుంది. ► గతంలో సంవత్సరానికి 6,33,600 కేసుల్లో సేవలందించగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో ఏడాదికి 12 లక్షల మందికి సేవలందించేలా తీర్చిదిద్దారు. ఎంఎంయూ(104)ల్లో సదుపాయాలు ► ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)తో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలందించనున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఔషధాలను ఉచితంగా అందజేస్తారు. ► ప్రతి ఎంఎంయూలో ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ)తో పాటు, గ్లోబల్ పొజిషనింగ్ విధానం (జీపీఎస్) కూడా ఉంటుంది. ► ఆధార్ కోసం బయోమెట్రిక్ ఉపకరణాలు, రోగుల డేటాను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. తద్వారా రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తయారు చేయడం సులువు అవుతుంది. వేగంగా సేవలు ► పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్‌లు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ► ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్‌సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు కలుగుతుంది. ► ప్రతి అంబులెన్స్‌లో ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్ (ఎండీటీ), మొబైల్ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.